చిలుకూరులో నేడు మహాలక్ష్మి ఉత్సవం
ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ, దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల ను నిరసిస్తూ చిలుకూరు బాలాజీ దేవాల యంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఫిబ్రవరి 14ను ప్రేమికుల దినోత్సవంగా నిర్వహిస్తూ కొంతమంది ప్రేమ ను వ్యాపారమయం చేస్తున్నారని, దీన్ని వ్యతిరేకిస్తూ అదేరోజున శ్రీమహాలక్ష్మి ఉత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించి నట్టు దేవాలయాల పరిరక్షణ ఉద్యమం సంధానకర్త రంగరాజన్ వెల్లడించారు.
ఇందులో భాగంగా శనివారం బాలికలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు. సంప్రదాయ దుస్తులతో అమ్మవారిలా అలంకరించి, కాళ్లకు పసుపు పారాణి పూసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు.
మొయినాబాద్: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచి భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రత్యేకతకు మారుపేరుగా నిలుస్తోంది. నిత్యం వేలాది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇప్పటికే భగవంతుడిని వ్యాపారమయం చేయవద్దంటూ హుండీ, కానుకలు లేకుండా వీఐపీ దర్శనాలు, టికెట్ దర్శనాలకు అనుమతి ఇవ్వకుండా ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒకే పద్ధతిలో స్వామివారిని దర్శించుకునే అవకాశం ఈ దేవాలయానికే సొంతం. ఇదే తరహాలో చిలుకూరులో మరో బృహత్కార్యానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఫిబ్రవరి 14ను ప్రేమికుల దినోత్సవంగా నిర్వహిస్తూ కొంతమంది ప్రేమను వ్యాపారమయం చేస్తున్నారని, దీన్ని వ్యతిరేకిస్తూ ఇదేరోజు శ్రీమహాలక్ష్మి ఉత్సవంగా నిర్వహిం చాలని నిర్ణయించారు. అది గుడిలోనే మొదలు కావాలన్న ఆకాంక్షతో ‘నారి సర్వజగన్మయి’ ఉద్యమం పేరిట ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ప్రేమకు వ్యతిరేకం కాదు..
మహాలక్ష్మి అవతారమైన రుక్మిణీదేవి కృష్ణపరమాత్ముడిని ప్రేమించింది. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు వేంకటేశ్వరస్వామి పద్మావతి అమ్మవారిని ప్రేమించి పెళ్లాడారు. దేవతల కాలం నుంచే ప్రేమ అనేది ఉంది. ప్రేమ సున్నితమైంది, వ్యక్తిగతమైంది. సినిమావాళ్లు దీనిని కలుషితం చేసేలా, మహిళలను హింసించి వ్యక్తపరిచేలా మలిచారు. దీంతో సమాజంలో కీచకులు కథానాయకులుగా, పోకిరీలు ఆరాధ్యులుగా మారారు. ఈ ధోరణి ప్రమాదకరంగా పరిణమించింది. అందుకే చిలుకూరు నుంచి ఈ ఉద్యమాన్ని మొ దలుపెడుతున్నామని ఆలయ అర్చకులు చెబుతున్నారు.
ఎందుకు చేపడుతున్నారంటే..
ఇటీవల కాలంలో మహిళలపై అఘాయిత్యాలు, అకృత్యాలు పెరిగిపోయాయి. యాసిడ్ దాడులు, వరకట్న వేధింపులు సర్వసాధారణమయ్యాయి. ఇలాంటి భయంకర పరిస్థితిని రూపుమాపి సమాజంలో మహిళ కోల్పోయిన ఉన్నత స్థానాన్ని తిరిగి తీసుకురావడం కోసమే చిలుకూరు బాలాజీ దేవాలయం ఆధ్వర్యంలో యేటా ఫిబ్రవరి 14న శ్రీమహాలక్ష్మి ఉత్సవాన్ని చేపట్టేందుకు నిర్ణయించారు. దీనిపై ఆలయ అర్చకులు ఇప్పటికే ప్రచారం కల్పించారు.
బాలికలచే ప్రద క్షిణలు నేడు..
మహాలక్ష్మి ఉత్సవంలో భాగంగా శనివారం బాలికలచే ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించనున్నారు. సంప్రదాయ దుస్తులతో అమ్మవారిలా అలంకరించి, వారి కాళ్లకు పసుపు పారాణి పూసి భక్తులతో కలిసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు.
ప్రతి మహిళా మహాలక్ష్మి ప్రతిరూపమే..
ప్రస్తుత సమాజంలో మహిళలపై అకృత్యాలు, దాడులు జరుగుతున్నాయి. వీటన్నింటినీ రూపుమాపేందుకే ‘నారి సర్వజగన్మయి’ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇందులో అందరూ భాగస్వాములు కావాలి. ఈ సంవత్సరం చిలుకూరులోనే నిర్వహిస్తున్నాం. వచ్చే సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని అన్ని దేవాలయాల్లోనూ నిర్వహించేందుకు కృషి చేస్తాం. దేవాలయాలు, విద్యాలయాలు, సామాజిక కార్యకర్తలు, సేవా సంస్థలు, మహిళా సంస్థలు తమ పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే మంచిది.
- రంగరాజన్, దేవాలయాల పరిరక్షణ ఉద్యమం సంధానకర్త