అశోక్ గజపతిరాజుకు అలా... రోహిత్‌కు ఇలా...
అన్నవరం : అన్నవరం దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్తగా ఐవీ గోపాల రావు (రోహిత్) నియామకానికి అడ్డంకులు తొలగిపోయాయి. గత నవంబర్ 12న మృతి చెందిన ఈ దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త రాజా ఐవీ రామ్‌కుమార్ తనయుడే రోహిత్. దివంగత రామ్‌కుమార్ వారసుడిగా తనను వ్యవస్థాపక ధర్మకర్తగా నియమించాలని రోహిత్ గత డిసెంబర్లో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.
దీనిపై దేవాదాయ,ధర్మాదాయశాఖ అధికారులు పరిశీలన జరిపి అభ్యంతరాలు లేవని తేల్చారు. అయితే రామ్‌కుమార్‌పై కొన్ని కేసులు కోర్టులలో పెండింగ్‌లో ఉండడంతో న్యాయశాఖకు పంపించారు. గతవారం న్యాయశాఖ కూడా రోహిత్ నియామకంపై అభ్యంతరాలు లేవని ప్రభుత్వానికి సిఫార్స్ చేస్తూ ఫైలును ముఖ్యమంత్రికి పేషీకి పంపించింది.
సీఎం సంతకం చేయడం లాంఛనమేనని, ఈ వారాంతంలోగా రోహిత్ నియామకానికి వీలుగా జీవో విడుదల అవుతుందని విశ్వసనీయంగా తెలిసింది. వాస్తవానికి దేవాదాయశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ స్థాయిలోనే ఈ జీఓను విడుదల చేయవచ్చు. కానీ రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో ఫైలును ముఖ్యమంత్రికి పంపించినట్టు సమాచారం. అన్నవరం దేవస్థానానికి రాజా ఐవీ రామ్‌కుమార్ 35 ఏళ్లపాటు వ్యవస్థాపక ధర్మకర్త, చైర్మన్‌గా వ్యవహరించిన విషయం విదితమే.
ఈ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలుగా ప్రభుత్వం గుర్తించిన ఇనుగంటి వంశీకులలో రామ్‌కుమార్ ఐదో తరానికి చెందినవారు. రామ్‌కుమార్ వారసునిగా రోహిత్‌ను గుర్తించి డిసెంబర్లోనే వ్యవస్థాపక ధర్మకర్తగా నియమించాల్సి ఉంది. అయితే ధర్మకర్తగా నియమితులయ్యే వ్యక్తి వయసు 30 ఏళ్లు ఉండాలని, కానీ రోహిత్ వయసు 27 ఏళ్లు మాత్రమేనని కొందరు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
దానికితోడు ఈ పదవిని ఆశించిన కొందరు అధికార పార్టీ నేతలు కూడా కొంత రాజకీయం చేశార ని సమాచారం. అయితే వ్యవస్థాపక ధర్మకర్త మృతి చెందితే ఆయన వారసుని నియమించేటపుడు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోనవసరం లేదని, వారసుడు మేజర్ అయితే చాలని ఉన్న నిబంధనలను రాష్ట్ర ఫౌండర్ ట్రస్టీస్ అసోసియేషన్ అధ్యక్షుడు, ద్వారకాతిరుమల దేవస్థానం చైర్మన్ ఎస్వీ సుధాకరరావు ప్రభుత్వానికి వివరించారు. దీంతో న్యాయశాఖ కూడా ఈ అంశంపై సానుకూలంగా స్పందించి ఫైలు సీఎం పేషీకి సంతకం కోసం పంపించింది.
అశోక్ గజపతిరాజుకు వారం.. రోహిత్‌కు ఆరు నెలలు
సింహాచలం దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త పి. ఆనందగజపతిరాజు మృతిచెందిన వారం రోజుల్లోనే ఆయన సోదరుడు, కేంద్రమంత్రి పి. అశోక్ గజపతిరాజును ఆ దేవస్థానానికి వ్యవస్థాపక ధర్మకర్తగా ప్రభుత్వం నియమించింది. కానీ అన్నవరం దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త రాజా ఐవీ రామ్‌కుమార్ మృతిచెంది ఆరు నెలలయ్యాక కానీ రోహిత్ నియామకం ఓ కొలిక్కి రాలేదు. ఇప్పటికి ఫైల్ తుది దశలో ఉంది.
రోహిత్ నియామకంపై త్వరలో ఆదేశాలు
అన్నవరం దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్తగా రోహిత్‌ను నియమిస్తూ త్వరలో జీఓ వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర దేవాలయ ఫౌండర్ ట్రస్టీస్ అసోసియేషన్ అధ్యక్షుడు, ద్వారకాతిరుమల దేవస్థానం చైర్మన్ ఎస్వీ సుధాకర్‌రావు తెలిపారు. ఆయన ఫోన్లో ‘సాక్షి’ తో మాట్లాడారు. రోహిత్ నియామకం విషయమై న్యాయశాఖ కూడా ప్రభుత్వానికి సానుకూలంగా సిఫార్స్ చేసిందని, ఆ ఫైలు సీఎం పేషీ కి చేరిందని వివరించారు.