చిత్తూరు జిల్లా చదరంగం సమాఖ్య తిరుపతిలో నిర్వహించిన చదరంగం పోటీలకు విశేష స్పందన లభించింది. శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆదివారం ఉదయం నిర్వహించిన...
తిరుపతి స్పోర్ట్స్: చిత్తూరు జిల్లా చదరంగం సమాఖ్య తిరుపతిలో నిర్వహించిన చదరంగం పోటీలకు విశేష స్పందన లభించింది. శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆదివారం ఉదయం నిర్వహించిన ఈ పోటీలను రుయా బ్లడ్‌బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ ఆర్‌ఆర్.రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి ఐదుసార్లు ప్రపంచ కప్‌ను అందించింది ఒక్క చదరంగం మాత్రమే అని గుర్తుచేశారు.
అయినా చదరంగానికి ఆశించిన స్థాయిలో ఖ్యాతి రాకపోవడం బాధాకరమన్నారు. అనంతరం సాయంత్రం నిర్వహించిన బహుమతుల ప్రదానోత్సవానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జి.భానుప్రకాష్‌రెడ్డి హాజరయ్యారు. విజేతలుగా నిలిచిన 25 మందికి నగదు బహుమతులు, 90 మందికి షీల్డ్, సర్టిఫికెట్లు అందించారు. బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ పొనగంటి భాస్కర్, జిల్లా చదరంగం అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
గందరగోళంగా పోటీలు
తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆదివారం నిర్వహించిన చదరంగం పోటీలు గందరగోళంగా జరిగాయి. నిర్వాహకులు ఆశించిన స్థాయి కంటే అధికంగా క్రీడాకారులు హాజరయ్యారు. దాదాపు 600 మందికి పైగా రావడంతో అందరికీ పోటీలు నిర్వహించడం నిర్వాహకులకు తలనొప్పిగా మారింది. ఈ గందరగోళం నడుమ పోటీలు ఎవరికి వారే నిర్వహించుకోవడం, ఓడినా తామే గెలిచామని ప్రకటించుకోవడం కనిపించింది. దీంతో గెలిచినా ఓడినట్టు నిర్వాహకులు ప్రకటించడంతో ఏడుగురు క్రీడాకారులు కన్నీటి పర్యంతమవుతూ బయటకు వచ్చారు.
విషయం పిల్లల తల్లిదండ్రులకు తెలియడంతో నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. ఒక్కో క్రీడాకారుని నుంచి రూ.200 చొప్పున డబ్బు వసూలు చేసి, తీరా నిబంధనలకు విరుద్దంగా పోటీలు నిర్వహిస్తున్నారంటూ మండిపడ్డారు. గెలిచిన క్రీడాకారులను సమయం లేదంటూ ఎందుకు పక్కన పెట్టారని నిలదీయడంతో తల్లిదండ్రులను నిర్వాహకులు బుజ్జగించడం కనిపించింది.