ఇంటి దొంగలు పట్టుబడ్డారిలా...
వేములవాడ, న్యూస్‌లైన్ : రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన నాంపెల్లి శ్రీ లక్ష్మీనృసింహ స్వామి సన్నిధిలో హోంగార్డులు చేసిన నిర్వాకం తాలూకూ సీసీ కెమెరా వీడియో టేపులను ఆలయ అధికారులు పోలీసులకు శుక్రవారం అందించారు. పక్కా పథకం ప్రకారమే చోరీకి పాల్పడినట్లు స్పష్టమైంది.
నాంపెల్లి ఆలయం లో హుండీలో డబ్బులు బుధవారం రాత్రి చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఆలయానికి కాపలా ఉండే హోంగార్డులే ఈ చోరీ కేసులో నిందితులు కాగా, వారు పథకం ప్రకారమే ఈ చోరికి పాల్పడ్డారు. తొలుత ఆలయ ఆవరణలో కి చేరుకున్న ఇద్దరు హోంగార్డులు వారి స్నేహితుడు కలిసి ఆలయ ప్రాంతమంతా పరిశీలించారు. అనంతరం వారి వద్దనున్న రెండో తాళం చెవితో గుడి తలుపులు తెరిచి లోనికి ప్రవేశించారు. సీసీ కెమెరా దిశ మార్చే ప్రయత్నం చేశారు.
కెమెరాలు చిత్రీకరించడం మానేశాయ ని భావించి హుండీని బోర్లించి సొమ్ము గుమ్మరించారు. కిందపడ్డ సొమ్మంతా అక్కడే ఆరేసి ఉన్న పూజారి పంచెలో మూటకట్టుకున్నారు. ఏ అనుమానమూ రాకుండా హుండీలను యథాస్థానంలో ఉంచి, తాళాలు వేసి వెళ్లిపోయారు. ఇదంతా కెమెరాల్లో రికార్డయింది. గురువారం ఆలయానికి వచ్చిన పూజారి హుండీ సీల్ తొలగించి ఉండడాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడం విచారణలో హోంగార్డుల నిర్వాకం బయటపడిన విషయం తెలిసిందే.
పరారీలో హోంగార్డులు
నిందితులైన హోంగార్డులు లకావత్ శ్రీనివా స్, ఈ.రాజూనాయక్ పరారీలో ఉన్నారని పోలీసు లు వెల్లడించారు. మరో నిందితుడు రవి మాత్రం పోలీసుల కస్టడీలో ఉన్నట్లు తెలిసింది. గతంలో గుట్టపై జరిగిన దొంగతనాలతో వీరికి ఏదైనా సంబంధం ఉందా? అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు సమాచారం. సదరు హోం గార్డులు పట్టుబడితే మరిన్ని వివరాలు వెలుగుచూసే అవకాశముందని భావిస్తున్నారు.