కల్యాణ పనులకు వేళాయె..
రూ. 50 లక్షలతో రామయ్య పెళ్లి పనులు
ఉభయదాతలకు ‘సచిత్ర రామాయణం’
కల్యాణ తలంబ్రాల ప్యాకెట్ రూ. 50
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఏప్రిల్28న జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ రామనవమి రోజున భద్రాచలంలో జరిగే రాముల వారి కల్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సీఎం తీసుకురావటం ఆనవాయితీ.
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా స్వామివారి కల్యాణోత్సవాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్ల కోసం అధికారులు కార్యాచరణ రూపొందించారు. రూ.50 లక్షలతో స్వామివారి కల్యాణ పనులు చేపట్టాలనే లక్ష్యంతో ఇప్పటికే టెండర్లు పిలిచారు. జూలైలో గోదావరి పుష్కరాలు కూడా ఉండటంతో నవమి ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. నవమి పనులతో పాటే గోదావరి పుష్కరాల కోసం దేవస్థానం ద్వారా మరో రూ.30 లక్షల వ్యయంతో పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచారు.
దాతల ప్రోత్సాహం కోసం..
భద్రాద్రి ఆలయాభివృద్ధిలో భాగంగా దాతలను ప్రోత్సహించాలని దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతి నిర్ణయించారు. స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొనే ఉభయదాతలకు సచిత్ర రామాయణం పుస్తకాలను అందజేయాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు ఉభయదాతల టికెట్లు కొనుగోలు చేసిన వారికి పంచె, చీర, కండువా, జాకెట్టు, లడ్డు, పులిహోర ప్యాకెట్, నలుగురికి స్వామివారి అన్నదాన ప్రసాదం ఇస్తున్నారు. వీటితో పాటు సచిత్ర రామాయణం పుస్తకాలు, రామదాసు కీర్తనల సీడీని కూడా అందజేయాలని భావిస్తున్నారు.
తలంబ్రాల్లోనూ మార్పులు
స్వామివారి కల్యాణం తలంబ్రాల ప్యాకెట్‌ను రెండేళ్లుగా రూ.5 చొప్పున విక్రయిస్తున్నారు. ఇక నుంచి తలంబ్రాల్లో 2 ముత్యాలు, స్వామివారి రాగిమాడ, ఒక ఫొటోను జతచేసి రూ.50 చొప్పున విక్రయించాలని అధికారులు భావిస్తున్నారు.
టికెట్ల రేటు పెంపు
శ్రీ రామనవమి రోజున భద్రాచలంలో జరిగే స్వామివారి కల్యాణోత్సవాన్ని ప్రత్యక్ష్యంగా తిల కించే అవకాశం కేవలం 35,832 మంది భక్తులకే ఉంది. రూ.100, రూ.200, రూ.500, రూ.1,116 టికెట్లతో పాటు, వీఐపీ పేరిట రూ.2,000, ఉభయదాతల పేరిట రూ.3,016 విలువ గల టికెట్లను మొత్తం 20,032 మందికి విక్రయిస్తున్నారు. ఈసారి వీఐపీ టిక్కెట్టును రూ. 2,000 నుంచి రూ. 3,500, ఉభయదాతల టికెట్‌ను రూ.3,016 నుంచి రూ. 5,016కు పెంచనున్నారు.