SSA employees
-
నిధులున్నా...కరుణ లేదు!
- ఎస్ఎస్ఏ ఉద్యోగుల జీతాలకు నెలకిందటే విడుదలైన బడ్జెట్ - నాన్నెళ్లుగా వేతనాలందక అల్లాడుతున్న ఉద్యోగులు - కుటుంబపోషణ భారమై అవస్థలు - కలెక్టర్ ఆమోదం కోసం ఎదురుచూపు అనంతపురం ఎడ్యుకేషన్: ఎస్ఎస్ఏ (సర్వశిక్ష అభియాన్) కాంట్రాక్టు ఉద్యోగులకు నెల కిందట వేతనాల కోసం నిధులు విడుదలైనా అధికారులు కరుణ చూపలేదు. బడ్జెట్ రాలేదని జీతాలు పెండింగ్ పెడితే.. నిధులు పుష్కలంగా ఉన్న జీతాలు చెల్లించలేదు. కలెక్టర్ ఆమోదం కోసం నెల కిందట ఫైలు వెళ్లినా నేటికీ పరిష్కారం చూపలేదు. నాలుగు నెలలుగా జీతాలు అందక.. కుటుంబం గడవక ఉద్యోగులు అల్లాడుతున్నారు. అంతంతమాత్రమే వేతనాలు.. అదికూడా సక్రమంగా అందక అవస్థలు పడుతున్నారు. జిల్లా ఎస్ఎస్ఏ పరిధిలో 63 మంది ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, 63 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, 357 మంది సీఆర్పీలు, 63 మంది మెసెంజర్లు, 378 మంది పార్ట్‌టైం ఇన్స్ట్రక్టర్లు, 126 మంది ఐఈఆర్టీలు, 12 మంది డీఎల్ఎంటీలు, 756 మంది కేజీబీవీల్లో సిబ్బంది పని చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు ఇస్తున్నది కూడా అరకొర వేతనాలు. ఒక్కొక్కరికి నెలకు రూ.8 వేల నుంచి రూ.14వేలోపే అందుతోంది. నాన్నెళ్లుగా జీతాల్లేవ్ : కేజీబీవీల్లో పని చేస్తున్న ఎస్ఓలు, సీఆర్టీలు, నాన్‌టీచింగ్ సిబ్బందికి ఫిబ్రవరి నుంచి, ఎమ్మార్సీ ఉద్యోగులకు మార్చి నుంచి వేతనాలు పెండింగ్ ఉండేవి. గతనెలలో బడ్జెట్ రావడంతో అందరి ఉద్యోగులకు మార్చి వరకు జీతాలు చెల్లించారు. ఆ తర్వాత కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో జీతాలు చెల్లించేందుకు కలెక్టర్ ఆమోదం కోసం ఫైలు పంపారు. మరోవైపు నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఉద్యోగులు ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు. కుటుంబ గడవక ఉద్యోగుల అవస్థలు : గతంలో క్రమం తప్పకుండా ప్రతినెలా జీతాలు మంజూరు చేసేవారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలల తరబడి జీతాలు పెండింగ్ పెడుతున్నారు. వస్తున్న జీతాలు అంతంతమాత్రమేనని, అవికూడా సక్రమంగా ఇవ్వకపోతే ఎలా? అని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో నిత్యం తిరగాల్సి ఉంటుందని, నెలంతా పని చేసి జీతాల కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. అప్పులు కూడా పుట్టడం లేదని వాపోతున్నారు. ఇదిలాఉండగా జీతాల చెల్లించేందుకు ఎస్ఎస్ఏలో బడ్జెట్ పుష్కలంగా ఉంది. గతనెలలో రూ. 