sriharipuram
-
ఆ కలెక్టర్ పేరుతోనే వెలిసిన గ్రామం
సాక్షి, ములగాడ (మల్కాపురం): కలెక్టర్ పేరు మీద వెలిసిన ఓ గ్రామం ఇప్పుడు దినదినాభివృద్ధి సాధిస్తూ జీవీఎంసీ 58వ వార్డుకు తలమానికంగా మారింది. 1909లో గుల్లలపాలెం ఏర్పడింది. గ్రామం ఏర్పడిన నాటికి కేవలం 50 కుటుంబాలు మాత్రమే ఇక్కడుండేవి. కాలక్రమంలో ఒకొక్క గ్రామం ఇక్కడ వెలిసింది. 1963–67 సంవ్సరంలో అప్పటి కలెక్టర్ శ్రీహరిరావు సింధియా నుంచి జింక్ వరకూ గల మట్టి రోడ్డును తారు రోడ్డుగా అభివృద్ధి చేశారు. అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామస్తులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో కలెక్టర్ శ్రీహరిరావు ఈ ప్రాంతీయులకు ఆత్మీయుడయ్యారు. దీంతో కలెక్టర్ శ్రీహరిరాజు పేరుతో శ్రీహరిపురం అని గ్రామానికి పేరు పెట్టారు. గుల్లలపాలెం, శ్రీహరిపురం, శ్రీనివాసనగర్, రాంనగర్, కోడిపందాల దిబ్బ, ఎదురవానిపాలెం, ములగాడ, పిలకవానిపాలెం, గొందేశిపాలెం ఇప్పుడు జీవీఎంసీ 58వ వార్డులో ఉన్నాయి. జీవీఎంసీ 58వ వార్డుకు ప్రధాన ప్రాంతం శ్రీహరిపురమే. కాలుష్య సమస్యకు కారణమవుతున్న అలూఫ్లోరైడ్ పరిశ్రమ 1983లో వార్డుగా... అప్పటి వరకూ పంచాయతీ పరిధిలో ఉన్న ఈ ప్రాంతం 1983లో వార్డుగా రూపాంతరం చెందింది. అప్పుడు 46వ వార్డుగా గుర్తించారు. 2020లో ఆ వార్డు కాస్తా 58వ వార్డుగా మారింది. 46వ వార్డులో ఉన్నప్పుడు ఓటర్లు 12 వేల మంది ఉన్నారు. ప్రస్తుతం 17 వేల మంది ఓటర్లు ఉండగా..జనభా 20 వేలకుపైగా ఉంది. వార్డులో ప్రధాన సమస్యలు వార్డులో కోరమండల్, అలూఫ్లోరైడ్ వంటి పరిశ్రమలు ఉన్నాయి. ఆయా పరిశ్రమల నుంచే వచ్చే కాలుష్యంతో ములగాడ, గుల్లలపాలెం, కోడిపందాల దిబ్బ, ఎదురవానిపాలెం, ములగాడ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు. అలాగే ఈ గ్రామాల్లో చాలా మంది యువత నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటున్నారు. గ్రామంలో ప్రధాన గెడ్డలు ఆక్రమణకు గురి కావడంతో దిగువ ప్రాంత గ్రామాలు వర్షాకాలంలో ముంపునకు గురవుతున్నాయి. -
ఇలాంటి కొడుకు మరెవరికీ వద్దు!
అన్న తీరుపై చెల్లెళ్ల ఫిర్యాదు మల్కాపురం: కంటే కూతురునే కనాలి అన్న ఓ సినీ కవి భావం అక్షరాలా నిజమైంది. కష్టాల్లో ఉన్న తల్లిని కడచూపు చూసేందుకు మలేసియా నుంచి కూతుళ్లు కదిలారు గానీ, పక్కనే ఉన్న కొడుకు మనసు మాత్రం చలించలేదు. పైగా తల్లి, చెల్లెళ్ల ఆస్తి కాజేసేందుకు కూడా వెనకాడలేదు. వివరాల్లోకి వెళితే.. 46వ వార్డు శ్రీహరిపురం-శ్రీనివాస్‌నగర్‌లో సత్యవతి అనే వృద్థురాలు తన సొంతింట్లో నివసిస్తోంది. ఆమెకు శ్రీదేవి, కనకమహాలక్ష్మి అనే కుమార్తెలతో పాటు శ్రీనివాసరావు అనే కుమారుడున్నాడు. కుమార్తెలిద్దరూ మలేసియాలో ఉంటున్నారు. శ్రీనివాసరావు స్థానికంగా తన భార్య, పిల్లలతో ఉంటున్నాడు. సత్యవతి నుంచి కొడుకు మొదటి నుంచి దూరంగానే ఉంటున్నాడని స్థానికులు చెబుతున్నారు. కుమార్తెలే ఆమెకు నెల నెలా డబ్బు పంపించేవాళ్లు. ఆమె బాగోగులన్నీ ఇరుగుపొరుగు వాళ్లే చూసేవాళ్లు. సత్యవతి ఇంటిని ఇటీవల తన పెద్ద కుమార్తె శ్రీదేవికి రాసిచ్చేసింది. ఇదిలా ఉంటే యథావిధిగానే గత శనివారం సత్యవతికి పొరుగింటివాళ్లు టీ తెచ్చారు. ఆ సమయంలో ఆమె కింద పడిపోయి ఉన్నట్టు గుర్తించడంతో కలవరం చెంది స్థానిక ఓ ప్రైవేట్ అస్పత్రికి తీసుకువెళ్లారు. ఇదే విషయాన్ని మలేసియాలో ఉంటున్న ఆమె పిల్లలకు సమాచారం అందించారు. శ్రీనివాస్‌కు విషయం చెప్పారు. కూతుళ్లు పట్టించుకున్నా కొడుకు పట్టించుకోలేదు. తల్లిని ఆస్పత్రికి తరలించిన సమయంలో ఆమె ఇంటిని కూడా శ్రీనివాస్ ఆక్రమించాడని ఆమె పెద్దకుమార్తె శ్రీదేవి ఆరోపించింది. తల్లికి ఆరోగ్యం బాగోలేదని తెలిసి ఈనెల 26న కుమార్తెలిద్దరూ నగరానికి చేరుకుని ఆస్పత్రిలో ఉన్నా ఆమెను పరామ ర్శించారు. కాగా ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడం తో ఈ నెల 26న రాత్రి మృతిచెందింది. ఆస్పత్రి ఖర్చు లు కూడా భరించనంటూ శ్రీనివాస్ మొండికేశాడు. ఆమె అంత్యక్రియలకు కూడా ముందుకు రాలేదు. దీంతో సత్యవతి మృతదేహం రెండు రోజులపాటు ఆస్పత్రిలోనే ఉంచాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సోదరుడి తీరుపై శ్రీదేవి, కనకమహాలక్ష్మిలు పోలీసులకు ఫిర్యాదిచ్చారు. బుధవారం సత్యవతి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా.. ఈ ఘటన సత్యవతి ఆస్తిపై వివాదం వల్లేనని పోలీసులు గుర్తించారు. పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా.. ఆస్తిని తనకిప్పిస్తే తక్షణం ఇల్లు ఖాళీ చేస్తానని శ్రీనివాస్ చెప్పడంపై పోలీసులూ ఆశ్చర్య పోయారు. తల్లిని సైతం కాదని ఆస్తిపైనే దృష్టి సారించడంపై స్థానికులు మండిపడుతున్నారు.