ఉత్తమ సంస్కారం... కట్టుబడి ఉండటం | Adherence to best Sacrament | Sakshi
Sakshi News home page

ఉత్తమ సంస్కారం... కట్టుబడి ఉండటం

Published Sat, Jan 2 2016 11:19 PM | Last Updated on Sun, Sep 3 2017 2:58 PM

ఉత్తమ సంస్కారం...   కట్టుబడి ఉండటం

ఉత్తమ సంస్కారం... కట్టుబడి ఉండటం

శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్లిపోతున్నాడు. కౌసల్య పిలిచి చెప్పింది.. ‘‘ఎందుకు ఈ అరణ్యవాసం? నా మాట విను’’ దానికి రాముడన్నాడు కదా.. ‘‘నాకు ధర్మం కావాలమ్మా, నాన్నగారు చెప్పిన మాటను నిజం చేస్తాను. అందుకని వెళ్లిపోతాను’’ అన్నాడు. అప్పుడు కౌసల్య ఒక మాట చెప్పింది. పెద్దలు ఇప్పటికీ ఒక మాటంటూంటారు. అమ్మ కట్టిచ్చిన చద్దన్నపు మూట అంటారు. ఒక వ్యక్తి జీవితాన్ని బాగా ప్రభావితం చేసేది ఎవరంటే తల్లి. తల్లి చెప్పిన ఒక మంచిమాట, తల్లి చేతిలో వేయించుకున్న ఒట్టు నిర్ణయం చేసేస్తుంది. కౌసల్య అన్నది... ‘‘రామా! నీవు ధర్మం ధర్మం అని దేనినైతే పట్టుకున్నావో అది వదిలిపెట్టకు.
 
  ఆ భావన, ఆ విశ్వాసం నీకు ధర్మంపట్ల నిలబడుగాక. ఎంతకష్టమొచ్చినా ధార్మిక మార్గంలోనే నీవు బతికెదవుగాక. అలా బతకడం నేర్చుకో. నీ ధర్మం అలా నిలబెట్టుకోవడం నేర్చుకో’’అంది. తర్వాత రాముడు అరణ్యవాసానికి వెళ్లాడు. వాలితో స్నేహం చేస్తే సీతమ్మను ఉత్తరక్షణంలో బయటికి తీసుకువస్తాడు. కానీ ధర్మం లేనివాడితో నాకు స్నేహమెందుకని, ధార్మికుడైన సుగ్రీవుడితో స్నేహం చేశాడు. దానితో చాలా కష్టపడాల్సి వచ్చింది. సముద్రానికి సేతువు కట్టారు. హనుమ వెళ్లాడు. యుద్ధం, తర్వాత రావణాసురుడిపై గెలిచాడు. సీతమ్మను తెచ్చుకున్నాడు. అలా కాక రాముడు ధర్మాన్ని వదిలిపెట్టి ఉంటే, అమ్మకు ఇచ్చిన మాట మరచిపోయి ఉండి ఉంటే... ఇప్పుడు కలియుగంలో ఆయన పూజింపబడి ఉండేవాడా?
 
 ఒక్కసారి కమిట్ అయితే...
 మహమ్మదీయ సంప్రదాయంలో ఒక కథ ప్రచారంలో ఉంది. అప్ఘానిస్థాన్‌లో ఒక వ్యక్తి ఉండేవాడు. అతని పేరు షేక్ అబ్దుల్ ఉల్ జిలానీ. చిన్నతనంలో ఆవులు, మేకలు కాస్తుండేవాడు. ఒక రోజున అలా వెళ్లిన సమయంలో ఒక ఆవు అన్నది కదా... ‘‘మనిషివై పుట్టినందుకు ఆవుల్ని, మేకల్ని కాయడం కాదు, జ్ఞానాన్ని సంపాదించు’’ అన్నది. ఆయన ఇంటికి తిరిగొచ్చి పైకప్పుమీదికెక్కి చుట్టూ చూశాడు. ఇరాక్ వెడుతున్న ఒక గుంపు కనబడింది. వెంటనే వాళ్ల అమ్మ దగ్గరకు వెళ్లి ‘‘జ్ఞానం తెలుసుకోవడానికి ఇరాక్‌కు మతపెద్దల దగ్గరికి వెడుతున్నా’’ అన్నాడు. తల్లి ‘ఆగు’ అని లోపలకు వెళ్లి 40 బంగారు కాసులు తీసుకువచ్చింది.
 
