నిర్మల మనసు
పురుషార్థాలలో డబ్బొకటి. ప్రతి మనిషీ సంపాదించాల్సిందే. ఆ సంపాదన ధర్మబద్ధం కావాలి. మనం సంపాదించింది పదిమందికీ ఉపయోగపడాలి.
కొందరు పైకి మురికోడుతుంటారు. మరి కొందరు లోపల మురికోడుతుంటారు. కొందరు చూడటానికి మల్లెపువ్వులా అందంగా వుంటారు. కానీ మనసంతా ముళ్లకంపే! కొందరు అందవికారంగా వుంటారు. కానీ మనసుమాత్రం వెన్నముద్దలా వుంటుంది. పారిజాతంలా స్వచ్ఛంగా వుంటుంది. అష్టావక్ర మహర్షి అంటాడు - మనిషి వంకరగా వున్నా ఫరవాలేదు. మనసు మాత్రం వంకరగా వుండకూడదని. మనిషి పుట్టాక విధిగా కొన్ని ధర్మాలు పాటించాలి. అందులో ‘శౌచం’ కూడా ఒకటి. శౌచం అంటే పరిశుభ్రత. ఇంగ్లిష్లో క్లీన్లీనెస్ అని అంటారు. ఇది బాహ్యమూ, అంతరమూ కూడా. అంతర్ శౌచమే అన్నింటికంటే ముఖ్యం. ఈర్ష్య, అసూయలు, రాగద్వేషాలు, కుళ్లూకుత్సితాలూ లేకుండా మనసు మంచిది కావాలి. మనసుబట్టే మాటలు. మనసు మంచిదైతే మాటా మంచిదవుతుంది.
పలికే వారి మనసును బట్టే మాట చల్లగా ఉండడమో, తియ్యగా ఉండడమో, వాడిగా ఉండడమో, వేడిగా ఉండడమో జరుగుతుంది. అయితే ఇవేవీ కావన్నట్లు ఒళ్లంతా చందన గంధాలు పూసుకొని మేము స్వచ్ఛంగా, శుభ్రంగా ఉన్నామనుకుంటే సరిపోదు. శౌచం శరీరానికీ మనస్సుకే కాదు, అన్నింటికీ కావాలి. అలాగే డబ్బు కూడా. సంపాదించే డబ్బు సక్రమమైనదై వుండాలి. ధర్మమార్గంలో సంపాదించినదై వుండాలి. అప్పుడే దానికి యోగ్యత, గౌరవం. అర్థ శౌచమంటారు దీన్ని. అంతర్ శౌచం ఎంతముఖ్యమో, అర్థ శౌచం కూడా అంతే ముఖ్యం. శృంగేరీ శారదా పీఠాధిపతి జగద్గురువులు అయిన శ్రీ భారతీ తీర్థ మహాస్వామి ఒకసారి అనార్యుల ధనం, అసత్పరుషుల ధనం గురించి మాట్లాడుతూ - ద్రవ్యం న్యాయార్జితమై ఉండాలి. అప్పుడే అది దానానికీ, ధర్మానికీ పనికొస్తుందని సోదాహరణంగా చెప్పారు.
ఒక వృద్ధుడు క్రయ, విక్రయ దస్తావేజులు రాసుకుంటూ జీవనం సాగించే వాడు. ఎంత భారీ ఆస్తి అయినా దానికి సంబంధించిన డాక్యుమెంటు రాయవలసి వస్తే 2 రూపాయలు మాత్రమే ఆయన వసూలు చేసేవారట. ఒకసారి ఆయన స్నేహితుడు ‘అదేమిటోయ్, 10,000 రూపాయల డాక్యుమెంటైనా, లక్ష రూపాయల డాక్యుమెంటైనా రెండు రూపాయలే తీసుకుంటావు. ఇదేం న్యాయం’? అని అడిగాడు.
దస్తావేజు విలేఖరి నవ్వుతూ ‘న్యాయం కాక ఇంకేముంది? పదివేల రూపాయల దస్తావేజైనా, లక్షరూపాయల దస్తావేజైనా ఒకే విధంగా రాస్తాను. కాకపోతే లక్ష రూపాయల డాక్యుమెంటులో ఒక సున్నా ఎక్కువ పెడతాను. ఆ ఒక్క సున్నా కోసం ఎక్కువ వసూలు చేయడం న్యాయమంటావా’? అని ప్రశ్నించాడు. దానికి మిత్రుడు ఆశ్చర్యపోయాడు. అదీ అర్థశౌచమంటే!
పురుషార్థాలలో డబ్బొకటి. ప్రతి మనిషీ సంపాదించాల్సిందే. అయితే ఆ సంపాదన ధర్మబద్ధం కావాలి. ఇంకోమాట చెబుతాను - సంపాదించింది మనమొక్కరిమే అనుభవించటం కాదు. మనం సంపాదించింది పదిమందికీ ఉపయోగపడాలి. ఇస్తే తరిగిపోతుందనుకుంటాం. కానీ అది సరికాదు. నూతిలో తోడుతూంటేనే నీరు ఊరుతూ ఉంటుంది. అదీ భారతీస్వామి చెప్పిన రహస్యం.
- ప్రయాగ రామకృష్ణ.