ఎస్సీ, ఎస్టీ వాడల్లో శ్రీవారి ఆలయాలు
– తిరుపతి రైల్వే స్టేషన్ విస్తరణకు 74 సెంట్ల స్థలం బదలాయింపు
– టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం
– రూ.33.49 కోట్ల కొనుగోళ్లకు ఆమోదం
సాక్షి,తిరుమల: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏజెన్సీ, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు రూ.8 లక్షలు కేటాయిస్తూ టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించింది. గతంలో ఉండే మ్యాచింగ్గ్రాంట్ పద్దతి రద్దు చేస్తూ, ఆలయాల నిర్మాణం కోసం అయ్యే ఖర్చు వందశాతాన్ని ధార్మిక సంస్థే భరించేలా మంగళవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశం తీర్మానం చేసినట్టు చైర్మన్ చదలవాడ కష్ణమూర్తి, ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు వెల్లడించారు. సమావేశంలో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలివి..
– తిరుపతి రైల్వే స్టేషన్ విస్తరణ, అభివద్ధి కోసం టీటీడీకి చెందిన 2.19 ఎకరాల స్థలాన్ని రైల్వే విభాగానికి గతంలో కేటాయించారు. అందులోనే 74 సెంట్ల స్థలాన్ని తక్షణమే మార్కెట్ ధర కింద రైల్వే విభాగానికి బదిలీ చేయాలని ధర్మకర్తల మండలి తీర్మానించింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యం కోసం ఏడాదిలోపే పనులు పూర్తి చేసే నిబంధనతో బోర్డు ఆమోదముద్ర వేసింది.
– ద్వారకా తిరుమలలో శ్రీవేంకటేశ్వర వికలాంగులు మరియు పునరావాస సంస్థకు మూలనిధిగా రూ.10 కోట్లు విడుదల చేస్తూ బోర్డు తీర్మానం.
– రూ.5.5 కోట్ల విలువైన వెండితో 5,10 గ్రాముల డాలర్లు తయారు చేసి విక్రయించేందుకు అమోదం
– చిత్తూరుజిల్లా రాయలచెరువు వద్ద రూ.32 లక్షలతో 46 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం
– 2017వ సంవత్సరంలో 18 లక్షల 12 షీట్ల కేలండర్ల ముద్రణకు ఆదమోదం
– టీటీడీ విద్యాసంస్థల్లో పీజీ, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు చదివే విద్యార్థులకు హాస్టళ్లలో భోజన సదుపాయం కల్పించేందుకు ఆమోదం. మెస్చార్జీలను ఫీజు రీ ఎంబర్స్మెంట్ నుండి వసూలుకు నిర్ణయం.
– టీటీడీలోని సెక్యూరిటీ, విజిలెన్స్ గార్డులుగా పునర్ నియామకం పొందిన సైనిక పింఛను దారుల భార్యలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవరించిన పింఛను ఉత్తర్వులను అమలు చేయాలని నిర్ణయం
– గుంటూరుజిల్లా తాడికొండ గ్రామంలోని శ్రీవేణుగోపాల స్వామి ఆలయానికి రూ.31.25 లక్షలు,
వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు మండలం చనంపల్లె గ్రామయంలోని చెన్నకేశవ ఆలయంలో నూతన మహారథాలు తయారికి బోర్డు అనుమతి
– విజయగనరం జిల్లా కొత్త వలస మండపం వీర భద్రాపురం గ్రామంలోని వీరేశ్వరి ఆలయంలో రూ.25 లక్షలతో మరమ్మతు.
రూ.33.49 కోట్లతో సరుకుల కొనుగోళ్ల
తిరుమల ఆలయం, టీటీడీ అవసర కోసం మొత్తం రూ.రూ.33.49 కోట్లతో సరుకుల కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇందులో రూ.20.32 కోట్లతో 24 లక్షల శెనగపప్పు కొనుగోలు, రూ.4.32 కోట్లతో 36వేల కిలోల యాలకులు, రూ. 1.34 కోట్లతో లక్ష కిలోల ఉద్దిపప్పు, రూ.4.48 కోట్లతో 3.50 కిలోల కందిపప్పు,1.56 కోట్లతో 22 లక్షల కొబ్బరికాయలు, రూ.78.18 లక్షలతో 9500 కిలోల మిరియాలు, రూ.69.49 లక్షలతో 45వేల కిలోల ఎండుమిరప కొనుగోలుకు నిర్ణయించారు.