- అన్ని రాష్ట్రాల నుంచీ 700 మంది క్రీడాకారుల హాజరు
- వరల్డ్ చాంపియన్‌షిప్‌కు ఇవే సెలక్షన్స్ టోర్నమెంట్
సాక్షి ప్రతినిధి, తిరుపతి
తిరుపతి శ్రీనివాసా స్పోర్ట్స్ కాంప్లెక్సులో ఆదివారం ఉదయం ఆల్ ఇండియా జూనియర్ ర్యాంకింగ్స్ బాడ్మింటన్ పోటీలు ప్రారంభం అయ్యాయి. చిత్తూరు జిల్లా బాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలు 24 వరకూ జరుగుతాయి. ఎంతో ప్రతిష్టాత్మంగా జరిగే ఈ పోటీలకు అన్ని రాష్ట్రాల నుంచి 700 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. ఉదయం 9 గంటలకు ఆల్ ఇండియా బాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు గంటా పున్నయ్యచౌదరి, పోటీల కార్యనిర్వాహక కార్యదర్శి బీ జయచంద్రలు ప్రారంభించారు. అండర్-17, 19 కేటగిరీల్లో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పోటీలను నిర్వహిస్తున్నారు.
అక్టోబరులో జరిగే వరల్డ్ బాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీలకు తిరుపతిలో జరిగే పోటీలకు సెలక్షన్స్‌గా పరిగణిస్తున్న నేపథ్యంలో ఇక్కడ జరిగే పోటీలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. జాతీయ స్థాయి పోటీల్లో ఇప్పటికే రాణిస్తోన్న ఎం. కనిష్క్, కిరాన్‌సేన్ (ఎయిర్ ఇండియా), లక్షసేన్ (ఉత్తరాఖండ్), జీ ఉషాలీ (తెలంగాణ), షికా గౌతం (కర్ణాటక), ఆకర్షి కశ్యప్ (చత్తీస్‌గఢ్), ఎం. తనిష్క్ (ఏపీ)రియా ముఖర్జీ (యూపీ)లు ఇప్పటికే తిరుపతి చేరుకున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ పోటీలకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.