నేనలా అనలేదు
‘శ్రీరామసేన’ నిషేధం వార్తలపై సీఎం సిద్ధరామయ్య
మతవాద ముసుగులో అరాచకాలకు పాల్పడే వారిపై గూండాయాక్ట్
మతవాదులకు మద్దతిచ్చే వారే అలా మాట్లాడతారంటూ శోభాపై ఫైర్
సాక్షి, బెంగళూరు : శ్రీరామసేనపై నిషేధం విధించే ఆలోచనలో ఉన్నట్లు తానెక్కడా అనలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. మతవాద ముసుగులో బెదిరింపులు, అరాచకాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మాత్రమే చెప్పానని తెలిపారు. పేపర్ బాయ్స్‌గా ఉంటూ చదువులో ప్రతిభను కనబరుస్తున్న వారిని సత్కరించేందుకు గాను ప్రగతిపర పాత్రికేయుల సంఘం ఆధ్వర్యంలో శనివారమిక్కడి ప్రెస్‌క్లబ్ ఆవరణలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కార్యక్రమ అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘మతవాద ముసుగులో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. అలాంటి వ్యక్తులు, వ్యవస్థలపై గూండాయాక్ట్ను నమోదు చేయడానికి కూడా వెనుకాడం’ అని హెచ్చరించారు. ఇక ‘శ్రీరామసేనను నిషేధిస్తామంటున్న ముఖ్యమంత్రికి రాష్ట్రంలోని
నేనలా అనలేదు
ముస్లిం ధార్మిక సంస్థలను నిషేధించే ధైర్యం ఉందా’? అన్న ఎంపీ శోభాకరంద్లాజే వ్యాఖ్యలపై సిద్ధరామయ్య స్పందిస్తూ...‘మతవాదశక్తులకు మద్దతిచ్చే వారు మాత్రమే ఇలా మాట్లాడుతుంటారు’ అని విమర్శించారు. ఇక అంతకుముందు జరిగిన పేపర్‌బాయ్స్ సత్కార కార్యక్రమంలో సిద్ధరామయ్య మాట్లాడుతూ...పత్రికా రంగంలో పేపర్బాయ్స్ది అత్యంత ముఖ్యమైన పాత్ర అని పేర్కొన్నారు. పేపర్‌బాయ్‌గా పనిచేసిన అబ్దుల్‌కలామ్ అనంతరం ప్రముఖ శాస్త్రవేత్తగా ఎదగడంతో పాటు రాష్ట్రపతి కూడా అయ్యారని, మీరంతా ఆయన్ను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సత్కార గ్రహీతలకు సూచించారు.
మంత్రి వర్గంలోని అసమర్థులపై చర్చ....
ఇక మంత్రి వర్గ విస్తరణకు తాను కూడా సుముఖంగానే ఉన్నానని, అయితే మంత్రివర్గ పునర్నిర్మాణానికి మాత్రం అంగీకరించనని అన్నారు. మంత్రి వర్గంలోని అసమర్థులను ఆయా పదవుల నుంచి తప్పించాలనే ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో తాను కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌తో చర్చించనున్నానని, అయితే ఆ చర్చకు సంబంధించిన అంశాలను బహిరంగపరచలేనని తెలిపారు.
మంత్రి వర్గ విస్తరణలో ఒక ముఖ్యమంత్రిగా తనకు పూర్తిస్థాయి అధికారాలున్నాయని, ఈ విషయంలో ఎవరి జోక్యాన్ని తాను అంగీకరించనని పేర్కొన్నారు. మైసూరు దసరా విషయంలో మహారాణి ప్రమోదాదేవి ఎక్కడా తన అభ్యంతరాన్ని తెలియజేయలేదని, ఈ విషయంలో వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలు మాత్రమేనని అన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు వివాదం విషయంలో ‘మహాజన్ నివేదిక’ తమ అంతిమ నిర్ణయమని, ఈ విషయంలో ఎలాంటి చర్చలకు ఆస్కారం లేదని తెలిపారు.