Sri Ramayana
-
మరో రెండు రోజుల్లో స్పెషల్ టూరిస్ట్ ఎక్స్‌ప్రెస్
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర రైల్వేశాఖ ఆధ్వర్యంలో స్పెషల్ టూరిస్ట్ రైలు పట్టాలెక్కనుంది. ఇండియా శ్రీలంక మధ్య ముఖ్యమైన ప్రదేశాలను కలుపుతూ శ్రీరామాయణ యాత్ర- శ్రీలంక ఎక్స్‌ప్రెస్ టూరిస్టులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. నవంబరు 14నుంచి 16 రోజుల యాత్ర మొదలు కానుంది. అలనాటి రామాయణ కాలంనాటి దృశ్యాలను కళ్లకు కట్టే అనుభూతిని ప్రజలకు కల్పించేందుకు భారతీయ రైల్వే ఈ సరికొత్త రైలును పరిచయం చేస్తోంది. 800 సీటింగ్ కెపాసిటీతో శ్రీ రామాయణ యాత్ర- శ్రీలంక పేరిట శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్‌కు మరో రెండురోజుల్లో పచ్చ జెండా ఊపేందుకు రైల్వే అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రత్యేక రైలు ద్వారా శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య నుంచి కొలంబో దాకా అద్భుతమైన ప్రయాణం సాగుతుందని గోయల్ ఇటీవల ట్విటర్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. సందర్శించే ప్రదేశాలు ఢిల్లీ నుంచి బయల్దేరి మొదట అయోధ్యలో ఆగుతుంది. ఆ తరువాత హనుమాన్ గఢీ రామ్‌కోట్, కనక భవన్ ఆలయ ప్రదేశాలకు చేరుతుంది. అనంతరం నందిగ్రామ్, సీతామర్హి, జనక్‌పూర్, వారణాసి, ప్రయాగ్, శ్రింగ్వర్పూర్, చిత్రకూట్, నాసిక్, హంపి ద్వారా రామేశ్వరం చేరుతుంది. ట్రావెల్ ప్యాకేజ్ సమయం: 16 రోజులు ప్యాకేజ్ ధర: ఒక్కొక్కరికి రూ. 15,210, భోజనం, వసతి సదుపాయాలు ఇందులో భాగం. అయితే శ్రీలంక వెళ్లాలనుకొంటే.. ఒక్కొక్కరూ ప్రత్యేక ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది. శ్రీలంక ప్రయాణం శ్రీలంకలోని క్యాండీ, నువారా ఎలియా, కొలంబో, నెగోంబోల మీదుగా కూడా ప్రయాణం సాగుతుంది. అయితే ఇందుకు రూ. 36,970లు అదనం. కాగా శ్రీలంకను ఈ ప్రాంతాల్లో సందర్శించాలనుకునే పర్యాటకులు చెన్నై నుంచి కొలంబోకు విమానంలో ప్రయాణించాల్సి ఉంటుందని భారతీయ రైల్వే వెల్లడించింది. Retracing the Epic Journey of Lord Rama: Indian Railways to introduce a special tourist train 'Shri Ramayana Express' which will cover all the places from Ayodhya to Colombo via Rameshwaram, on the Ramayana circuit.https://t.co/WR9HIYl0ae pic.twitter.com/jcGKeiBz12 — Piyush Goyal (@PiyushGoyal) July 10, 2018 -
నేర్చుకోవడంలో మొదటి మెట్టు ఫెయిల్యూర్!
