ఆంధ్రా సర్కారు పెత్తనం సాగనివ్వం
నర్సాపూర్(జి) (దిలావర్పూర్) : మన తెలంగాణ రాష్ట్రం మనకు ఏర్పాటై, ప్రభుత్వాలు వేరుగా ఏర్పడ్డా తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రా సర్కారు ఇంకా అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని, వారి పెత్తనాన్ని సాగనివ్వబోమని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. దిలావర్పూర్ మండలంలోని నర్సాపూర్ (జి) గ్రామంలో నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని శనివారం సాయంత్రం ఆయన ఆవిష్కరించారు. అమరులైన వారిని స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఏళ స్వరాష్ట్ర కల నెరవేరిన తరుణంలో అమరులైన వారిని స్మరించుకునేందుకు స్తూపాలు నిర్మించడం అభినందనీయమన్నారు.
కేంద్రం తెలంగాణ రాష్ట్రంలోని పలు అధికారాలపై రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడం శోచనీయమన్నారు. ముఖ్యంగా గవర్నర్‌కు పలు అధికారాలను అప్పజెప్పాలన్న నిర్ణయం సరికాదన్నారు. అలాగే పోలవరం ముంపు మండలాలనుఆంధ్రాలో కలపడం తెలంగాణకు అన్యాయం చేయడమేనన్నారు. అలాగే విద్యుత్ విషయంలోనూ చిన్నచూపు చూడడం చూస్తున్నారని దుయ్యబట్టారు. మళ్లీ తెలంగాణ ప్రజలను వంచించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ పై పెత్తనం చూపుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నర్సాపూర్(జి) గ్రామానికి ఎంతో ప్రత్యేకత ఉందని.. తాను మూడుసార్లు గ్రామానికి వచ్చానని.. ఇక్కడి విద్యావంతులు, తెలంగాణ ఉద్యమాకారులు, ప్రజల ఐక్యత గర్వించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రేఖారమేష్, ఎంపీటీసీలు కవితాసాయినాథ్, లక్ష్మీవిజయ్కుమార్, జేఏసీ నాయకులు విజయ్‌కుమార్, డాక్టర్ కృష్ణం రాజు, పాకాల రాంచందర్, అజయ్, నైనాల గోవర్ధన్, రామ్మోహ న్, తక్కల విద్యాసాగర్‌రెడ్డి, భోజారెడ్డి, గంగారెడ్డి, అజీం, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
కోదండరాంను కలుద్దామని..
మామడ మండంలోని పోతారం గ్రామానికి చెందిన శ్రీఖర్ కొంత కాలంగా లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఎలాగైనా ప్రొఫెసర్ కోదండరాంను కలవాలనే తన చివరి ఆశను నెరవేర్చుకునేందుకు శనివారం నర్సాపూర్(జి)కి వచ్చాడు. కార్యక్రమంలో భాగంగా అతను కోదండరాంను కలిశాడు.