శ్రీకాకుళం వరకూ గోదావరి జలాలు
మంత్రి యనమల
తుని రూరల్ :
రూ.4,500 కోట్లతో నిర్మించే పోలవరం ఎడమ కాలువ, రూ.1,650 కోట్లతో ఏర్పాటు చేసే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీకాకుళం జిల్లా వరకూ గోదావరి జలాలను అందించనున్నట్టు రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. జనచైతన్య యాత్రలో భాగంగా తుని మండలం కుమ్మరిలోవ కాలనీలో పోలవరం ఎడమ కాలువ నిర్వాసితులనుద్దేశించి గురువారం ఆయన మాట్లాడారు. నాలుగు జిల్లాలకు ప్రయోజనకరంగా ఉండే పోలవరం ఎడమ కాలువకు, ఎత్తిపోతల పథకాల ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయన్నారు. పురుషోత్తపట్నం వద్ద ఎత్తిపోతలు ఏర్పాటు చేసి ఏలేరు రిజర్వాయర్‌కు, అక్కడ నుంచి పోలవరం ఎడమ కాలువ ద్వారా శ్రీకాకుళం జిల్లా వరకూ గోదావరి జలాలు తరలిస్తామన్నారు. రూ.6 వేల కోట్లకు పైగా వ్యయంతో చేపట్టే పోలవరం ఎడమ కాలువకు అందరి సహకారం అవసరమన్నారు. రెండు విడతల్లో రైతులకు రూ.24 వేల కోట్లు, మహిళలకు రూ.6 వేల కోట్లు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు రూ.1,000 కోట్లు రుణమాఫీ చేసినట్టు చెప్పారు. రైతులకు, మహిళలకు మూడో విడత రుణమాఫీ నిధులు వచ్చే ఏడాది మార్చి తర్వాత ఖాతాలకు జమ చేస్తామన్నారు. ఒక్కో మహిళకు అందించే రూ.10 వేలను తమ అవసరాలకు వాడుకునేలా అనుమతి ఇచ్చామని, అయితే వ్యాపార కార్యకలాపాలకు వినియోగించాలని యనమల విజప్తి చేశారు.