6.06 కోట్లు బడ్జెట్ వచ్చింది. ఆ తర్వాత రూ.24 కోట్లు విడుదల చేశారు. మొత్తం రూ.30 కోట్లకు పైగా బడ్జెట్ ఉంది. కలెక్టర్ నుంచి ఆమోదం రాగానే చెల్లిస్తాం కాంట్రాక్ట్ ఉద్యోగులకు నాన్నెళ్లుగా జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నది వాస్తవమే. బడ్జెట్ పుష్కలంగా ఉంది. నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో జీతాల చెల్లింపునకు కలెక్టర్ ఆమోదానికి పంపాం. అక్కడ కాస్త ఆలస్యమైంది. ఆమోద ముద్ర వేయగానే జూలై వరకు బకాయి జీతాలన్నీ ఒకేమారు చెల్లిస్తాం. – సుబ్రమణ్యం, పీఓ ఎస్ఎస్ఏ -
కలెక్టర్ కరుణించారు.. దీపావళికి జీతాలిచ్చారు
చిత్తూరు ఎడ్యుకేషన్: ఈనెల 26న సాక్షి దినపత్రికలో’’దీపావళికైనా జీతాలొచ్చేనా’’ కథనానికి కలెక్టర్ సిద్ధార్ధ్ జైన్ స్పందించారు. ఆయన కరుణించి సర్వశిక్షా అభియాన్, వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న జీతభత్యాలను ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు విడుదల చేసినట్లు శుక్రవారం ప్రకటించారు. జిల్లాలోని ఐసీడీఎస్‌లో డిప్యూటేషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు, డీఆర్డీఏలోని ఔట్‌సోర్సింగ్‌లకు, సర్వశిక్షా అభియాన్ లోని డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు, జిల్లావైద్య, ఆర్యోగశాఖ, బీసీ కార్పొరేషన్ లో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ పెండింగ్ బకాయిలను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే పలు శాఖల్లో ఆఫీసు ఖర్చుల నిమిత్తం బడ్జెట్ విడుదల చేసినట్లు తెలియజేశారు. సర్వశిక్షా అభియాన్ లో విడుదలైన జీతాల వివరాలు ఇలా .. జిల్లాలోని సర్వశిక్షాఅభియాన్ ఆధ్వర్యంలో మండలాల్లో పనిచేస్తున్న డేటాఎంట్రీ ఆపరేటర్లకు రూ.5.90 లక్షలు, ఎంఐఎస్ కో– ఆర్డినేటర్లకు రూ.5.78 లక్షలు, మెసెంజర్లకు రూ.4.95 లక్షలు, ఐఈఆర్టీలకు రూ.30.89 లక్షలు, సీఆర్పీలకు రూ.24.35 లక్షలు, పార్టుటైం ఇన్ స్ట్రక్టర్లకు –12.46 లక్షలు, డీఎల్‌ఎంటీలకు –4.09 లక్షలు, కేజీబీవీ ఉద్యోగులకు 1.60 కోట్ల ను విడుదల చేసినట్లు సర్వశిక్షాఅభియాన్ అధికారులు తెలిపారు. విడుదలైన మొత్తాన్ని ఉద్యోగుల ఖాతాలలో జమచేసేందుకు ఎస్ఎస్ఏ ఉద్యోగులు కసరత్తు చేపట్టారు. -
దీపావళికైనా జీతాలొచ్చేనా?
