చిత్తూరు టీడీపీలో వర్గపోరు
నేడు హైదరాబాద్‌కు కటారి వర్గీయులు
అసెంబ్లీ టికెట్టుపైనే గురి
సాక్షి, తిరుపతి : చిత్తూరు శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో విబేధాలు ముదురుతున్నాయి. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు ఇక్కడ నుంచి టికెట్టు ఆశిస్తున్నారు. ఆయనకు చెక్ పెట్టేందుకు అదే సామాజికవర్గానికి చెందిన మాజీ కౌన్సిలర్ కటారి మోహన్‌ను రంగంలోకి దించుతున్నారు. వచ్చే ఎన్నికల్లో చిత్తూరు టికెట్టు తనకే ఇవ్వాలన్న డిమాండ్‌తో మోహన్ తన వర్గీయులతో కలిసి మూడు బస్సుల్లో మంగళవారం రాత్రి రాజధానికి బయలుదేరనున్నారు.
మరుసటి రోజున అధినేత చంద్రబాబును కలసి విజ్ఞప్తి చేసేందుకు వారు సన్నద్ధమయ్యారు. మోహన్‌తో పాటు పలువురు మాజీ ఎంపీటీసీ సభ్యులు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు, సర్పం చ్‌లు, ద్వితీయ శ్రేణి నాయకులు కూడా వెళ్తున్నట్టు సమాచారం. చిత్తూరు నేతలు చంద్రబాబు దగ్గర బలప్రదర్శనకు దిగుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే జిల్లా కేంద్రంలో టీడీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. తాజా పరిణామాలు ఆ పార్టీ కార్యకర్తల్లో గందరగోళానికి దారితీస్తున్నాయి. కిందటి ఎన్నికల్లో టీడీపీని వదిలి ప్రజారాజ్యం పార్టీ టికెట్టుతో పోటీ చేసిన జంగాలపల్లి శ్రీనివాసులు తిరిగి పార్టీలోకి పునరాగమనంలోనే వ్యతిరేకత వ్యక్తమైంది.
అయితే సామాజిక సమీకరణల్లో జంగాలపల్లి అవసరం ఉందని అప్పట్లో చంద్రబాబు చిత్తూరు నేతలను ఒప్పించారు. అంతేకాకుండా జిల్లా అధ్యక్ష పదవినీ కట్టబెట్టారు. ఇది జీర్ణించుకోలేని మరో సామాజికవర్గం నేతలు అప్పటి నుంచి జేఎంసీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఒక దశలో ఇవి ముది రిపాకాన పడటం, పార్టీ పరిశీలకుల సమక్షంలోనే రచ్చ కావడంతో కొందరి పార్టీ పదవుల కు కూడా ముప్పు వచ్చింది. అయితే ముల్లు ను ముల్లుతోనే తీయాలన్న సామెతగా జంగాలపల్లి శ్రీనివాసులు సామాజికవర్గం నేతలతో నే ఇప్పుడు ఢీ కొట్టిస్తున్నారు.
చిత్తూరులో ఆ సామాజికవర్గానికి చెందిన ఓట్లు గణనీయం గా ఉన్నాయి. మాజీ కౌన్సిలర్ కటారి మోహన్‌కు చంద్రబాబు కుమారుడు లోకేష్ ఆశీస్సు లు కూడా ఉండడంతో చిత్తూరు టీడీపీ నాయకులు కొందరు ఆయనను ప్రోత్సహిస్తున్నా రు. మొత్తానికి తమ వాదంతో పాటు జేఎం సీకి ఉన్న వ్యతిరేకతను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేందుకు కటారి ప్రయత్నిస్తున్నారు. ఈ పంచాయితీకి ఎటువంటి ముగింపు వస్తుందనేది నేతల్లో ఉత్కంఠ కలిగిస్తోంది.