పుణ్యస్నానాల్లో విషాదం
ఒకరు మృతి.. మరొకరు గల్లంతు
దిమిలి శివారు వాడపాలెం తీరంలో ఘటన
రాంబిల్లి: మాఘపౌర్ణమి పుణ్యస్నానాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. రాంబిల్లి శివారు వాడపాలెం తీరంలో పుణ్యస్నానాలు చేస్తుండగా కెరటాల ధాటికి ఒకరు మృతి చెందగా మరొకరు గల్లంతయ్యారు. దీంతో విషాదం చోటుచేసుకుంది. తీరంలో లోపలికి వెళ్లి పుణ్యస్నానాలు చేస్తుండగా అలల్లో చిక్కుకుని మండలంలోని దిమిలికి చెందిన జనపరెడ్డి శ్రీనివాసరావు(37) మృతి చెందాడు. ఇదే మండలం కొత్తూరుకు చెందిన తురగలపూడి అజయ్‌కుమార్(19) కెరటాల్లో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. ప్రత్యక్షసాక్షులు, పోలీసులు కథనం ప్రకారం వివరాలిలావున్నాయి. వాడపాలెం తీరానికి పుణ్యస్నానాలకు దిమిలికి చెందిన జనపరెడ్డి శ్రీనివాసరావు భార్య నూకరత్నం, ముగ్గురు పిల్లలతో మంగళవారం వచ్చాడు. వికలాంగుడైన ఇతడు పుణ్యస్నానం చేస్తుండగా అలల్లో చిక్కుకుపోయాడు. గమనించిన యువకులు అతికష్టం మీద కొన ఊపిరితో ఉన్న అతడ్ని ఒడ్డుకు చేర్చారు. సపర్యలు చేశారు. కొద్ది సేపటికి చనిపోయాడు. శ్రీనివాసరావు దిమిలిలో చిన్న టిఫిన్ సెంటరును నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు, రెండేళ్ల పాప ఉన్నారు.
మంగళవారం ఉదయం 8 గంటల వరకు టిఫిన్ సెంటర్లో అమ్మకాలు జరిపారు. అనంతరం ఆటోలో వాడపాలెం పుణ్యస్నానాలకు వచ్చారు. ఇక తమ జీవనోపాధి ఎలాగంటూ భార్య నూకరత్నం విలపిస్తున్న తీరు పలువురిని కంట తడిపెట్టించింది. శ్రీనివాసరావు మృతదేహానికి యలమంచిలి ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులుకు అప్పగించారు. కాగా కొత్తూరుకు చెందిన తురగలపూడి అజయ్‌కుమార్ స్నేహితులతో కలిసి పుణ్యస్నానాలకు వచ్చి కెరటాల ఉధృతికి గల్లంతయ్యాడు. ఇతడు అచ్యుతాపురంలో ఐటిఐ చేస్తున్నాడు. గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టారు. ఎస్ఐ కె. మల్లేశ్వరరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రెండు సంఘటనలతో వాడపాలెం, దిమిలి, కొత్తూరు గ్రామాల్లో విషాదం అలుముకుంది.