చెరగని జ్ఞాపకం
రాష్ట్రపతి హోదాలో, ఆ తర్వాత పలుమార్లు
అబ్దుల్ కలాం జిల్లా పర్యటన
తిరుమలేశుని దర్శించుకోవడం ఆయనకు ఎంతో ఇష్టం
ఎస్వీయూ స్వర్ణోత్సవాలకు హాజరు
మాజీ రాష్ర్టపతి అబ్దుల్ కలాంకు ఈ జిల్లాతో విడదీయలేని బంధం ఉంది. రాష్ర్టపతి హోదాలోనూ, అనంతరం కూడా పలుమార్లు జిల్లాలో పర్యటించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం అంటే ఆయనకు చాలా ఇష్టం. శ్రీవారి ప్రసాదం ప్రీతిపాత్రంగా స్వీకరించేవారు.
తిరుమల: భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు తిరుమల క్షేత్రంతో విడదీయరాని బంధం ఉంది. రాష్ట్రపతి హోదాలోనూ, ఆ తర్వాత పలుమార్లు ఆయన తిరుమల క్షేత్రాన్ని సందర్శించారు. శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ‘ఈ క్షేత్రానికి రావడం, శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఇష్టం’ అని తన అనుభూతిని పంచుకునేవారు. స్వామి దర్శనంలో భక్తిశ్రద్ధలతో కనిపించేవారు. సామాన్య మహ్మదీయ కుటుంబంలో జన్మించిన ఆయన మత సామరస్యాన్ని పాటించారు. ఇక్కడి ఆలయ ఆచార సంప్రదాయాలను గౌరవించారు. శ్రీవారి ప్రసాదాన్ని ఇష్టంగా స్వీకరించేవారు. ఆలయ పెద్ద జీయర్తోనూ, ప్రధాన అర్చకులు రమణ దీక్షితులతోనూ ఇష్టంగా మాట్లాడేవారు. అందరికంటే వేద విద్యార్థులు కనిపిస్తే వారిని పిలిచి మరీ మాట్లాడేవారు.
స్వామివారంటే ఎనలేని భక్తి
‘అబ్దుల్‌కలాంగారు రాష్ట్రపతి హోదాలో, పదవీ విరమణ తర్వాత కూడా స్వామివారి దర్శనానికి వచ్చారు. స్వామి అంటే ఎనలేని భక్తి. సామాన్యుడిగానే కనిపించేవారు. ఆలయానికి వచ్చినప్పుడు ఆప్యాయంగా పలకరించేవారు. ఆయన సైంటిస్ట్‌గా ఉన్నప్పుడే తరచూ ఆలయానికి వచ్చేవారు. ఆ సందర్భంలోనే నేనొక సైంటిస్ట్ అనే వారితో ముచ్చటించాను. లౌకిక పరమైన విషయాలతో కాకుండా ఆధ్యాత్మిక భావన, సోదర, మానవతా దృష్టితో ప్రపంచాన్ని చూసేలా నిత్యం నలుగిరికీ ప్రబోధించాలన్న కలాంగారి మాటల్ని మరువలేను. ఆ తర్వాత రాష్ట్రపతి హోదాలో వారితో గడిపిన క్షణాలు మరువలేం. పరలోకంలో ఉన్నా వారి ఆత్మకు శాంతిని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు.’
- రమణదీక్షితులు, ఆలయ ప్రధాన అర్చకులు