వేచి చూద్దాం!
శ్రీశైలంలో తెలంగాణ విద్యుదుత్పత్తిపై కేంద్రం వైఖరి
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి, నీటి విడుదల విషయంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదం విషయంలో కేంద్ర ప్రభుత్వం వేచి చూసే ధోరణిని అవలంబిస్తోంది. ప్రాజెక్టుల్లో నీటి వినియోగ అంశాన్ని ఇప్పటికే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పర్యవేక్షిస్తున్నందున తాము జోక్యం చేసుకునే అవసరం లేదనే భావనను కేంద్ర జల వనరుల శాఖ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న జీవోల్లో పేర్కొన్న కనిష్ట నీటి మట్టాలను మించి వినియోగించిన పక్షంలో తమ జోక్యం ఉంటుందని పేర్కొంటున్నాయి. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి విషయమై ఇరు రాష్ట్రాల ఘర్షణపూరిత వైఖరి, వేర్వేరుగా వచ్చిన విజ్ఞప్తులను జల వనరుల శాఖ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. తమ శాఖ మంత్రి ఉమాభారతికి సమాచారం అందజేస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టున తెలంగాణ చేస్తున్న విద్యుత్ ఉత్పత్తితో రాయలసీమ తాగునీటి ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్.. తమ వాటా మేరకే వినియోగిస్తున్నామంటూ తెలంగాణ భిన్న వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కల్పించుకున్నా సమస్యకు పరిష్కారం లభించలేదు. తాగు, సాగు నీటి అంశాలకు తొలి ప్రాధాన్యం ఇస్తూ సత్వరమే శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని నిలిపివేయాలని కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా రెండుసార్లు లేఖ రాసినా తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు ఏపీ నుంచి రావాల్సిన న్యాయబద్ధమైన విద్యుత్ వాటా అందేంత వరకు విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తామంటున్న తెలంగాణ ప్రభుత్వం... జీవో 69 ప్రకారం తమకు శ్రీశైలంలో 834 అడుగుల వరకు నీటిని వాడుకునే అవకాశం ఉందని స్పష్టం చేస్తోంది. 854 అడుగుల మట్టం వరకే నీటిని వాడుకోవాలన్న జీవో 107ను పట్టించుకోబోమని పేర్కొంటోంది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఉత్పత్తిని కొనసాగిస్తోంది. అయితే... ఈ అంశంలో ఏపీ ప్రభుత్వ పెద్దలు ఇటీవల కేంద్ర జల వనరుల శాఖ అధికారులతో వరుసగా సమావేశమవుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రం జోక్యం చేసుకుంటేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని... తక్షణమే శ్రీశైలంలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిని ఆపేలా చూడాలని వారు కేంద్రాన్ని కోరుతున్నారు. కానీ దీనిపై జల వనరుల శాఖ నుంచి కార్యాచరణ పరమైన స్పందన రాలేదని సమాచారం. నిబంధనల పరంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని... కనిష్ట మట్టం 854 అడుగుల పరిమితిని విస్మరించి ఉత్పత్తి చేస్తేనే తాము జోక్యం చేసుకుంటామని స్పష్టం చేసినట్లు తెలిసింది.
ఎవరైనా కోరితేనే..
సమస్య పరిష్కారానికి తమంతట తాముగా జోక్యం చేసుకోలేమని కేంద్ర జల వనరుల శాఖ ఉన్నత స్థాయి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇరు రాష్ట్రాల్లో ఒకరి నుంచైనా ఇందుకు సంబంధించి వినతులు వస్తే మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని పేర్కొంటున్నాయి. జల వివాదాలపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహణ సాధాసాధ్యాలపై చట్టంలో ఉన్న నియమ నిబంధనలపై అధ్యయనం చేయాల్సి ఉందని వివరించాయి.
విద్యుత్ ఇవ్వకనే సమస్య..!
ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణానికి సంబంధించి... విద్యుత్ వాటాల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ వైఖరిని కేంద్ర జల వనరుల శాఖ అధికారవర్గాలు తప్పుపడుతున్నట్లుగా తెలుస్తోంది. చట్టప్రకారం ఏపీ ప్రాజెక్టుల నుంచి వాటా మేరకు రావాల్సిన విద్యుత్‌ను తెలంగాణకు ఇవ్వకపోవడం వల్లే అసలు సమస్య ఉత్పన్నమైందని అధికారవర్గాలు సంబంధిత శాఖ మంత్రికి విన్నవించినట్లుగా చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా.. శ్రీశైలంలో 834 అడుగుల కనిష్ట మట్టానికన్నా తక్కువగా 780 అడుగులదాకా కూడా విద్యుత్ ఉత్పత్తి చేసిన ఉదంతాన్ని ఆ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. గతంలో ఉల్లంఘనలకు పాల్పడిన వారే ఇప్పుడు మరో ప్రభుత్వ ధోరణిని ప్రశ్నించడంపై కేంద్ర జల వనరుల శాఖ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణకు రావాల్సిన విద్యుత్ వాటాను ఇచ్చేస్తే సమస్యకు పరిష్కారం సులభంగా కనుగొనవచ్చనే భావనను వ్యక్తీకరిస్తున్నట్టు తెలిసింది.
వివాదాన్ని మీరే పరిష్కరించుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీశైలం జల విద్యుదుత్పత్తి అంశంపై తలెత్తిన వివాదం ఇరు రాష్ట్రాలు, తెలుగు ప్రజలే పరిష్కరించుకోవాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ సలహా ఇచ్చారు. న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయం వద్ద ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యుదుత్పత్తి అంశం ఇరు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైందని మంత్రి దృష్టికి తీసుకురాగా.. ‘ఆ విషయంలో మాకేమీ సంబంధం లేదు. ఈ సమస్యను రెండు రాష్ట్రాలు పరిష్కరించుకోవాలి. విద్యుత్ విషయంలో ఏ రాష్ట్రానికైనా సమస్య ఉందంటే మా వంతు సాయం చేస్తాం. ఏపీ సీఎం చంద్రబాబు పలుమార్లు విద్యుత్ సమస్యలను మా దృష్టికి తెచ్చారు. వాటిని పరిష్కరించాం. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ సౌర విద్యుత్, ఎన్టీపీసీ ఏర్పాటుపై ప్రతిపాదనలు ఇచ్చారు. వాటినీ పరిష్కరిస్తున్నాం. కానీ శ్రీశైలం వివాదంలో మాకేమీ సంబంధం లేదు. ఇద్దరు సీఎంలూ కూర్చొని మాట్లాడుకోవాలి’ అని అన్నారు.