ప్రశాంత నిలయం.. దత్తాలయం
భక్తుల కొంగుబంగారం
600 ఏళ్ల చరిత్రగల పుణ్య క్షేత్రం
రేపు గురుపౌర్ణమి ఉత్సవం
హత్నూర : దత్తాత్రేయ స్వామి.. గురువులకే గురువు సద్గురువు.. సమస్త పాపాలను, రోగబాధలను, గ్రహ బాధలను హరించి సర్వసంపదలను ఆయురారోగ్యాలను ప్రసాదించగల దేవుడు శ్రీ గురుదత్తాత్రేయ స్వామి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమే శ్రీ దత్తాత్రేయస్వామి. దత్తాత్రేయుని అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి తపోభూమి, ఆయన ప్రధాన శిష్యులు నామదారకుల వారి తపస్సు చేసి నిర్యాణం పొందిన పుణ్యభూమే శ్రీ దత్తాచల క్షేత్రం.
క్షేత్ర చరిత్ర
మెదక్ హత్నూర మండలం మాదూర గ్రామ శివారులోని గుట్టల్లో వెలసిన దత్తాచలక్షేత్రం(దత్తాలయ గుట్ట) 600 సంవత్సరాల పైబడిన చరిత్ర ఉంది. అధర్మవర్తనులైన మానవులను సన్మార్గంలో నడిపించి ధర్మములను బోధించుటకు 12వ శతాబ్దంలో శ్రీపాద శ్రీవల్లబుల వారీగా, 15వ శతాబ్దంలో నృసింహ సరస్వతి స్వామిగా అవతరించారు. ఉపనయనం అనంతరం సన్యాసం స్వీకరించి మూగవాళ్లయిన తన సోదరులను సంపూర్ణ ఆరోగ్య వంతులుగా చేసి తల్లిదండ్రుల ఆజ్ఞతో సన్యసించి భారత దేశంలోని పలు పుణ్యక్షేత్రాలను సందర్శించారు. గురుదర్శనమును, మానవుల బాధ్యతలను దేశవ్యాప్తంగా బహుళప్రచారం చేసి అనేకమంది భక్తులకు ఆరాధ్యదైవమై శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ఎన్నో పుణ్యక్షేత్రాల్లో తపం ఆచరించి శ్రీ దత్తాచలక్షేత్రంలోని గుహలో కొంతకాలం తపస్సు చేసి కార్ణాటక రాష్ట్రంలోని గానగాపురంలో వారి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని అచట కొంతకాలం భక్తుల కోరికలు తీరుస్తూ సనాతన ధర్మంలు ఉపదేశించారని పురాణాలు శాస్త్రాలు తెలుపుతున్నాయి.
గురుపౌర్ణమి ఉత్సవాలకు ఏర్పాట్లు
గురుపౌర్ణమి సందర్భంగా ఈనెల 19న క్షేత్రంలో దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక అభిషేకాలతో పాటు పూజలు నిర్వహిస్తున్నట్లు సబాపతిశర్మ తెలిపారు. పౌర్ణమి సందర్భంగా ఏకాదశ రుద్రాభిషేకంలు, మృత్యుంజయ హోమం, చండీహోమంతోపాటు ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నామన్నారు. పుష్కరణిలో వరుణజపం చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. సాయంత్రం గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో స్వామివారి ఉత్సవ మూర్తితో ఊరేగింపు ఉంటుందని తెలిపారు.
రాతిబండపై పాదుకలు
గుట్టల్లోని ఓ పెద్ద రాతిబండపై దత్తాత్రేయస్వామి వారి పాదుకలు ఉన్నాయి.ఈ పాదుకలను దత్తాత్రేయస్వామి పాదుకలుగా భక్తులు మొక్కుతు మొక్కులు చెల్లించుకుంటున్నారు. కొన్నేళ్ళ నుంచి బ్రహ్మోత్సవాలను ఈ క్షేత్రంలో ఘనంగా నిర్వహిస్తుండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటు దత్తాత్రేయస్వామి వారి అనుగ్రహం పొందుతున్నారు. ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకునిగా ఆంజనేయస్వామి ఉంటు క్షేత్రాన్ని రక్షిస్తూ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకున్న భక్తులకు శుభాలు కలగాలని ఆశీర్వదిస్తూ ఆలయానికి ముందు భాగాన ఉన్నారు.
దాతల సహకారంతో నిర్మాణం
దత్తాచల క్షేత్రం గుహలో ఉన్న దత్తాత్రేయ స్వామివారికి కొంతమంది దాతలు ముందుకు రావడంతో రెండేళ్ళ నుంచి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టు క్షేత్ర నిర్వాహకులు శ్రీచక్రార్చకులు, దత్త ఉపాసకులు సబాపతిశర్మ తెలిపారు. దత్తజయంతి, గురుపౌర్ణమి ఉత్సవాలను కూడా నిర్వహిస్తూ భక్తులకు స్వామివారి కృపను అందించేందుకు ప్రత్యేక పూజలు చేస్తున్నామన్నారు. దత్తాత్రేయ స్వామి వారిని భక్తులందరూ దర్శించుకునేందుకు ఇబ్బందిగా ఉన్నందునే నూతనంగా అదే స్థానంలో బండరాళ్ళను కొంత మేరకు తొలగించి ఆలయాన్ని నిర్మించాలన్న సంకల్పంతో ఆలయాన్ని నిర్మిస్తున్నామన్నారు.