bhanu Prakash Reddy
-
‘ఈసీ అంటే హెరిటేజ్ కంపెనీ కాదు’
సాక్షి, తిరుపతి : ఓటమి భయంతోనే చంద్రగిరిలో రీపోలింగ్ ఆపడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్రామాలు ఆడుతున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భాను ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ చెప్పినట్లుగా ఈసీ నడుచుకుంటుందని టీడీపీ చేస్తున్న విమర్శలను ఖండిస్తున్నామన్నారు. ఎన్నికల కమిషన్ అంటే చంద్రబాబు హెరిటేజ్ కంపెనీ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెప్పిందల్లా చేయడానికి ఈసీ ఆయన పెట్టిన హెరిటేజ్ సంస్థ, టీడీపీ కాదని విమర్శించారు. చంద్రగిరిలో రీపోలింగ్ అంటే టీడీపీ ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. ఎన్నికలు నిర్వహించడంలో జిల్లా అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఏపీలోనే చంద్రబాబుకు సీటు లేదు కానీ ఇక ఢిల్లీలోని సీటు గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్రంలో బీజేపీ తిరిగి భారీ మెజారిటీతో అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. -
‘బాబుకు చంద్ర గ్రహణం స్టార్టయింది’
సాక్షి, తిరుపతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదవి మరిచి రౌడీలా ప్రవర్తిస్తున్నారని బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాకినాడలో బీజేపీ నాయకులు వినతిపత్రం ఇవ్వడానికి వెళితే హౌజ్ అరెస్ట్ చేయడం మంచి పద్దతి కాదని వ్యాఖ్యానించారు. 1998, 2014లో తమతో పొత్తు పెట్టుకొవడం వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. నరేంద్ర మోదీ లేకపోతే అధికారంలోకి ఎలా వచ్చారో చెప్పాలన్నారు. బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటి మీద రౌడీల్లా దాడి చేశారు... టీడీపీ పరిపాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు చంద్రగ్రహణం స్టార్ట్ అయ్యిందని..త్వరలోనే సైకిల్ చక్రాలు ఊడిపోవడం ఖాయమన్నారు. ఇచ్చిన హామీలు 90శాతం పూర్తి చేశామని, 2019లో కూడా నరేంద్ర మోదీయే ప్రధాన మంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. -
బాబు మానసిక స్థితి బాగా లేనట్లుంది: బీజేపీ
ఢిల్లీ: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని డ్రామాగా చిత్రీకరించడం అమానుషమని టీటీడీ మాజీ సభ్యుడు, బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో భాను ప్రకాశ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి మానసిక పరిస్థితి బాగా లేనట్లుందని అన్నారు. జగన్‌పై దాడి విచారించాల్సింది పోయి రాజకీయం చేయడం దారుణమన్నారు. 2003లో అలిపిరి బాంబు దాడి జరిగినపుడు అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయని, జగన్‌పై దాడిని ఖండించిన వైనాన్ని కూడా రాజకీయం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కత్తి గనుక మెడకు తగిలి ఉంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేదో ఊహించుకోవచ్చునని వ్యాఖ్యానించారు. నిన్న జరిగిన ఘటనపై స్వతంత్ర వ్యవస్థ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 2019లో చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధిచెబుతారని జోస్యం చెప్పారు. విచారణ పూర్తి కాకముందే సానుభూతి కోసమే జరిగిందని డీజీపీ చెప్పడం విచారణను దారి మళ్లించడమేనని పేర్కొన్నారు. దాడికి చేసిన వ్యక్తి వైఎస్సార్ కాంగ్రెస్‌ను అభిమానించే కుటుంబం అని ప్రచారం చేయడం సరికాదన్నారు. ఎన్టీఆర్ కుటుంబంలోనే హరికృష్ణ ఒక పార్టీ, లక్ష్మీ పార్వతి ఒక పార్టీ, పురందేశ్వరి మరో పార్టీలో ఉన్నారు..దాడికి పాల్పడ్డ వ్యక్తి కుటుంబం అంతా ఒకే పార్టీ మద్దతు దారులని ఎలా చెబుతారని సూటిగా ప్రశ్నించారు. -
నారావారి దేవస్థానంగా టీటీడీ: బీజేపీ
విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నారావారి దేవస్థానంగా మారిపోయిందని టీటీడీ మాజీ సభ్యుడు, బీజేపీ రాష్ర్ట కార్యదర్శి జి. భాను ప్రకాశ్ రెడ్డి విమర్శించారు. శ్రీవారి సేవా టికెట్ల పేరుతో తిరుమల జేఈఓ కార్యాలయం కేంద్రంగా లక్షల రూపాయలు రోజూ చేతులు మారుతున్నాయని ఆరోపించారు. టీటీడీని కొంతమంది సిబ్బంది దళారీ క్షేత్రంగా మార్చేశారని మండిపడ్డారు. గత నెల 27వ తేదీన జేఈఓ టికెట్ల తనిఖీలో జరిగిన విచారణ నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సీఎం కార్యాలయంలో పనిచేస్తోన్న కొంతమంది సిబ్బందికి సేవా టిక్కెట్ల కుంభకోణంలో ప్రమేయముందని ఆరోపించారు. టీటీడీలో జరుగుతున్న అవినీతిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. -
'దేవుడి భూములు అమ్మదనుకుంటున్నా'
తిరుపతి: కొంతమంది స్వార్థపరులు దేవాలయాల భూములు కబ్జా చేశారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం తిరుపతిలో ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాలయాల భూములను తాకట్టు పెట్టడం కానీ, అమ్మడం కానీ చేయదని భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదికాక ఆంధ్రప్రదేశ్‌లో బడ్జెట్ పూర్తిగా లోటులో ఉంది. ఈ నేపథ్యంలో ఆ లోటును పూడ్చుకునేందుకు ప్రభుత్వం వివిధ చర్యలు చేపట్టింది. అందులోభాగంగా ఎర్రచందన విక్రయిస్తుంది. అందుకోసం ఈ రోజు ఈ టెండర్ల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాగే దేవాలయాల భూమలను కూడా ప్రభుత్వం విక్రయించే అనుమానం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం దేవాలయాల భూములు అమ్మదని భావిస్తున్నట్లు భానుప్రకాశ్ రెడ్డి పై విధంగా వెల్లడించారు. -
చదరంగం పోటీలకు విశేష స్పందన
తిరుపతి స్పోర్ట్స్: చిత్తూరు జిల్లా చదరంగం సమాఖ్య తిరుపతిలో నిర్వహించిన చదరంగం పోటీలకు విశేష స్పందన లభించింది. శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆదివారం ఉదయం నిర్వహించిన ఈ పోటీలను రుయా బ్లడ్‌బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ ఆర్ఆర్.రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి ఐదుసార్లు ప్రపంచ కప్‌ను అందించింది ఒక్క చదరంగం మాత్రమే అని గుర్తుచేశారు. అయినా చదరంగానికి ఆశించిన స్థాయిలో ఖ్యాతి రాకపోవడం బాధాకరమన్నారు. అనంతరం సాయంత్రం నిర్వహించిన బహుమతుల ప్రదానోత్సవానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జి.భానుప్రకాష్‌రెడ్డి హాజరయ్యారు. విజేతలుగా నిలిచిన 25 మందికి నగదు బహుమతులు, 90 మందికి షీల్డ్, సర్టిఫికెట్లు అందించారు. బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ పొనగంటి భాస్కర్, జిల్లా చదరంగం అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. గందరగోళంగా పోటీలు తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆదివారం నిర్వహించిన చదరంగం పోటీలు గందరగోళంగా జరిగాయి. నిర్వాహకులు ఆశించిన స్థాయి కంటే అధికంగా క్రీడాకారులు హాజరయ్యారు. దాదాపు 600 మందికి పైగా రావడంతో అందరికీ పోటీలు నిర్వహించడం నిర్వాహకులకు తలనొప్పిగా మారింది. ఈ గందరగోళం నడుమ పోటీలు ఎవరికి వారే నిర్వహించుకోవడం, ఓడినా తామే గెలిచామని ప్రకటించుకోవడం కనిపించింది. దీంతో గెలిచినా ఓడినట్టు నిర్వాహకులు ప్రకటించడంతో ఏడుగురు క్రీడాకారులు కన్నీటి పర్యంతమవుతూ బయటకు వచ్చారు. విషయం పిల్లల తల్లిదండ్రులకు తెలియడంతో నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. ఒక్కో క్రీడాకారుని నుంచి రూ.200 చొప్పున డబ్బు వసూలు చేసి, తీరా నిబంధనలకు విరుద్దంగా పోటీలు నిర్వహిస్తున్నారంటూ మండిపడ్డారు. గెలిచిన క్రీడాకారులను సమయం లేదంటూ ఎందుకు పక్కన పెట్టారని నిలదీయడంతో తల్లిదండ్రులను నిర్వాహకులు బుజ్జగించడం కనిపించింది.