నటన మానుకుని ఆ ఉద్యోగమే చేసుంటే పెన్షన్ అయినా వచ్చేది!
బిహైండ్ ది రీల్: కె.కె. శర్మ
అర్ధరూపాయితో ఇప్పుడు ఏమీ కొనలేం! కానీ, టీనేజ్ కూడా దాటని ఆ కుర్రాడి జీవితం మొదలైంది అర్ధరూపాయితోనే. సమ్మెట పని చేశాడు. రూపాయి పావలా జీతం కోసం ఎలక్ట్రికల్ స్తంభాలు మోశాడు..
ఆ తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలో క్లర్క్‌గా ఉద్యోగం.. నెలకు తొంభై రూపాయలు.. కొన్నాళ్లు చేసిన తర్వాత తన తండ్రిలానే రైల్వే జాబ్ చేయాలనిపించింది. ఫైర్‌మ్యాన్‌గా చేరాడు. ‘ఎ’ గ్రేడ్‌కి ఎదగడంతో అందరూ భేష్ అన్నారు. జోష్‌గా రైల్వే డ్రైవర్‌గా టెస్ట్ రాసేశాడు.. పాస్...! ఉద్యోగం వచ్చేసింది.. చేసుంటే ఇప్పుడు 20వేల రూపాయలు పెన్షన్ వచ్చేది.. చీకూ చింతా లేకుండా జీవితం గడిచిపోయి ఉండేది. కానీ.. ‘కళ్లేపల్లి శ్రీ వెంకట రామ కామేశ్వర శర్మ’ అలియాస్ కేకే శర్మ జీవితం అలా లేదు. సిల్వర్ స్పూన్‌తో పుట్టిన శర్మగారి చేతిలో చిల్లిగవ్వ లేదు. ఆయన వయసు 81 ఏళ్లు.. కొడుకు ఇంట్లో రోజులు నెట్టుకొచ్చేస్తున్నారు. ఓసారి కేకే శర్మ జీవితంలోకి తొంగి చూస్తే...
పుట్టింది బరంపురం. శర్మ తల్లిదండ్రులకు ఇద్దరు అబ్బాయిలు, ఏడుగురు అమ్మాయిలు. శర్మ చిన్నవాడు. అతని ఎనిమిదో ఏట తండ్రి చనిపోయారు. దాంతో పిల్లల్ని సాకే పూర్తి బాధ్యత తల్లిపై పడింది. శర్మకేమో చదువంటే ఇంట్రస్టే. కానీ, మనసే కుదురుగా ఉండేది కాదు. దాంతో కోల్‌కతాలో ఉన్న తన మేనమామ దగ్గరికెళ్లిపోయాడు. అక్కడ ఓ కంపెనీలో క్లర్క్‌గా చేరాడు. అక్కడా కాలు నిలవలేదు. ఛలో జంషెడ్పూర్ అంటూ తన మరో మేనమామ దగ్గరికెళ్లిపోయాడు. అక్కడ కూడా క్లర్క్ ఉద్యోగమే. అది చేస్తుండగా, కనీసం ఎస్ఎస్ఎల్సి అయినా పూర్తి చేయాలనే ఆకాంక్షతో కాకినాడ వెళ్లిపోయాడు.చదువుకుని, ఉద్యోగం చేయాలన్న ఆలోచనకన్నా నాటకాలు, సినిమాల్లో నటించాలనే కోరిక ఎక్కువైంది. అప్పుడే రైల్వేలో ఫైర్‌మ్యాన్ ఉద్యోగం వచ్చింది.
అది చేస్తూనే నాటకాలు వేయడం మొదలుపెట్టారు. ఉద్యోగమా? నాటకాలా? ఏదో ఒకటి తేల్చుకోమన్నారు అధికారులు. వరించి వచ్చిన డ్రైవర్ ఉద్యోగాన్ని కాదనడంతో పాటు ఉన్న ఉద్యోగానికి కూడా రాజీనామా చేసేశారు. ఇక.. ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి అడుగులు మొదలుపెట్టారు. హీరో కావాలని మద్రాసు వెళ్లారు. కానీ, అన్నీ కామెడీ పాత్రలే. అయినా రాజీపడ్డారు. అన్నట్లు.. కేకే శర్మ మొదటి సినిమా గురించి చెప్పలేదు కదూ.. 1969లో ఎన్టీఆర్, జయలలిత జంటగా విఠలాచార్య దర్శకత్వంలో డీవీయస్ రాజు నిర్మించిన ‘గండికోట రహస్యం’. అక్కణ్ణుంచి మొదలుపెట్టి దాదాపు పదేళ్ల క్రితం వరకూ కేకే శర్మ చేసినవి ఏడెనిమిది వందల సినిమాలు. ఆ సినిమాల్లో నటించినందుకు గాను అందుకున్న షీల్డులు ఠీవీగా అల్మరాలో ఉన్నాయి. కానీ, జీవితాన్ని ఠీవిగా గడిపేంత డబ్బే లేదు.
