తమిళమే ప్రతీక
సాక్షి, చెన్నై:ప్రపంచంలోని పలు భాషలకు, నాటక, నాట్య, సంగీతంతోపాటు వీరత్వానికి తమిళం ప్రతీకగా నిలుస్తున్నదని ఎండీఎంకే నేత వైగో అన్నారు. వీర చరిత్రకు శివగంగై వేలు నాచ్చియార్ దృశ్య కావ్యం దర్పణంగా అభివర్ణించారు. తమిళ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం ఎస్ఆర్ఎం వర్సిటీ ఆవరణలో సోమవారం ఘనంగా జరిగింది. వివిధ భాషల్లో నిష్ణాతులు, మేధావులు, వివిధ రంగాల్లోని వారికి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా సాహితీ పురస్కారాల్ని ప్రకటిస్తుంది. ఈ పురష్కారాలకు దీటుగా తమిళ భాషాభ్యున్నతికి కృషి చేసిన వాళ్లను ప్రతి ఏటా సత్కరించుకునే రీతిలో ఎస్ఆర్ఎం వర్సిటీ తమిళ అవార్డులను ప్రదానం చేస్తోంది. ఇందు కోసం ఆ వర్సిటీ నేతృత్వంలో తమిళ అకాడమి ఆవిర్భవించింది.
సోమవారం ఈ అవార్డుల ప్రదానోత్సవ వేడుక ఎస్ఆర్ఎం వర్సిటీ టీపీ గణేషన్ ఆడిటోరియంలో కోలాహలంగా జరిగింది. ముందుగా బ్రిటీషు వారిని తరిమి కొట్టడంలో తన వీరత్వాన్ని చాటిన శివగంగై వేలు నాచ్చియార్ జీవిత కావ్యాన్ని నాట్య నాటకం రూపంలో వీ శ్రీరామ్ శర్మ బృందం ప్రదర్శించింది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా, మాతృ భూమి రక్షణ ధ్యేయంగా సాగిన ఈ నాటిక ఆహుతుల్ని అలరించింది. అనంతరం జరిగిన వేడుకలో అవార్డులను ప్రకటించారు. అవార్డులు : ఎండీఎంకే నేత వైగో, ఎస్ఆర్ఎం చాన్సలర్ పారివేందన్ చేతుల మీదుగా అవార్డుల ప్రదానోత్సవం చేశారు.
నాటకం, డాక్యుమెంటరీ, నవల రంగానికి గానూ పుదుమై పిత్తన్ అవార్డును పూమణికి అందజేశారు. అనువాద రంగానికి గాను జీవీ పోప్ మోళిపెయర్పు అవార్డును ఁచిన్నచిన్నరూ. కావ్యం రచయిత వీ శ్రీరాంను ఎంపిక చేశారు. విజ్ఞాన శాస్త్రాని(తమిళం)కి గాను పేనా అప్పుస్వామి అవార్డును మధుమేహం-క్యాన్సర్ వరకు ఁఆహారపుటలవాట్లురూ. రచయిత డాక్టర్ ఎస్ నరేంద్రన్‌కు ప్రదానం చేశారు. చేతి వృత్తి రంగంలో అనంత కుమార స్వామి అవార్డును ఇందిరన్కు, తమిళ సంప్రదాయ సంగీతానికి గాను ముత్తాండవర్ తమిళిసై అవార్డును పీ చోళనాథన్, వలర్ తమిళ్ అవార్డును యువ తమిళ పరిశోధకుడు పి ఇలమారన్కు బహుకరించారు. వీరందరికీ తలా రూ. 1.5 లక్షల నగదుకుగాను చెక్కును, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందజేశారు.
ఇక, పరిది మార్ కలైంజర్ అవార్డు, రూ.2 లక్షల చెక్కు, ప్రశంసా పత్రం, జ్ఞాపికను పీ సుబ్రమణియన్‌కు, పారివేందన్ ప్రాచీన తమిళ జీవిత సాఫల్య పురస్కారాన్ని జార్జ్ హట్స్‌కు ప్రదానం చేశారు. రూ.5 లక్షలకు గాను చెక్కు, ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందజేశారు. సీనియర్ సంపాదకులు షణ్ముగనాథన్ రచించిన తమిళనాట సంగకాలం నుంచి సెమ్మోళి కాలం వరకు పుస్తకాన్ని ఆవిష్కరించారు. తమిళ అకాడమి -2014 సావనీర్‌ను విడుదల చేశారు. భారతీయార్ కవితా అవార్డు, తమిళ బాల మేధావులకు అల్లవళ్లియప్ప కులందై సాహితీ అవార్డుకు ఎంట్రీలు రాని దృష్ట్యా, వాటిని పక్కన పెట్టారు. మూలం తమిళం: ముందుగా ఎండీఎంకే నేత వైగో తన ప్రసంగంలో తమిళ వైభవాన్ని వివరించారు. తమిళుల వీరత్వాన్ని చాటే రీతిలో అక్కడ ప్రదర్శించిన శివగంగై నాచ్చియార్ నాట్య నాటకం గురించి విశదీకరిస్తూ, ప్రపంచంలో సర్వం తమిళంతో ముడిపడి ఉన్నదని పేర్కొన్నారు.
పలు భాషలు, నాటక, సంగీతం గ్రంథాల ఆవిర్భావానికి తమిళం మూలంగా నిలిచిందని వివరించారు. తెల్ల దొరల్ని తరిమి కొట్టే యత్నంలో నాటి వీరపాండి కట్టబొమ్మన్, నాచ్చియార్ తదితరుల నుంచి నేటివేలుపిళ్లై ప్రభాకరన్ వరకు ప్రదర్శించిన ధైర్య సాహసాలు మరువలేమన్నారు. అన్ని రంగాల్లోని రాణించాలని, దేశానికే ఆదర్శంగా తమిళ విద్యార్థులు నిలవాలని సూచించారు. ఎస్ఆర్ఎం చాన్సలర్ పారివేందన్ మాట్లాడుతూ, తమ అవార్డుల ప్రకటన, ప్రాధాన్యత గురించి వివరించారు. ప్రతి ఏటా ఈ అవార్డులకు గాను రూ.20 లక్షలు వెచ్చిస్తున్నామని పేర్కొన్నారు. ఆ వర్సిటీ వీసీ పొన్న వైకో మాట్లాడుతూ, ప్రపంచ భాషలకు తమిళం తల్లిలాంటిదని వివరించారు. ఈ వేడుకలో వివిధ రంగాల్లోని తమిళ మేధావులు, ప్రొఫెసర్లు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.