మూడు నెలలుగా వేతనాల్లేని ఎస్ఎస్ఏ ఉద్యోగులు కస్తూర్బా పాఠశాలల్లో భర్తీ కాని ఖాళీలు కలెక్టర్ కరుణ కోసం ఎదురుచూపులు చిత్తూరు ఎడ్యుకేషన్: జిల్లా సర్వశిక్ష అభియాన్ శాఖ ఆధ్వర్యంలో మండలాల్లో పనిచేస్తున్న కేజీబీవీ సిబ్బందికి, ఎంఐఎస్ కో–ఆర్డినేటర్లకు, ఎస్ఎస్ఏ సిబ్బందికి మూడునెలలుగా జీతాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. చిన్న ఉద్యోగాల్లో స్థిరపడి, జీవనం కొనసాగిస్తున్న తమకు మూడునెలలుగా జీతాలు రాకపోతే కుటుంబాన్ని ఎలా ప్రశ్నించుకోవాలో తెలియడం లేదని ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. సర్వశిక్షా అభియాన్ అధికారులకు ఫోన్లు చేస్తే ‘ మీ జీతాల నివేదికలు కలెక్టర్‌కు పంపాం. సార్ ఇంకా చూడలేదు’ అని సమాధానం చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ఆ సిబ్బంది తమ గోడును ఎవరికీ చెప్పుకావాలో అర్థం కాక మిన్నకుంటున్నారు. గట్టిగా నిలదీస్తే ఎక్కడ తమ ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఊడగొడతారోనని భయపడి నోరుమెదపడం లేదు. ప్రభుత్వం ఇటీవల అన్ని కార్యాలయాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు, సిబ్బందికి ప్రతినెలా ఒకటవ తేదీన జీతాలివ్వాలని ప్రత్యేక జీవోను విడుదల చేసింది. అయితే ఆ జీవో కలెక్టర్ వద్ద అమలవుతుందో... లేదోనన్న సందేహాలు సిబ్బందిలో వ్యక్తమవుతున్నాయి. ఈ దీపావళికి అయినా జీతాల బిల్లులను ఆమోదిస్తే సంతోషంగా ఉంటుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. నియమకాల్లో జాప్యం.. ఫలితాలెలా సాధ్యం? జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సామర్థ్య పరిజ్ఞానం అంతంతమాత్రంగానే ఉన్నట్లు రాష్ట్ర విద్యాశాఖ సర్వేలో తేలింది. జిల్లాలోని కస్తూర్బా పాఠశాలల్లో ఐదునెలల నుంచి పలు పోస్టులు భర్తీకాక ఖాళీగా ఉన్నాయి. ఇటీవలే ఈ పోస్టులకు ఎంపిక పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఖరారు చేశారు. అయితే అభ్యర్థుల వివరాలను కలెక్టర్‌కు నివేదించి దాదాపు నెలకావోస్తోంది. ఇప్పటివరకూ ఆ ఫైల్ ఆమోదం పొందకపోవడంతో నియామకాల్లో జాప్యం ఏర్పడుతోంది. కస్తూర్బా పాఠశాలల్లో టీచర్లు, స్పెషల్ ఆఫీసర్లు లేకపోవడం వల్ల వాటి నిర్వహణ అస్తవ్యస్తంగా తయారయింది. పలుచోట్ల ఇన్చార్జ్ ఎస్వోలు పనిచేస్తుండడంతో వారికి అదనపు భారం తప్పడం లేదు. దీంతో ఆ పాఠశాలలో చదివే బాలికల పర్యవేక్షణ కుంటుపడుతోంది. పదోతరగతి విద్యార్థులకు ఈ ఏడాది సీసీఈ (నిరంతర మూల్యాంకన పద్ధతి) లో పరీక్షలను జరపనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. అయితే ఆ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థినుల సామర్థ్య పరిజ్ఞానం సన్నగిల్లే అవకాశాలున్నాయి. టీచర్లు లేని కస్తూర్బా పాఠశాలలకు తమ పిల్లలను పంపమని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదోతరగతి తుది పరీక్షలకు ఇక నాలుగు నెలల సమయం మాత్రమే ఉండడంతో అధికారులు స్పందించి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తే విద్యార్థులకు న్యాయం చేసినట్లు అవుతుంది. పాలన ఇలా అస్తవ్యస్తంగా ఉంటే విద్యార్థుల సామర్థ్య ఫలితాలు ఎలా అభివృద్ధి చెందుతాయని పలువురు విద్యానిపుణులు ప్రశ్నిస్తున్నారు. నివేదికలు పంపాం సర్వశిక్ష అభియాన్ శాఖ ఉద్యోగుల జీతాలు, కస్తూర్బా పాఠశాల్లో ఖాళీల భర్తీకి సంబంధించిన నివేదికలను జిల్లా కలెక్టర్‌కు ఈ–ఆఫీస్ ద్వారా పంపాం. రెండు మూడు రోజుల్లో ఆమోదం పొందే అవకాశముంది. – లక్ష్మీ, సర్వశిక్షాఅభియాన్ పీవో