sri krishna deva raya college
-
ఖాకీ సైంటిస్ట్
ఎస్కేయూ, న్యూస్‌లైన్ : రాష్ట్ర పోలీసు డెరైక్టర్ జనరల్ (డీజీపీ) బయ్యారపు ప్రసాదరావుకు సమాజం, సైన్స్ రెండు కళ్లు లాంటివి. ఒకవైపు పోలీస్ బాస్‌గా రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షిస్తూనే... మరోవైపు భౌతిక శాస్త్రంలో విలువైన పరిశోధనలు చేస్తున్నారు. వృత్తి రీత్యా, ప్రవృత్తి రీత్యా సమాజ శ్రేయస్సుకు పాటుపడుతున్నారు. ఆయన పరిశోధనలకు గాను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం బుధవారం డాక్టరేట్ ప్రదానం చేసింది. ప్రసాదరావు యూజీసీ-బీఎస్ఆర్ ఎమిరేటర్స్ శాస్త్రవేత్త ఆచార్య రాజూరి రామకృష్ణారెడ్డి పర్యవేక్షణలో ‘స్టడీస్ ఆన్ వేవ్-పార్టికల్ డ్యూయల్టీ ఆఫ్ లైట్’ అనే అంశంపై పరిశోధన చేశారు. వర్సిటీలోని ఫిజిక్స్ విభాగంలో జరిగిన వైవాలో ఆయన తన పరిశోధన గురించి వివరించారు. కాంతి.. కణ-తరంగ స్వభావాలు కలిగి ఉంటుందని న్యూటన్,హేగెన్, ప్రేనల్ లాంటి శాస్త్రవేత్తలు నిరూపించారు. న్యూటన్ కాంతి సిద్ధాంతాన్ని బలపరుస్తూ ప్రసాదరావు పరిశోధన కొనసాగింది. ప్రతి వస్తువుపై ఫ్లూయిడ్ కొద్ది మోతాదులో ఉంటుందని, దీనిపై ఒత్తిడి కలగజేస్తే న్యూటన్ వలయాల రూపంలో ఉన్న సాంద్రత తరంగాలు విస్తరిస్తాయని తన పరిశోధన ద్వారా నిరూపించారు. చమురు, సబ్బు నీరు తదితర ద్రవ పదార్థాలపై ఒత్తిడిని కలగజేసి... దీనివల్ల కలిగే న్యూటన్ వలయాలను విశ్లేషించి కాంతి స్వభావాన్ని తెలియజేశారు. కాంతితో కలసికట్టుగా ఉండే పోటాన్లను క్వాంటమ్ సిద్ధాంతం ద్వారా విశ్లేషించారు. ‘వ్యతికరణం-వివర్తనం’ అనే భావనలు కణ సిద్ధాంతంపై ఆధారపడి పనిచేస్తాయని వివరించారు. కానిస్టేబుల్ కొడుకు.. అసాధారణ మేధావి డీజీపీ ప్రసాదరావు తండ్రి శ్రీనివాస్ ఒక సాధారణ కానిస్టేబుల్. ప్రసాదరావు చిన్నతనం నుంచే కష్టపడి ఈ స్థాయికి ఎదిగారు. పదో తరగతిలో రాష్ట్రంలో 13వ ర్యాంకు సాధించారు. ఇంటర్, డిగ్రీ విజయవాడ లయోలా కాలేజీలో చదివా రు. మద్రాసు ఐఐటీలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. ఆ వెంటనే జూనియర్ లెక్చరర్‌గా ఎంపికై ప్రకాశం జిల్లా తాళ్లూరులో పనిచేశారు. రెండు నెలలు తిరగక ముందే ఎస్బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీఓ) ఉ ద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తూనే వైజాగ్‌లో సివిల్ సర్వీసెస్‌కు సన్నద్ధమయ్యా రు. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆప్షనల్స్‌గా తొ లి ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించారు. అత్యున్నత పోలీసు అధికారిగానే కా కుం డా ఓ శాస్త్రవేత్తగా, పరిశోధకుడిగా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అభినందనల వెల్లువ డాక్టరేట్ పొందిన డీజీపీ ప్రసాదరావును ఎస్కేయూ వీసీ ఆచార్య రామకృష్ణారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. వైవాకు వీసీ కూడా హాజరై రెండు గంటల పాటు ప్రసాదరావు వివరించిన విషయాలను ఆసక్తిగా విన్నారు. సర్వీసు అనంతరం ఆయన్ను ఎస్కేయూ విజిటింగ్ ప్రొఫెసర్‌గా తీసుకుంటామని తెలిపారు. అందరికీ థ్యాంక్స్ తాను నాలుగేళ్లుగా ఎస్కేయూలో పరిశోధనలు చేస్తున్నానని డీజీపీ ప్రసాదరావు తెలి పారు. తనకు సహకరిం చిన ఆచార్య రాజూరి రామకృష్ణారెడ్డి, వీసీ కాడా రామకృష్ణారెడ్డి, రిజిస్ట్రార్ ఆచా ర్య గోవిందప్ప, సహాయ ఆచార్యులు రామగోపాల్ తో పాటు తోటి పరిశోధక విద్యార్థులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
వర్సిటీల్లో వసూల్ రాజాలు
