ఖమ్మం నగర శివారులో భారీ చోరీ
ఖమ్మం : ఖమ్మం నగర శివారులోని పోలేపల్లి గ్రామ పరిధి కరుణగిరి సమీపంలోని రెండు అపార్ట్మెంట్లలో శుక్రవారం రాత్రి భారీ చోరీ జరిగింది. సాయి రాఘవ అపార్ట్మెంట్లో వృద్ధ దంపతులు చావా దుర్గాప్రసాద్-ప్రభావతి, ఇదే అపార్ట్‌మెంట్‌కు ఎదురుగా ఉన్న సాయిరాం టవర్స్‌లో విశ్రాంత సర్వేయర్ మర్ల వెంకటరమణ దంపతులు నివాసముంటున్నారు.
దుర్గాప్రసాద్-ప్రభావతి దంపతులు తమ ప్లాట్‌కు తాళం వేసి ఈ నెల 26న హైదరాబాద్ వెళ్లారు. మర్ల వెంకటరమణ దంపతులు కూడా తాళం వేసి ఈ నెల 30న బంధువుల ఊరు వెళ్లారు. శుక్రవారం రాత్రి ఈ రెండు ప్లాట్ల తాళాలను పగులగొట్టి దుండగులు లోనికి ప్రవేశించారు.
దుర్గాప్రసాద్ ప్లాట్లోని బీరువాను ఇనుప చువ్వలతో తెరిచి, అందులో ఉన్న 40 తులాల బంగారు ఆభరణాలు తీసుకెళ్లారు. వెంకటరమణ ప్లాట్ బీరువాను కూడా ఇలాగే తెరిచి 20 తులాల బంగారు ఆభరణాలు, కేజీన్నర వెండి ఎత్తుకెళ్లారు. ఈ రెండు ప్లాట్లలో చోరీ సొత్తు విలువ రూ. 20 లక్షల పైనే ఉంటుందని పోలీసులు తెలిపారు.