పేదలకు వరం
తెల్లకార్డ్డులకు స్విమ్స్‌లో ఉచిత వైద్యం
టీటీడీ పాలకమండలి తీర్మానం
తిరుపతి, న్యూస్‌లైన్: రాయలసీమకు వరప్రసాదంగా ఉన్న శ్రీవేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్)లో ఇక నుంచి తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందనున్నాయి. ఆరోగ్యశ్రీ కార్డుతో పనిలేకుండా తెల్లరేషన్ కార్డు ఉన్నవారందరికీ ఉచితంగా వైద్యం అందించేందుకు వీలుగా ఈ తీర్మానం చేశారు. ఇందుకు అవసరమైన ఖర్చును టీటీడీ భరిస్తుంది. శనివారం తిరుమలలో జరిగిన పాలకమండలి సమావేశంలో ఈమేరకు తీర్మానించారు. ప్రస్తుతం స్విమ్స్‌లో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారికి ఆ పథకం పరిధిలో ఉన్న జబ్బులకు ఉచితంగా చికిత్స అందిస్తున్నారు.
తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి చికిత్సలకు ఆయిన ఖర్చులో రోగి ఆర్థిక స్తోమత బట్టి 30 నుంచి 50 శాతం వరకు రాయితీ ఇస్తున్నారు. ఇదిగాక టీటీడీ ప్రాణదానం పథకం కింద శస్త్ర చికిత్సలకు ఎంపికైన రోగులకు(తెల్లరేషన్ కార్డు ఉంటే)ఉచితంగా చికిత్సలు చేస్తున్నారు. గుండె, మెదడు, వెన్నెముక, కి డ్నీ, లివర్, క్యాన్సర్ జబ్బులకు మెరుగైన వైద్య సేవలు అందుతుండడంతో స్విమ్స్‌కు రాయలసీమ జిల్లాల నుంచే కాక పొరుగు జిల్లాలనుంచి వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
1993లో వైద ్య సేవలను ప్రారంభించిన స్విమ్స్‌లో 2,500 నుంచి 3 వేల మంది ఇన్ పేషెంట్లకు వైద్యసేవలు ఆందించే స్థాయి నుంచి ప్రస్తుతం ఏడాదికి 25 వేల మంది ఇన్-పేషెంట్లకు చికిత్సలు అందించే స్థాయికి ఎదిగింది. ఆరోగ్యశ్రీ పథకం స్విమ్స్‌కు మంచి పేరు తె చ్చిపెట్టింది. ప్రస్తుతం స్విమ్స్‌కు ఆరోగ్యశ్రీ ట్రస్ట్నుంచి, టీటీడీ,కేంద్ర ప్రభుత్వాల నుంచి నిధులు అందుతున్నాయి.
సౌకర్యాల తోనే ఇబ్బంది
నిధుల మాట ఎలా ఉన్నా స్విమ్స్‌లో సౌకర్యాలు మాత్రం పెరిగిన రోగుల సంఖ్యకు అనుగుణంగా లేవు. క్యాజువాలిటీ, మెడికల్ అంకాలజీ, సర్జికల్ అంకాలజీ, రేడియేషన్ అంకాలజీ తదితర విభాగాల్లో చాలినన్ని పడకలు లేవు. పడకలు ఖాళీ అయితేనే కొత్త రోగులను చేర్చుకునే పరిస్థితి ఉంది. అధునాతన వైద్య పరికరాలున్నా డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది కొరత ఆస్పత్రిని పట్టిపీడిస్తోంది. డాక ్టర్లు లేక మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలటీ, ప్లాస్టిక్ సర్జరీ విభాగాలు మూత పడ్డాయి. నెఫ్రాలజీ విభాగంలో డయాలసిస్ యంత్రాలు చాలడంలేదు.
రోగులను వెయిటింగ్ లిస్ట్‌లో ఉంచి ఖాళీ ఉన్నపుడు ఫోన్ చేసి పిలిపించి డయాలసిస్ చేస్తున్నారు. మెడికల్ రికార్డ్స్ తదితర విభాగాల్లో సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండడంతో విపరీతమైన పనిభారంతో సతమతమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెల్లరేషన్ కార్డులున్న వారికి ఉచిత వైద్యసేవలు అందించాలన్న నిర్ణయం కారణంగా సమస్యలు తలెత్తనున్నాయి .పక్కనే ఉన్న రుయాను కాదని తెల్ల రేషన్ కార్డులున్న రోగులంద రూ స్విమ్స్‌ను ఆశ్రయించే అవకాశం ఉంది. ఫలితంగా స్విమ్స్‌పై మోయలేని భారం పడనుంది. పడకలు, డాక్టర్లు, సిబ్బంది సంఖ్యను పెంచితే తప్ప లక్ష్యం నెరవేరే పరిస్థితి లేదు.