విచారణలో వివక్ష?
శ్రీసాయి మృతిపై దర్యాప్తు వేగవంతం
ఇప్పటికే 11 మంది అరెస్ట్
జాస్మిన్ మృతిపై వీడని మిస్టరీ
బయటకు రాని పోస్టుమార్టం రిపోర్టు
ముందుకు సాగని విచారణ
రేపల్లె: నిజాంపట్నం మండలం అడవులదీవి గ్రామపంచాయతీ పరిధిలోని మహ్మదీయపాలెంలో ఈనెల 17వ తేదీన జరిగిన షేక్ జాస్మిన్, వేముల శ్రీసాయి మృతి సంఘటనలు జిల్లాలో తీవ్ర సంచలనం కలిగించాయి. మహ్మదీయపాలెంలో జాస్మిన్ మృతి చెందిన సమయంలో ఆ ఇంట్లో ఉన్న అదే పంచాయతీ పరిధిలోని గరువు గ్రామానికి చెందిన వేముల శ్రీసాయి, జొన్న పవన్‌కుమార్‌లను స్థానికులు పట్టుకుని చెట్టుకు కట్టేసి కొట్టిన అనంతరం పోలీసులు శ్రీసాయిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. జాస్మిన్, శ్రీసాయి మృతి సంఘటలను హత్య కేసులుగా పోలీసులు వేరువేరుగా నమోదు చేశారు.
శ్రీసాయిని చెట్టుకు కట్టేసి కొట్టిన సంఘటనలో పోలీసుల వైఫల్యం స్పష్టమవుతోందని, దీనిపై వివరణ ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ డీజీపీ నోటీసులు జారీ చేయడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడి రెండు కేసులను త్వరితగతిన ఛేదించాలనే నిర్ణయానికి వచ్చారు. కేసుల దర్యాప్తు వేగవంతం చేశారు. ఈక్రమంలో శ్రీసాయి హత్య కేసులో అనుమానితులుగా శ్రీసాయి తల్లిదండ్రులు ఇచ్చిన 12 మంది జాబితాతో పాటు సంఘటనను చిత్రీకరించిన వీడియోలను పరిశీలిస్తూ నిందితులను అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే శ్రీసాయి కేసులో 11 మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. మరికొంత మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
జాస్మిన్ కేసు విచారణలో జాప్యం..?
శ్రీసాయి హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేయడంలో పోలీసులు చూపుతున్న చొరవ జాస్మిన్ హత్య కేసులో విచారణను వేగవంత చేశారు. జాస్మిన్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో అప్పటివరకు జాస్మిన్‌తో మాట్లాడడం, కొద్ది సమయానికే జాస్మిన్ మృతి చెందడం, జాస్మిన్ మృతదేహం వద్ద శ్రీసాయి, పవన్‌కుమార్ ఉండడంపై పోలీసులు విచారిస్తున్నారు. జాస్మిన్ మృతి సంఘటన ప్రదేశంలో శ్రీసాయి, తాను మాత్రమే ఉన్నామని జరిగిన అంశాలను చెబుతున్న మరో నిందితుడు పవన్‌కుమార్ చెబుతున్న మాటలను, శ్రీసాయి తల్లి చెబుతున్నట్లు శ్రీసాయి, పవన్‌లతో ఉన్న వారి స్నేహితుడు సంఘటనా స్థలం నుంచి పారిపోయి వచ్చి విషయాన్ని తనకు ఫోన్లో చెప్పాడని చెబుతున్న విషయాన్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సంఘటనా స్థలానికి శ్రీసాయితో పాటు ఎంతమంది వెళ్లారన్న అంశంపై విచారణను వేగవంతం చేశారు. అయితే జాస్మిన్ పోస్టుమార్టం ప్రాథమిక నివేదికను గోప్యంగా ఉంచుతూ పూర్తిస్థాయిలో పోస్టుమార్టం రిపోర్టు రావాలంటూ నాన్చుడు ధోరణి అవలంబిస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. రాజకీయంగా ఒత్తిడుల కారణంగానే కావాలని జాప్యం చేస్తున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి.
మృతుల కుటుంబాలను పరామర్శించడంలోనూ...
కారణాలు ఏమైనా జాస్మిన్, శ్రీసాయిల మృతి ఆ ఇద్దరి తల్లులకు కడుపుకోత కలిగించింది. ఆయా కుటుంబాలకు తీరని శోకం మిగిల్చింది. ఈ తరుణంలో నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అడవులదీవి పంచాయతీ పరిధిలోని గరువు గ్రామంలో మృతుడు శ్రీసాయి నివాసానికి వెళ్లి మృతుని తల్లితండ్రులను పరామర్శించారు. అదే గ్రామ పంచాయతీలోని మహ్మదీయపాలెంలోని జాస్మిన్ తల్లిని పరామర్శించకపోవడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గంలో ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన ఎమ్మెల్యే పక్షపాత ధోరణి అవలంబించడం ఏమిటంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
పోస్టుమార్టం నివేదిక వచ్చాకే పూర్తిస్థాయి విచారణ..
జాస్మిన్ హత్య కేసుపై క్షుణ్ణంగా విచారణ చేసేందుకు తొలుత పోస్టుమార్టం నివేదిక అందాల్సి ఉంది. నివేదిక అందిన అనంతరం జాస్మిన్ హత్య కేసును అన్ని కోణాల్లో విచారించి చర్యలు చేపడతాం. జాస్మిన్, శ్రీసాయి హత్యకేసులో పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నారు.
-బాపట్ల డీఎస్పీ పి.మహేష్