విద్య - విలువలు శ్రీరామాయణం ఉంది. సీతమ్మతల్లిని రావణాసురుడు అపహరించాడు. ఈ విషయం రాముడికి తెలియదు. రాముడు దేముడని రామాయణం ఎక్కడా చెప్పదు. రాముడు మనుష్యుడిగా వచ్చాడు. మీరు కూడా రాముడు మనుష్యుడనే భావనతోనే రామాయణం చదవండి, మీకు బాగా ఉపయోగపడుతుంది. అది నరుడి కథ. సీతాపహరణం జరిగింది. లక్ష్మణస్వామి వెనక్కి వచ్చేశాడు. ఎవరెత్తుకెళ్ళారో ఆయనకి తెలియదు. ఏం జరిగిందని రాముడు గోదావరినడిగాడు. చెట్లను అడిగాడు. అరణ్యాన్ని అడిగాడు. మృగాలను అడిగాడు. ఏవీ పలకలేదు. ఎత్తుకుపోయినవాడు రావణాసురుడని వాటికి తెలుసు. అన్నీ చూశాయి. కానీ అవి రావణాసురుడికి భయపడ్డాయి. చెప్తే చంపేస్తాడు. ఎవరూ చెప్పకపోయేసరికి రాముడికి విపరీతమైన కోపమొచ్చింది. ఎవరికైనా ఆ క్షణంలో కోపమొస్తుందా, రాదా ! ’’నా భార్యను ఎవడో ఎత్తుకుపోయాడు. నేనింతకాలం ధర్మానికి కట్టుబడ్డాను. నా భార్యను ఎత్తుకుపోయిన వాడు ధర్మం విడిచిపెట్టాడు. అయినా వాడికి ఇవి భయపడుతున్నాయి. నేను ధార్మికంగా బతుకుతుంటే నన్ను చేతకానివాడినని అనుకుంటున్నాయి. అంటే ధర్మానికి ఇవి రోజులు కావు. నేనూ ధర్మాన్ని కాసేపు పక్కనబెట్టేస్తా. ఇప్పుడు నా విలువిద్య ఏపాటిదో చూపిస్తా. తమ్ముడా, లక్ష్మణా! నా బాణాలు ప్రయోగిస్తున్నాను. వాటితో శరపంజరాన్ని కడతాను. పక్షులు కాదుకదా, దేవతలు కూడా తిరగలేరు. ఈ భూమ్మీద ప్రాణి అనేది ఉండదిక. సమస్త ప్రాణులనూ లయం చేసేస్తాను’’ అంటూ ఊగిపోతున్నాడు రాముడు. ధర్మానికి రోజులు కావు అని మనమూ నిత్యవ్యవహారంలో అంటూంటాం. కోపమొస్తే ఎవరికైనా అంతే. రాముడు బాణ ప్రయోగం మొదలుపెడితే ఆయన భుజా లు తాండవం చేస్తాయి. ఒక గంటా 48 నిమిషాల్లో 14 వేలమంది రాక్షసులను మట్టుబెట్టాడు ఒకానొక సమయంలో. ఆయనకు విశ్వామిత్రుడు, వశిష్ఠుడు ఎంత అస్త్రవిద్య ఇచ్చారంటే... మీరు బాలకాండ చదివితే తెలుస్తుంది. సంకల్పంచేసి మంత్రాన్ని అభిమంత్రించి విడిచిపెడితే చాలు, సమస్త లోకాల్ని నాశనం చేసేస్తాయి. ఊగిపోతున్నాడు కోపంతో.. బాణంతీసి ఎక్కుపెడుతున్నాడు. ఇంతలో లక్ష్మణస్వామి వచ్చి కాళ్ళమీద పడి ఒక్కటే ఒక్కమాట అడిగాడు - ‘‘అన్నయ్యా! వదిన కనబడడంలేదని లోకాన్నంతటినీ చంపేయటానికా గురువులయిన విశ్వామిత్రుడు, వశిష్ఠుడు మనకు విద్య ఇచ్చింది? అన్నయ్యా! నీ స్వార్థంకోసం ఈ అస్త్రాలను ఎన్నటికీ వాడవనీ, లోక క్షేమం కోసం మాత్రమే వాడతావని గురువులు ఈ విద్యను నీకిచ్చారు. వదిన కనబడనప్పుడు, ఎత్తుకు పోయినవాడు ఎవడో వాడిని వెతికి పట్టుకుని చంపకుండా, వీళ్ళెవరూ నీ ప్రశ్నలకు జవాబు చెప్పలేదనే కోపంతో లోకాలనన్నిటినీ చంపేస్తావా? దానిని లోక క్షేమానికే ఉపయోగించాలన్నయ్యా, వద్దు, వాటి జోలికెళ్ళొద్దు’’ అన్నాడు ప్రాథేయపడుతూ. రాముడు వెంటనే ఏమన్నాడో తెలుసా... ‘‘తమ్ముడా! మంచి మాట చెప్పావు. నిజంగా ఈ విద్యను గురువుగారు మనకు అందుకు ఇవ్వలేదు. ఎవడు సీతమ్మను అపహరించాడో వాడిని వెతుకుదాం పద. నేనిక ఈ అస్త్రాన్ని ప్రయోగించను’’ అని వెనక్కి తీసుకున్నాడు. ఒక్కటి ఆలోచించండి. సైంధవుడికి ధర్మరాజు ప్రాణభిక్ష పెడితే పరమశివుడి గురించి తపస్సుచేసి ఒక అక్కరలేని కోరిక కోరి తాను నాశనమవడమే కాకుండా శాశ్వతమైన అపకీర్తి తెచ్చుకున్నాడు. రాముడు మాత్రం ఒక్క క్షణం కోపానికి వివశుడైపోయినా, లోకాన్ని నాశనం చెయ్యకుండా వెంటనే నిగ్రహించుకున్నాడు. రావణుడిని వెతికాడు, చివరకు సంహరించాడు. అందుకే త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం పోయి కలియుగం కూడా వచ్చేసింది. అయినా ఇప్పటికీ రాముడే ఆదర్శవంతుడయ్యాడు. ఆయనకు దేవాలయం కట్టి పూజ చేస్తున్నాం. నామం జపిస్తున్నాం. ఎందుకంటే... రాముడు దైవమనుకోకండి. ఒకానొక క్లిష్ట సమయం వచ్చినప్పుడు దారుణమైన పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటే శాశ్వతకీర్తి పొందుతాడో అటువంటి అడుగువేశాడు తప్ప, ఆవేశంలో ఊగిపోయినా నిగ్రహించుకుని వెనకముందులాలోచించాడు తప్ప దానికి వశమైపోలేదు. ఒక్క సంఘటనతో పాతాళమంత కిందకు వెళ్ళవలసినవాడు అలా వెళ్ళకుండా ఒక్క క్షణం ఆగి ఆలోచించి విచక్షణా శక్తిని ఉపయోగించిన ఫలితం ఎలా ఉందో చూసారుగా. ఇటువంటి సందర్భంలోనే ఆవేశాన్ని నిగ్రహించుకోలేని సైంధవుడు ఎంతగా దిగజారిపోయాడో యుగాలు మారినా అతని బలహీనతని లోకం ఎలా గుర్తుంచుకుని అలా బతకవద్దని తమ పిల్లలకు తరతరాలుగా ఎలా చెబుతూ వస్తుందో చూశారుగా... అలాగే కేవలం గురువుగారికిచ్చిన మాటకోసం ఒక్క రూపాయి కూడా పుచ్చుకోకుండా లక్షా 76వేల పోలియో ఆపరేషన్లు చేసిన ఒక డాక్టర్ ఎందరికో ఆరాధ్యుడయ్యాడు. లోకక్షేమంకోసం గురువుగారికి, పెద్దలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది ఎవరినైనా ఎంత ఉన్నత శిఖరాలకు చేరుస్తుందో చూశారుగా. ఇది విస్ఫోటనా శక్తి. మీరు పిల్లలు. మీలో అంత తేజస్సు, అంత బలం ఉంటుంది అయితే జీవితంలో ఏ పొరబాటు జరిగినా మీరు కోపంతోటి, ఉద్రేకంతోటి పదిమందిని బాధపెట్టే నిర్ణయాలు ఎప్పుడూ చేయకండి. పరిశీలించుకుని - ‘‘నా పొరబాటు దిద్దుకుంటాను, ఎవడు ఏమన్నా అనుకోనీయండి. జీవితంలో పైకి వస్తాను’’ అని సంకల్పించుకుని అలా రావడానికి ప్రయత్నించండి. మాజీ రాష్ర్టపతి అబ్దుల్ కలాంగారంతటివాడి జీవితం