ఇద్దరు యువతులను కిడ్నాప్ చేసే యత్నం
హైదరాబాద్ : హైదరాబాద్‌లో సాప్ట్వేర్ ఉద్యోగిని అత్యాచార ఘటనను మరవక ముందే .... రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో మంగళవారం ఇద్దరు యువతులను కిడ్నాప్ చేసేందుకు యత్నించిన సంఘటనలు కలకలం రేపాయి. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా చిలకలూరు పేటలో ఓ డిగ్రీ విద్యార్థిని ఆటో డ్రైవర్ కిడ్నాప్‌కు యత్నించిన ఘటన స్థానికంగా సంచలం సృష్టించింది. నాదెండ్ల మండలం గణపవరంకు చెందిన మోక్ష చిలకలూరిపేటలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రతిరోజు ఆమె ఆటోలో కళాశాలకు వెళుతోంది.
ఈనేపథ్యంలో మంగళవారం ఉదయం మోక్ష కళాశాలకు ఆటోలో వెళుతుండగా డ్రైవర్ కాలేజీ దగ్గర ఆపకుండా ముందుకు తీసుకువెళ్లాడు. దాంతో విద్యార్థిని గట్టిగా కేకలు వేసినా ఫలితం లేకపోవటంతో నడుస్తున్న ఆటోలో నుంచి కిందకు దూకేసింది. ఈ విషయం గమనించిన స్థానికులు ఆటోను వెంబడించినా ఫలితం లేకపోయింది. గాయపడిన విద్యార్థిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ఇక పశ్చిమగోదావరి జిల్లాలో ఓ యువతి కిడ్నాప్ యత్నం జరిగింది. చింతలపూడి మండలం సమ్మెటవారిగూడానికి చెందిన సురేష్, టి.నరసాపురం మండలం శ్రీరామవరానికి చెందిన ఓ యువతి ఒకే కాలేజీలో చదువుకున్నారు. ఆ సమయంలో ఇద్దరు ప్రేమించుకున్నారు. రెండేళ్ల వీరి ప్రేమ మనస్పర్థలతో ముగిసింది. అనంతరం ఆ యువతి మరో యువకుడిని పెళ్లి చేసుకుంది.
దీంతో కక్ష కట్టిన సురేష్... ఆ యువతిని కిడ్నాప్ చేయాలనుకున్నాడు. అందుకు... మరో ఐదుగురితో కలిసి కిడ్నాప్ చేసేందుకు పథకం వేశాడు. యువతిని ఇంటికి వెళ్లి దాహమంటూ... క్లోరోఫాంతో కిడ్నాప్ చేయాలని భావించారు. ఆతర్వాత యువతిని కిడ్నాప్ చేయటానికి యత్నించగా... స్థానికులు గమనించి... పట్టుకున్నారు. నలుగురు చిక్కగా... కిడ్నాప్‌కు మూలసూత్రధారి.. మరొకతను పారిపోయాడు. కిడ్నాపర్లను చెట్టుకు కట్టేసి చితకొట్టిన స్థానికులు ఆ తరువాత పోలీసులకు అప్పగించారు.