సాక్షి ప్రతినిధి, అనంతపురం : అధికారంలో ఉండగానే నాలుగు రాళ్లు వెనకేసుకునేందుకు తెలంగాణకు చెందిన ఓ కీలక మంత్రి పావులు కదుపుతున్నారు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తోన్న 2,100 మంది టీచింగ్ అసిస్టెంట్లను అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమించి, క్రమబద్ధీకరిస్తామని ఎర వేశారు. తన అనుచరులను వర్సిటీలకు పురమాయించి ఒక్కో టీచింగ్ అసిస్టెంట్ నుంచి రూ.రెండు లక్షల నుంచి రూ.మూడు లక్షల వరకు వసూలు చేయిస్తున్నారు. అనంతపురం జిల్లాలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం(ఎస్కేయూ), జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్టీయూ)లో మంత్రి అనుచరుల వసూళ్ల బాగోతం బహిర్గతమైంది. వసూలు చేసిన వారిపై కేసులు పెట్టేందుకు సిద్ధమైన జేఎన్టీయూ, ఎస్కేయూ యాజమాన్యాన్ని మంత్రి తీవ్ర స్థాయిలో బెదిరించినట్లు వర్సిటీ అధికారవర్గాలు వెల్లడించాయి. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలో 32 విశ్వవిద్యాలయాల్లో 2,100 మంది కాంట్రాక్టు పద్ధతిలో టీచింగ్ అసిస్టెంట్లుగా ఐదారేళ్ల నుంచి పనిచేస్తున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తోన్న టీచింగ్ అసిస్టెంట్లను అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమించి, క్రమబద్ధీకరించిన దాఖలాలు వర్సిటీల చరిత్రలో మచ్చుకైనా కన్పించవు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి వర్సిటీల వారీగా నోటిఫికేషన్లు జారీ చేస్తారు. రాత, మౌఖిక పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమిస్తారు. ఈ ప్రక్రియలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే టీచింగ్ అసిస్టెంట్లకు కనీసం మార్కుల్లో వెయిటేజీ కూడా ఇవ్వరు. కానీ.. ప్రభుత్వంలో ముఖ్య భూమిక పోషిస్తోన్న తెలంగాణ ‘కీలక’ మంత్రికి అవేమీ పట్టలేదు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తోన్న టీచింగ్ అసిస్టెంట్ల సర్వీసును క్రమబద్ధీకరించడమే కాకుండా.. అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమిస్తామంటూ వల విసిరారు. ఒక్కో టీచింగ్ అసిస్టెంట్ కనీసం రూ.రెండు లక్షల నుంచి రూ.మూడు లక్షల వరకూ ముట్టజెప్పాలని షరతు విధించారు. ఇదే షరతుపై వర్సిటీలకు తనకు సన్నిహితులైన అనుచరులను పంపి.. టీచింగ్ అసిస్టెంట్లతో గుట్టుగా సమావేశాలు నిర్వహింపజేస్తున్నారు. ఆ క్రమంలోనే మంగళవారం ఎస్కేయూలో.. బుధవారం జేఎన్టీయూలో టీచింగ్ అసిస్టెంట్లతో మంత్రి అనుచరులు రహస్యంగా సమావేశమయ్యారు. ఎన్నికలు షెడ్యూలు ఎప్పుడైనా రావచ్చునని.. అప్పుడు ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి అది అడ్డొస్తుందని.. ఆలోగానే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి అనుచరులు స్పష్టమైన హామీ ఇచ్చారు. సమావేశంలోనే ఒకరిద్దరు టీచింగ్ అసిస్టెంట్లను సెల్ఫోన్లో నేరుగా మంత్రితోనే వారు మాట్లాడించడంతో తక్కిన వారిలో నమ్మకం కుదిరింది. బుధవారం సాయంత్రంలోగా డబ్బులు ముట్టజెబితే.. పక్షం రోజుల్లోనే నియామకపు ఉత్తర్వులు అందించే పూచీ తమదని సదరు మంత్రి అనుచరులు హామీ ఇచ్చేశారు. మంత్రి, ఆయన అనుచరుల మాటలను నమ్మిన ఎస్కేయూలోని 24 మంది టీచింగ్ అసిస్టెంట్లు.. జేఎన్టీయూలోని 59 మంది టీచింగ్ అసిస్టెంట్లు డబ్బులు ముట్టజెప్పారు. రెండు వ ర్సిటీల్లోని టీచింగ్ అసిస్టెంట్ల నుంచి సుమారు రూ.రెండు కోట్లను మంత్రి అనుచరులు వసూలు చేశారు. ఇది కాస్త వర్సిటీల యాజమాన్యాల దృష్టికి వెళ్లడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. టీచింగ్ అసిస్టెంట్ల నుంచి డబ్బులు వసూలు చేసిన మంత్రి అనుచరులపై కేసులు పెట్టడానికి సమాయత్తమయ్యారు. ఇది పసిగట్టిన మంత్రి వర్సిటీల యాజమాన్యాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మంత్రి బెదిరింపులకు తలొగ్గిన యాజమాన్యాలు.. కేసు పెట్టేందుకు వెనుకంజ వేశాయి.