అల్లుతో అందాల భామ!
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’లో నటించిన మెహరీన్ గుర్తుందా? అందం, అభినయ పరంగా ఆ చిత్రంలో మంచి మార్కులే కొట్టేసింది. అందుకే మెహరీన్ రెండో సినిమా దక్కించుకోగలిగింది. అల్లు శిరీష్ హీరోగా శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై ఏంవీఎన్ రెడ్డి దర్శకత్వంలో ఆ మధ్య ఓ సినిమా ఆరంభమైన విషయం తెలిసిందే. ఎస్. శైలేంద్రబాబు, కేవీ శ్రీధర్‌రెడ్డి, హరీశ్ దుగ్గిశెట్టి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన మెహరీన్‌ని కథానాయికగా ఎంపిక చేశారు.
‘‘ఈ చిత్రంలో హీరోతో పాటు హీరోయిన్ పాత్రకు కూడా తగిన ప్రాధాన్యం ఉంటుంది. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’లో మెహరీన్ బాగా నటించడంతో తీసుకున్నాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ‘‘మంచి కాన్సెప్ట్‌తో సాగే చిత్రం ఇది. లవ్ ఎంటర్టైనర్. అల్లు శిరీష్, మెహరీన్ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి’’ అని దర్శకుడు చెప్పారు. అల్లు శిరీష్ మాట్లాడుతూ -‘‘ఈ చిత్రదర్శకుడు ఎంవీఎన్ రెడ్డి తండ్రి మల్లిడి సత్యనారాయణగారు మా అన్నయ్య అల్లు అర్జున్‌తో ‘బన్నీ’ తీశారు. ఇప్పుడు ఆయన తనయుడి దర్శకత్వంలో నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు.