విద్యార్థులపై లాఠీచార్జ్
పురుగులన్నం పెడుతున్నారంటూ ఆందోళన చేసినందుకే..
భాగ్యనగర్‌కాలనీ: బొద్దింకలు చచ్చిన తాగునీరు, పురుగులతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నారని శ్రీచైతన్య కళాశాలకు చెందిన హాస్టల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. నిజాంపేటలోని శ్రీచైతన్య కళాశాలలో శుక్రవారం రాత్రి కనీస సౌకర్యాలు కల్పించకపోవడం పట్ల కళాశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. ఆందోళన తీవ్రతరం కావడంతో కళాశాల యాజమాన్యం విజ్ఞప్తి మేరకు రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారు. దీనిపై విద్యార్థి సంఘాలు కళాశాల యాజమాన్యంపై తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. కళాశాల వద్దకు చేరుకుని విద్యార్థులకు బాసటగా నిలిచాయి.
ఫీజుల వసూలు చేయడంలో జలగల్లా వ్యవహరిస్తూ కనీస సౌకర్యాలు కల్పించడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కళాశాల యాజమాన్యాన్ని నిలదీశారు. కూకట్పల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ మోయిజ్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్‌లు సంఘటన స్థలానికి చేరుకుని సరైన భోజనం పెట్టాలని అడిగిన విద్యార్థులపై లాఠీచార్జ్ చేయించిన యాజమాన్యం తీరుని ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో నేతలు ప్రవీణ్‌గౌడ్, విష్ణు, కిషోర్, పూర్ణ, రాజు, శివ, ఈశ్వర్, సురేశ్ మాదిగ, దుర్గా, మూర్తి పాల్గొన్నారు.