Srinivasa Sports Complex
-
తిరుపతిలో జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
- అన్ని రాష్ట్రాల నుంచీ 700 మంది క్రీడాకారుల హాజరు - వరల్డ్ చాంపియన్‌షిప్‌కు ఇవే సెలక్షన్స్ టోర్నమెంట్ సాక్షి ప్రతినిధి, తిరుపతి తిరుపతి శ్రీనివాసా స్పోర్ట్స్ కాంప్లెక్సులో ఆదివారం ఉదయం ఆల్ ఇండియా జూనియర్ ర్యాంకింగ్స్ బాడ్మింటన్ పోటీలు ప్రారంభం అయ్యాయి. చిత్తూరు జిల్లా బాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలు 24 వరకూ జరుగుతాయి. ఎంతో ప్రతిష్టాత్మంగా జరిగే ఈ పోటీలకు అన్ని రాష్ట్రాల నుంచి 700 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. ఉదయం 9 గంటలకు ఆల్ ఇండియా బాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు గంటా పున్నయ్యచౌదరి, పోటీల కార్యనిర్వాహక కార్యదర్శి బీ జయచంద్రలు ప్రారంభించారు. అండర్-17, 19 కేటగిరీల్లో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పోటీలను నిర్వహిస్తున్నారు. అక్టోబరులో జరిగే వరల్డ్ బాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీలకు తిరుపతిలో జరిగే పోటీలకు సెలక్షన్స్గా పరిగణిస్తున్న నేపథ్యంలో ఇక్కడ జరిగే పోటీలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. జాతీయ స్థాయి పోటీల్లో ఇప్పటికే రాణిస్తోన్న ఎం. కనిష్క్, కిరాన్సేన్ (ఎయిర్ ఇండియా), లక్షసేన్ (ఉత్తరాఖండ్), జీ ఉషాలీ (తెలంగాణ), షికా గౌతం (కర్ణాటక), ఆకర్షి కశ్యప్ (చత్తీస్‌గఢ్), ఎం. తనిష్క్ (ఏపీ)రియా ముఖర్జీ (యూపీ)లు ఇప్పటికే తిరుపతి చేరుకున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ పోటీలకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
చదరంగం పోటీలకు విశేష స్పందన
తిరుపతి స్పోర్ట్స్: చిత్తూరు జిల్లా చదరంగం సమాఖ్య తిరుపతిలో నిర్వహించిన చదరంగం పోటీలకు విశేష స్పందన లభించింది. శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆదివారం ఉదయం నిర్వహించిన ఈ పోటీలను రుయా బ్లడ్‌బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ ఆర్ఆర్.రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి ఐదుసార్లు ప్రపంచ కప్‌ను అందించింది ఒక్క చదరంగం మాత్రమే అని గుర్తుచేశారు. అయినా చదరంగానికి ఆశించిన స్థాయిలో ఖ్యాతి రాకపోవడం బాధాకరమన్నారు. అనంతరం సాయంత్రం నిర్వహించిన బహుమతుల ప్రదానోత్సవానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జి.భానుప్రకాష్‌రెడ్డి హాజరయ్యారు. విజేతలుగా నిలిచిన 25 మందికి నగదు బహుమతులు, 90 మందికి షీల్డ్, సర్టిఫికెట్లు అందించారు. బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ పొనగంటి భాస్కర్, జిల్లా చదరంగం అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. గందరగోళంగా పోటీలు తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆదివారం నిర్వహించిన చదరంగం పోటీలు గందరగోళంగా జరిగాయి. నిర్వాహకులు ఆశించిన స్థాయి కంటే అధికంగా క్రీడాకారులు హాజరయ్యారు. దాదాపు 600 మందికి పైగా రావడంతో అందరికీ పోటీలు నిర్వహించడం నిర్వాహకులకు తలనొప్పిగా మారింది. ఈ గందరగోళం నడుమ పోటీలు ఎవరికి వారే నిర్వహించుకోవడం, ఓడినా తామే గెలిచామని ప్రకటించుకోవడం కనిపించింది. దీంతో గెలిచినా ఓడినట్టు నిర్వాహకులు ప్రకటించడంతో ఏడుగురు క్రీడాకారులు కన్నీటి పర్యంతమవుతూ బయటకు వచ్చారు. విషయం పిల్లల తల్లిదండ్రులకు తెలియడంతో నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. ఒక్కో క్రీడాకారుని నుంచి రూ.200 చొప్పున డబ్బు వసూలు చేసి, తీరా నిబంధనలకు విరుద్దంగా పోటీలు నిర్వహిస్తున్నారంటూ మండిపడ్డారు. గెలిచిన క్రీడాకారులను సమయం లేదంటూ ఎందుకు పక్కన పెట్టారని నిలదీయడంతో తల్లిదండ్రులను నిర్వాహకులు బుజ్జగించడం కనిపించింది.