సెలవు కోసం పాఠశాలకు మూడు రోజులు తాళాలు వేసిన హెచ్ఎం
విధులకు గైర్హాజరు అనధికారికంగా పాఠశాలకు మూడురోజులు సెలవు ప్రకటన
గ్రామస్తులు, తల్లిదండ్రుల ఫిర్యాదుతో వెలుగుచూసిన వైనం ఎంఈవో నివేదికతో చర్యలు
నక్కపల్లి: సెలవు పెట్టకుండా విధులకు గైర్హాజరుతోపాటు మూడు రోజులు పాఠశాలలకు సెలవు ప్రకటించి తాళాలు వేసిన హెచ్ఎంను జిల్లా విద్యాశాఖాధికారి సస్పెండ్ చేసినట్టు ఎంఈవో పద్మావతి తెలిపారు. వివరాలిలావున్నాయి. చందనాడ పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్ విధులు సక్రమంగా రావడంలేదని గ్రామస్తులు పలుసార్లు మండల విద్యాశాఖాధికారికి ఫిర్యాదు చేశారు. ఈ పాఠశాలలో సుమారు 200 మంది విద్యార్థులునారు. హెచ్ఎం, ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో ఒకరు బుధవారం సెలవు పెట్టారు. హెచ్ఎం శ్రీనివాస్, మరో ఉపాధ్యాయుడు హాజరుకావాలి. పాఠశాలకు వచ్చిన హెచ్ఎం మధ్యాహ్నం వరకు ఉండి, మూడు రోజులు సెలవంటూ విద్యార్థులకు చెప్పి వెళ్లిపోయారు. మధ్యాహ్నం నుంచి పాఠశాల మూసివేయడంపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు, గ్రామపెద్దలు వెంకటేశ్వరరావు, భార్గవ్, పి. రమణ ఈ విషయాన్ని ఎంఈవో పద్మావతి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఆమె పాఠశాలకు వెళ్లారు. విద్యార్థులంతా ఆడుకుంటూ కనిపించడంతో ఆరాతీశారు.
ఉపాధ్యాయులు ఎక్కడని ప్రశ్నించగా హెచ్ఎం శ్రీనివాస్ ఒక్కరే వచ్చి మధ్యాహ్నం వరకు ఉండి వెళ్లిపోయారని, మూడు రోజులు పాఠశాలకు సెలవని చెప్పారని విద్యార్థులు వివరించడంతో ఆమె కంగుతిన్నారు. పాఠశాలకు తాళాలు వేసి ఉన్నందున హాజరుపట్టీ పరిశీలించేందుకు అవకాశం లేకపోయింది. వివరణ కోరేందుకు ప్రయత్నించినా హెచ్ఎం స్పందించలేదని తెలిపారు. మరో టీచర్ విధులకు గైర్హాజరు అయ్యారా, సెలవుపై వెళ్లారా అనేది అటెండెన్స రిజిస్టర్ ఆధారంగా నిర్థారిస్తామన్నారు. ఈ విషయం డీఈవో దృష్టికి తీసుకెళ్లగా హెచ్ఎంను సస్పెండ్ చేశారని ఎంఈవో తెలిపారు.