గౌతమికి హారతి
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో పుణ్యనదీ హారతి కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా గురువారం గోదావరి నదీ తీరంలో జరిగిన ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతి స్వామి వారి పాదుకలతో ముందు నడువగా, వేద పండితుల మంత్రోచ్ఛరణలు, ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా గోదావరి తీరానికి వెళ్లారు.
వేద విద్యార్థుల మంత్రోచ్ఛరణలు, మహిళల కోలాటాలతో స్వామి వారి పాదుకలను ప్రత్యేక పల్లకిలో తీసుకెళ్లారు. ముందుగా స్నానఘట్టాల రేవులో ఉన్న గోదావరి మాత విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం గోదావరి ఒడ్డున ప్రత్యేకంగా తయారు చేసిన వేదికపైకి స్వామి వారి పాదుకలను తీసుకెళ్లారు. వేద స్వస్తి చెప్పిన తరువాత ఆస్థాన హరిదాసులు భక్త రామదాసు కీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా స్వామివారి పాదుకలకు పూజలు నిర్వహించారు.
పవిత్ర గోదావరి జలాలను తీసుకొచ్చి స్నాన, వస్త్ర, ఉత్తరీయాలను సమర్పించిన పిదప అభిషేకం గావించారు. గోదావరి నది విశిష్టతను, కార్తీక దీపాల విశిష్టతను దేవస్థానం స్థానాచార్యులు స్థలశాయి భక్తులకు వివరించారు. నది వృద్ధిని కోరుతూ హారతి ఇస్తారని, దీనికి ఎంతో విశిష్టత ఉందని చెప్పారు.
భక్తజనంతోనే నదీ పూజ...
వేడుకలో భాగంగా గోదావరి నదికి అత్యంత వైభవంగా అర్చకులు, వేదపండితులు పూజగావించారు. ముందుగా సకల జనులంతా బాగుండాలని కోరుతూ సంకల్పం చెప్పారు. దీనిని భక్తులందరిచేత కూడా చెప్పించి, వారిని కూడా నదీ పూజలో భాగస్వాములను చేశారు. పుష్పాలు, కుంకుమ, సుగంధ ద్ర వ్యాలు గోదావరి నదిలో వేస్తూ, దూప దీప నైవేద్యాలు సమర్పించారు. ఆ తర్వాత ‘భద్రాద్రి వరద గోవిందా’ అనే శ్లోకాన్ని భక్తులతో చెప్పించారు.
గోదావరి నదీ అష్టోత్తర శతనామాచార్చన గావించారు. గోదావరి నదికి నివేదన జరుగుతున్నంత సేపూ నదీ వైభవాన్ని స్థలశాయి భక్తులకు వివరించారు. అమ్మవారికి తాంబాలాలను సమర్పించిన తర్వాత ముందుగా ఈవో కూరాకుల జ్యోతి దంపతులు గోదావరి నదికి హారతులు ఇచ్చారు. అనంతరం అర్చకులు ఐదు రకాల హారతులు ఇచ్చారు. ప్రణవ శంఖ నాదముల నడుమ మహాహారతి నేత్రపర్వంగా సాగింది.
గోదారి తీరంలో దీపోత్సవ సందడి...
నదీ హారతులు ఇచ్చిన సమయంలో భక్తులు కూడా గోదావరిలో కార్తీక దీపాలను వదిలేందుకు ఎంతో ఆసక్తి చూపించారు. దేవస్థానం వారు భక్తులకు ముందుగానే అరిటి దొప్పలతో కూడిన ప్రమిదలను ఇవ్వటంతో వాటిని వెలిగించి గోదావరిలో విడిచారు. వేడుక జరుగుతున్నంత సేపూ గోదావరి తీరంలో బాణా సంచా వెలుగులు విరజిమ్మాయి.
భద్రాచలానికి చెందిన చిన్నారులు అమరవాది శ్రీజ, కె.తన్మయి లయబద్ధంగా చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పట్టణ ఎస్సై మురళి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.
అగ్నిమాపక శాఖాధికారి సురేష్కుమార్, ఇరిగేషన్ ఈఈ శ్రావణ్ కుమార్ గోదావరి ఘాట్లో పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఏఈవో శ్రావణ్ కుమార్, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాధాచార్యులు, వేదపండితులు మురళీ కృష్ణమాచార్యులు, పర్యవేక్షకులు వెంకటప్పయ్య, పీఆర్వో సాయిబాబు, డీఈ రవీందర్, శ్రీనివాసరాజు పాల్గొన్నారు.