‘‘మంచి పాత్రలు చేసినా, అందుకు తగ్గ పారితోషికం మాత్రం అడగలేకపోయాను. ఎంత తక్కువిచ్చినా తీసుకున్నాను. ఏ పాత్ర పడితే ఆ పాత్ర చేసేశాను’’ అన్నారు శర్మ. కేకే శర్మకు ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి. ‘‘ఉన్నంతలో పొదుపుగా సంసారం నడపడంతో పిల్లల భవిష్యత్తు కోసం కొంత డబ్బు వెనకేసి, మద్రాసు, విజయవాడ, హైదరాబాద్‌లో స్థలాలు కొన్నాను. కాకినాడలో అయితే ఇల్లు కూడా కొన్నాను. కానీ, పెరిగిన ఖర్చులు, రాను రాను అరకొర అవకాశాలవల్ల అవన్నీ అమ్ముకోక తప్పలేదు. పిల్లలకు ఏమీ మిగల్చలేకపోయాను. అదే నా బాధ’’ అన్నారు ఆవేదనగా. పెపైచ్చు భార్యకు గొంతు కేన్సర్ సోకడంతో చికిత్సకు బాగానే ఖర్చయ్యింది. కొన్నేళ్లు భర్తకు తోడుగా ఉన్న ఆమె చివరికి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.
కేకే శర్మ ‘గోల నాగమ్మ’ పేరుతో వేరే నిర్మాతతో కలిసి ఓ సినిమా కూడా నిర్మించారు. రెండు లక్షల్లో సినిమా తీయాలనుకుంటే నాలుగు లక్షలయ్యింది. దాంతో సినిమా బాగా ఆడినా లాభం చవిచూడలేకపోయారు. వాస్తవానికి చిరంజీవితో కానీ, మురళీమోహన్‌తో కానీ సినిమా తీయాలనుకున్నారు శర్మ. కానీ, ‘ఇప్పుడే పైకి వస్తున్నాం. కొన్నాళ్లు ఆగగలిగితే తప్పకుండా చేస్తాం’ అని ఆ ఇద్దరూ అన్నారు. ఈలోపు నిర్మాత జారిపోతాడేమో అని దర్శకుడు ఒత్తిడి చేయడంతో నరసింహరాజు, కవిత, నాగభూషణంతో ‘గోల నాగమ్మ’ తీశారు. 75 రోజులాడింది. ఆ తర్వాత సినిమా తీసే ధైర్యం చేయలేదు’’ అన్నారు.
మనవూరు మారుతి, మయూరి, పేకాట పాపారావు, ఆపద్బాంధవుడు, మాయదారి కృష్ణుడు.. ఇలా తనకు పేరు తెచ్చిన చిత్రాలు చాలా ఉన్నాయని శర్మ చెప్పారు. ఆయన నటించిన చివరి చిత్రం ‘హైటెక్ మర్డర్’. ఆ తర్వాత సినిమాలు చేయలేకపోతున్నారు. మోకాళ్ల నొప్పితో పెద్దగా నడవలేని పరిస్థితి. షూటింగ్‌కి వెళ్లాలంటే ఇంటి నుంచి తోడు తీసుకెళ్లాలి. ఆ తర్వాత డబ్బింగ్ చెప్పడానికి కూడా అదే పరిస్థితి. అందుకని మానుకున్నారు.నాలుగున్నర దశాబ్దాల సినిమా జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న కేకే శర్మతో ‘‘సినిమా పరిశ్రమలోకి రావాలనుకునేవారికి మీరిచ్చే సలహా?’’ అని అడిగితే... ఓ ఐదు విషయాలు చెప్పి ముక్తాయింపు ఇచ్చారు. అవకాశాలు రాకపోయినా ఏడెనిమిదేళ్లు తట్టుకుని నిలబడే స్తోమత ఉన్నవాళ్లే పరిశ్రమకు రండి... తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు ఉంటే, నిర్భయంగా రావచ్చు... మద్యానికి బానిసలు కాకండి. యుక్తవయసులో ఉన్నవాళ్లు ఆడవాళ్లకు ఆకర్షితులు కావద్దు సుమా.. మంచి ఉద్యోగంలో ఉంటే మాత్రం, దయచేసి అది మానుకుని ఇక్కడికి రావద్దు..
సినిమా పరిశ్రమలో ఎంత పబ్లిసిటీ ఉంటే అంత మంచిదంటున్నారు శర్మ. తనకు తెలిసిన జర్నలిస్ట్‌ల దగ్గర, ‘‘నా బొమ్మ మీ పత్రికలో వేయండన్నా’’ అని అడిగేవారట. కానీ, నిరాశే ఎదురయ్యేది. ‘‘చిన్నవాళ్లను మీడియా పట్టించుకోదు. మంచి పబ్లిసిటీ ఉండి ఉంటే.. కెరీర్ వేరే విధంగా ఉండి ఉండేదేమో’’ అన్నారు శర్మ. ఇప్పుడు పూర్తిగా తన కొడుకుపైనే ఆధారపడ్డారు శర్మ. ‘‘నా కొడుకూ, కోడలు చాలా మంచివాళ్లు. ఉన్నంతలో బాగా చూసుకుంటారు. కానీ, ఇలా ఆధారపడాల్సి వచ్చినందుకు నాకే బాధగా ఉంటుంది’’ అన్నారు.