తిరగలేక.. బతకలేక...
ఆత్మహత్యలకు కలెక్టరేట్‌ను వేదికగా చేసుకుంటున్న బాధితులు
►కలెక్టరేట్‌కు వచ్చినా పరిష్కారం కాని సమస్యలు
►ప్రజా విజ్ఞప్తులపై స్పందన కరువు
►ప్రహసనంగా దరఖాస్తుల స్వీకరణ
►పరిష్కారంపై అధికారుల మొద్దునిద్ర
►మొక్కుబడి సమీక్షలతో ఫలితం శూన్యం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రజావాణి పేరిట ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ సామాన్యుల నుంచి నేరుగా స్వీకరించే వినతుల పరిష్కారం ప్రహసనంగా మారింది. సమస్యల పరిష్కారంపై అధికారుల్లో చిత్తశుద్ధి లేకపోవడం, శాస్త్రీయంగా సమీక్ష జరగక పోవడం సామాన్యులకు ప్రాణ సంకటంగా మారింది. గ్రామ, మండల స్థాయిలో అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేక సామాన్యులు చివరి ప్ర యత్నంగా ‘ప్రజావాణి’ని వేదికగా ఎంచుకుంటున్నారు. వ్యక్తిగత సమస్యలు మొదలుకుని వివిధ అంశాలపై ప్రతి సోమవారం వందలాది మంది కలెక్టరేట్‌కు తరలివస్తున్నారు.
కలెక్టర్ స్వయంగా ఫిర్యాదులు స్వీకరించి జిల్లా అధికారులకు అందజేస్తున్నారు. ప్రజావాణిలోఅందే ప్రతి పిర్యాదునూ క్షుణ్ణంగా పరి శీలించి పరిష్కరించాల్సిన అధికారులు చేతులు దులుపుకుం టున్నారు. తిరిగి మండల స్థాయి అధికారులకే దరఖాస్తులను పంపిస్తున్నారు. దీంతో వందల కిలోమీటర్లు ప్రయాణించి కలెక్టరేట్‌కు వచ్చి గంటల తరబడి లైన్లో నిలుచున్నా పరిష్కారం దొరకడం లేదు. కొన్నిమార్లు అధికారుల నుంచి తిరస్కారం కూడా ఎదురవుతుండడం దరఖాస్తుదారులను మరింత వేదనకు గురి చేస్తోంది. దీంతో కొందరు దరఖాస్తుదారులు ఏకం గా కలెక్టరేట్ సాక్షిగా ఆత్మహత్యలకు ప్రయత్నిస్తున్నారు.
అరకొరగా సమీక్షలు
ప్రజావాణి దరఖాస్తులపై అధికారులతో ప్రతి సోమవారం సాయంత్రం కలెక్టర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. అయితే సాంకేతిక కారణాలు సాకుగా చూపుతూ దర ఖాస్తులు పెండింగులో ఉంచడాన్ని అధికారులు సమర్థించుకుంటున్నారు. కలెక్టర్ గట్టిగా మందలించినా పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రజావాణికి స్వయంగా హాజరు కావాల్సిన అధికారులు దరఖాస్తుల స్వీకరణ, కలెక్టర్ సమీక్షకు కూడా కిందిస్థాయి సిబ్బందిని పంపుతున్నారు. కలెక్టరేట్ భవనంపైకి ఎక్కకుండా ఇటీవల ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.
దరఖాస్తుదారులు జిల్లా కేంద్రానికి వచ్చే అవసరం లేకుండా ఆన్లైన్లోనే విజ్ఞాపనలు స్వీకరిస్తామని కలెక్టర్ శ్రీదేవి ఇటీవల ప్రకటించారు. ఫిబ్రవరి రెండో తేదీ నుంచి ఆన్లైన్లో కూడా దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి. వీటి పరిష్కారం దిశగా శాస్త్రీయ కసరత్తు జరగక సామాన్యులు పాలన యంత్రాంగం తీరుపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 2011 నుంచి ఇప్పటి వరకు 250 ప్రభుత్వ విభాగాలు, శాఖలకు సంబంధించి 2548 ఫిర్యాదులు అందగా 696 దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఆత్మహత్యాయత్నాలిలా...
2014 నవంబరు 3వ తేదీన హజీ గయస్ పీరాసాహెబ్ అనే వృద్ధుడు ఇంటిస్థలం కేటాయింపు విషయంలో అధికారులు సహకరించడం లేదంటూ కలెక్టరేట్ భవనంపై నుంచి దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని జిల్లా ఆసుపత్రిలో చేర్చి కలెక్టర్ ప్రియదర్శిని స్వయంగా పరామర్శించారు. నాలుగు రోజుల తర్వాత పీరా సాహెబ్ మృతిచెందాడు.
మద్దూరు మండలానికి చెందిన దంపతులు భూ సమస్య పరిష్కారం కావడం లేదంటూ పురుగుల మందు డబ్బాతో వచ్చి కలెక్టర్ సమక్షంలోనే ఆత్మహత్యకు యత్నించారు.సోమవారం వనపర్తి మండలం శ్రీనివాసపురానికి చెందిన శ్రీరాములు, చింత లక్ష్మి దంపతులు ఇంటిస్థలం విషయంలో అధికారులు స్పందించడం లేదంటూ ఆత్మహత్యకు యత్నించారు.