  ‘‘ఇది మీ నాన్న ఆస్తిలో నీ వాటా. నీ గురువు దగ్గర జ్ఞానాన్ని పొంది భగవంతుడిని చేరుకో. ఈ బంగారు కాసులన్నీ పైకి కనబడకుండా కోటు లోపల దారం పెట్టి కుట్టేస్తున్నా’’ అని కుట్టేసింది. వెళ్లబోతుంటే పిలిచి ‘‘ఒక్కమాట ఇవ్వు’’ అన్నది. ‘‘చెప్పమ్మా, నీ మాట నేనెన్నడూ మర్చిపోను’’ అని ఒట్టేశాడు. ‘‘ప్రాణమే పోయినా అబద్ధం చెప్పనని మాట ఇవ్వు’’ అన్నది. ‘‘తప్పకుండా’’ అని ఒట్టేసి వెళ్లిపోయాడు.
 
 గుంపుతో కలసి వెడుతుంటే, దారిదొంగలు అడ్డగించి అందరినీ దోచుకుంటూ చిన్న కోటేసుకుని వెడుతున్న ఈ పిల్లవాడి దగ్గరకొచ్చారు. ‘‘నీ దగ్గర ఏమైనా ఉన్నాయా’’  అని అడిగారు వాళ్లు. నా దగ్గర 40 బంగారు కాసులున్నాయి. మా అమ్మ కోటు లోపల పెట్టి కుట్టేసింది’’ అన్నాడు. వాళ్లు పకాపకా నవ్వి పిల్లాడు మనతోనే అబద్ధాలాడుతున్నాడని వాడిని దొంగల నాయకుడి దగ్గరికి తీసుకెళ్లారు. ‘‘అయ్యా! అందరినీ దోచుకుంటేనే ఐదారు కాసుల కన్నా ఎక్కువ దొరకలేదు, వీడినడిగితే 40 కాసులున్నాయంటున్నాడు. మాకు నవ్వొచ్చింది. అందుకే వెంటబెట్టుకొచ్చాం’’ అని చెప్పారు.
 
 దొంగల నాయకుడు అడిగితే ‘‘40 కాసులున్నాయి. నీవు జేబులో చెయ్యిపెట్టి వెతికితే దొరకవు. మా అమ్మ లోపలపెట్టి కుట్టేసింది’’ అన్నాడు. నాయకుడు కూడా నమ్మకపోయినా కోటువిప్పి వెతకండని అనుచరులకు పురమాయించాడు. లోపల విప్పి చూస్తే 40 కాసులు కనిపించాయి. దొంగల నాయకుడు విస్తుపోయి, ‘‘అదేమిట్రా అలా ఎందుకు చెప్పావు, 40 బంగారు కాసులున్నాయని! అవి దొరకకూడదనే కదా మీ అమ్మ అలా కుట్టిచ్చింది’’ అని అడిగాడు. దానికి ఆ పిల్లవాడు ‘‘ప్రాణమే పోయినా అబద్ధం చెప్పనని మా అమ్మకు మాటిచ్చాను. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కన్నా అబద్ధం చెప్పి కాసులు దక్కించుకోవడం నాకు గొప్ప విషయం కాదు’’ అన్నాడు.
 
 అది విన్న నాయకుడి కంట నీరు కారింది. ‘‘నీకున్న భయం నేను నా తల్లిపట్ల, నా తండ్రిపట్ల, నా పెద్దలపట్ల ఉంచుకుని ఉండి ఉంటే నిర్భయత్వం అన్న పేరుతో కొన్ని వేలమందిని హింసించేవాడిని కాదు. ఇప్పుడర్థమైంది నిజమైన భయం కలిగి ఉండడం అంటే... నేనూ నీతోపాటే వస్తున్నా’’ అని చెప్పి తన గుంపునంతటినీ తీసుకుని అతని వెంట వెళ్లిపోయాడు. తరువాత అతనో ప్రవక్తయ్యాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement