మీరేం ఇంజనీర్లయ్యా..?
నీటి నిల్వలపై డిప్యూటీ సీఎం కడియం ప్రశ్నల వర్షం
సమాధానం చెప్పకపోవడంతో అధికారులపై అసహనం
అవగాహన పెంచుకోవాలని సూచనలు
పంటలు ఎండిపోకుండా నీరందించాలని ఆదేశాలు
వరంగల్ :
జిల్లాలో సాగునీటి శాఖలో పనిచేస్తున్న ఇంజనీర్లు తమ విభాగంలోని వివరాలను చెప్పకపోవడంతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అసహనానికి గురయ్యారు. దేవాదుల ఎత్తిపోతల పథకం, ఎస్సారెస్పీ శాఖల ఇంజనీరింగ్, వ్యవసాయశాఖ అధికారులతో కలిసి జిల్లాలోని ప్రాజెక్టుల రిజర్వాయర్లలో నీటి నిల్వల పరిస్థితిపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక చెరువు కింద పూర్తి ఆయకట్టుకు నీరందించాలంటే ఆ చెరువును ఎన్నిసార్లు నింపాల్సి ఉంటుంది.. ఒకసారి నిం పితే ఎన్ని ఎకరాలకు నీరందించవచ్చని ఒక ఇం జనీరింగ్ అధికారిని ఆయన ప్రశ్నించారు. దీం తో అధికారి నుంచి సమాధానం రాకపోవడం తో డిప్యూటీ సీఎం అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంజినీర్లు తమ పరిధిలోని చెరువుల ఆయకట్టుకు నీరందించే వివరాలు, లభ్యత గురించి పూర్తిగా అవగాహన చేసుకోవాలని సూచించారు. జిల్లాలో దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా చెరువుల్లో నీటిని నింపి వాటి పరిధిలో ఆయకట్టుకు నీరు విడుదల చేసి పంటలను కాపాడాలని ఆయన పేర్కొన్నారు.
సమన్వయంతో పనిచేయాలి..
మొక్కజొన్న, పత్తి పంటల పరిస్థితిపై వ్యవసాయ అధికారులతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మండలాల వారీగా సమీక్షించారు. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, ప్రస్తుత ఆగస్టులో ఇప్పటివరకు వర్షాలు పడలేదని, మొక్కజొన్న 61 వేల హెక్టార్లలో సాగు చేస్తుండగా.. 22వేల హెక్టార్లలో ఎండిపోయే పరిస్థితులు ఏర్పడినట్లు వ్యవసాయాధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దేవాదు ల ఎత్తిపోతల పథకం, ఎస్సారెస్పీ ఎల్ఎండీ కాల్వల ద్వారా నీటి లభ్యతకు అనుగుణంగా తాగునీటికి సరిపడే నిల్వలు పోనూ మిగిలిన నీటిని ఆయకట్టుకు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులను సెప్టెంబర్‌లో గా నింపేందుకు రెవెన్యూ, వ్యవసాయ, పోలీస్, సాగునీటి పారుదల శాఖల అధికారులు సమన్వయంతో ప్రణాళికలను రూపొందించుకుని పనిచేయాలన్నారు. దేవాదుల పంపింగ్‌తో ధర్మసాగర్ చెరువు కింద దక్షిణ, ఉత్తర కాల్వల ద్వారా బుధవారం(నేటి) నుంచి మొదటి విడత ఆయకట్టు రైతులకు నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. ఉత్తర కాల్వ ద్వారా 5 క్యూమెక్సులు, దక్షిణ కాల్వ ద్వారా 6 క్యూమెక్సుల నీటిని మొదటి పది రోజులపాటు వార బందీ పద్ధతితో విడుదల చేయాలని సూచించారు. వారం రోజుల తర్వాత సరిపోయే నీటి మట్టం వచ్చిన తర్వాత ఆర్ఎస్.ఘనపురం కుడి కాలు వ ద్వారా పదిరోజుల పాటు వారబందీ పద్ధతి లో అందించాలన్నారు. సెప్టెం బర్ నాటికి వీటి పరిధిలోని అన్ని చెరువులకు నీటిని విడుదల చేయాలన్నారు. నీటి విడుదల సమయంలో కాల్వలకు గండ్లు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో కలెక్టర్ కరుణ, జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్, సీఈ విజయ్‌ప్రకాశ్, దేవాదుల సీఈ వెంకటేశ్వర్లు, ఎస్సారెస్పీ సీఈ శంకర్, ఎస్ఈ వీరయ్య, మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాసరెడ్డి, జేడీఏ ఉషా, అధికారులు పాల్గొన్నారు.