ఫెయిల్యూర్‌తోనే స్టార్టయింది. ఆయన కోరుకున్న ఉద్యోగానికి సెలక్ట్ కాలేదు. వేరొకదానికి సెలక్టయి, నిరాశపడి తర్వాత ఒక స్వామీజీ ఉద్బోధంతో వెళ్ళి జాయినయ్యారు. అంతే ఇక మళ్ళీ వెనకకు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆయన తన అనుభవంతో ఫెయిల్యూర్‌ను అద్భుతంగా నిర్వచించారు. ఎవరికోసమో తెలుసా! మీ పిల్లలందరికోసం. ఫెయిల్యూర్ అంటే జీవితంలో నీవెందుకూపనికిరావని తలుపులు మూసివేయడం కాదు. అది F.A.I.L. - First Attempt In Learning. అంటే నేర్చుకునే క్రమంలో అది మొదటి ప్రయత్నం అని. విఫలమయ్యావు - మళ్ళీ ప్రయత్నించు. అంతేకానీ అదే తలచుకుని నీరుకారిపోకూడదు. -
ఉత్తమ సంస్కారం... కట్టుబడి ఉండటం
శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్లిపోతున్నాడు. కౌసల్య పిలిచి చెప్పింది.. ‘‘ఎందుకు ఈ అరణ్యవాసం? నా మాట విను’’ దానికి రాముడన్నాడు కదా.. ‘‘నాకు ధర్మం కావాలమ్మా, నాన్నగారు చెప్పిన మాటను నిజం చేస్తాను. అందుకని వెళ్లిపోతాను’’ అన్నాడు. అప్పుడు కౌసల్య ఒక మాట చెప్పింది. పెద్దలు ఇప్పటికీ ఒక మాటంటూంటారు. అమ్మ కట్టిచ్చిన చద్దన్నపు మూట అంటారు. ఒక వ్యక్తి జీవితాన్ని బాగా ప్రభావితం చేసేది ఎవరంటే తల్లి. తల్లి చెప్పిన ఒక మంచిమాట, తల్లి చేతిలో వేయించుకున్న ఒట్టు నిర్ణయం చేసేస్తుంది. కౌసల్య అన్నది... ‘‘రామా! నీవు ధర్మం ధర్మం అని దేనినైతే పట్టుకున్నావో అది వదిలిపెట్టకు. ఆ భావన, ఆ విశ్వాసం నీకు ధర్మంపట్ల నిలబడుగాక. ఎంతకష్టమొచ్చినా ధార్మిక మార్గంలోనే నీవు బతికెదవుగాక. అలా బతకడం నేర్చుకో. నీ ధర్మం అలా నిలబెట్టుకోవడం నేర్చుకో’’అంది. తర్వాత రాముడు అరణ్యవాసానికి వెళ్లాడు. వాలితో స్నేహం చేస్తే సీతమ్మను ఉత్తరక్షణంలో బయటికి తీసుకువస్తాడు. కానీ ధర్మం లేనివాడితో నాకు స్నేహమెందుకని, ధార్మికుడైన సుగ్రీవుడితో స్నేహం చేశాడు. దానితో చాలా కష్టపడాల్సి వచ్చింది. సముద్రానికి సేతువు కట్టారు. హనుమ వెళ్లాడు. యుద్ధం, తర్వాత రావణాసురుడిపై గెలిచాడు. సీతమ్మను తెచ్చుకున్నాడు. అలా కాక రాముడు ధర్మాన్ని వదిలిపెట్టి ఉంటే, అమ్మకు ఇచ్చిన మాట మరచిపోయి ఉండి ఉంటే... ఇప్పుడు కలియుగంలో ఆయన పూజింపబడి ఉండేవాడా? ఒక్కసారి కమిట్ అయితే... మహమ్మదీయ సంప్రదాయంలో ఒక కథ ప్రచారంలో ఉంది. అప్ఘానిస్థాన్లో ఒక వ్యక్తి ఉండేవాడు. అతని పేరు షేక్ అబ్దుల్ ఉల్ జిలానీ. చిన్నతనంలో ఆవులు, మేకలు కాస్తుండేవాడు. ఒక రోజున అలా వెళ్లిన సమయంలో ఒక ఆవు అన్నది కదా... ‘‘మనిషివై పుట్టినందుకు ఆవుల్ని, మేకల్ని కాయడం కాదు, జ్ఞానాన్ని సంపాదించు’’ అన్నది. ఆయన ఇంటికి తిరిగొచ్చి పైకప్పుమీదికెక్కి చుట్టూ చూశాడు. ఇరాక్ వెడుతున్న ఒక గుంపు కనబడింది. వెంటనే వాళ్ల అమ్మ దగ్గరకు వెళ్లి ‘‘జ్ఞానం తెలుసుకోవడానికి ఇరాక్‌కు మతపెద్దల దగ్గరికి వెడుతున్నా’’ అన్నాడు. తల్లి ‘ఆగు’ అని లోపలకు వెళ్లి 40 బంగారు కాసులు తీసుకువచ్చింది. ‘‘ఇది మీ నాన్న ఆస్తిలో నీ వాటా. నీ గురువు దగ్గర జ్ఞానాన్ని పొంది భగవంతుడిని చేరుకో. ఈ బంగారు కాసులన్నీ పైకి కనబడకుండా కోటు లోపల దారం పెట్టి కుట్టేస్తున్నా’’ అని కుట్టేసింది. వెళ్లబోతుంటే పిలిచి ‘‘ఒక్కమాట ఇవ్వు’’ అన్నది. ‘‘చెప్పమ్మా, నీ మాట నేనెన్నడూ మర్చిపోను’’ అని ఒట్టేశాడు. ‘‘ప్రాణమే పోయినా అబద్ధం చెప్పనని మాట ఇవ్వు’’ అన్నది. ‘‘తప్పకుండా’’ అని ఒట్టేసి వెళ్లిపోయాడు. గుంపుతో కలసి వెడుతుంటే, దారిదొంగలు అడ్డగించి అందరినీ దోచుకుంటూ చిన్న కోటేసుకుని వెడుతున్న ఈ పిల్లవాడి దగ్గరకొచ్చారు. ‘‘నీ దగ్గర ఏమైనా ఉన్నాయా’’ అని అడిగారు వాళ్లు. నా దగ్గర 40 బంగారు కాసులున్నాయి. మా అమ్మ కోటు లోపల పెట్టి కుట్టేసింది’’ అన్నాడు. వాళ్లు పకాపకా నవ్వి పిల్లాడు మనతోనే అబద్ధాలాడుతున్నాడని వాడిని దొంగల నాయకుడి దగ్గరికి తీసుకెళ్లారు. ‘‘అయ్యా! అందరినీ దోచుకుంటేనే ఐదారు కాసుల కన్నా ఎక్కువ దొరకలేదు, వీడినడిగితే 40 కాసులున్నాయంటున్నాడు. మాకు నవ్వొచ్చింది. అందుకే వెంటబెట్టుకొచ్చాం’’ అని చెప్పారు. దొంగల నాయకుడు అడిగితే ‘‘40 కాసులున్నాయి. నీవు జేబులో చెయ్యిపెట్టి వెతికితే దొరకవు. మా అమ్మ లోపలపెట్టి కుట్టేసింది’’ అన్నాడు. నాయకుడు కూడా నమ్మకపోయినా కోటువిప్పి వెతకండని అనుచరులకు పురమాయించాడు. లోపల విప్పి చూస్తే 40 కాసులు కనిపించాయి. దొంగల నాయకుడు విస్తుపోయి, ‘‘అదేమిట్రా అలా ఎందుకు చెప్పావు, 40 బంగారు కాసులున్నాయని! అవి దొరకకూడదనే కదా మీ అమ్మ అలా కుట్టిచ్చింది’’ అని అడిగాడు. దానికి ఆ పిల్లవాడు ‘‘ప్రాణమే పోయినా అబద్ధం చెప్పనని మా అమ్మకు మాటిచ్చాను. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కన్నా అబద్ధం చెప్పి కాసులు దక్కించుకోవడం నాకు గొప్ప విషయం కాదు’’ అన్నాడు. అది విన్న నాయకుడి కంట నీరు కారింది. ‘‘నీకున్న భయం నేను నా తల్లిపట్ల, నా తండ్రిపట్ల, నా పెద్దలపట్ల ఉంచుకుని ఉండి ఉంటే నిర్భయత్వం అన్న పేరుతో కొన్ని వేలమందిని హింసించేవాడిని కాదు. ఇప్పుడర్థమైంది నిజమైన భయం కలిగి ఉండడం అంటే... నేనూ నీతోపాటే వస్తున్నా’’ అని చెప్పి తన గుంపునంతటినీ తీసుకుని అతని వెంట వెళ్లిపోయాడు. తరువాత అతనో ప్రవక్తయ్యాడు.