కలెక్టర్ కరుణించారు.. దీపావళికి జీతాలిచ్చారు
చిత్తూరు ఎడ్యుకేషన్: ఈనెల 26న సాక్షి దినపత్రికలో’’దీపావళికైనా జీతాలొచ్చేనా’’ కథనానికి కలెక్టర్ సిద్ధార్ధ్ జైన్ స్పందించారు. ఆయన కరుణించి సర్వశిక్షా అభియాన్, వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న జీతభత్యాలను ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు విడుదల చేసినట్లు శుక్రవారం ప్రకటించారు. జిల్లాలోని ఐసీడీఎస్‌లో డిప్యూటేషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు, డీఆర్‌డీఏలోని ఔట్‌సోర్సింగ్‌లకు, సర్వశిక్షా అభియాన్ లోని డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు, జిల్లావైద్య, ఆర్యోగశాఖ, బీసీ కార్పొరేషన్ లో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ పెండింగ్ బకాయిలను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే పలు శాఖల్లో ఆఫీసు ఖర్చుల నిమిత్తం బడ్జెట్ విడుదల చేసినట్లు తెలియజేశారు.
సర్వశిక్షా అభియాన్ లో విడుదలైన జీతాల వివరాలు ఇలా ..
జిల్లాలోని సర్వశిక్షాఅభియాన్ ఆధ్వర్యంలో మండలాల్లో పనిచేస్తున్న డేటాఎంట్రీ ఆపరేటర్లకు రూ.5.90 లక్షలు, ఎంఐఎస్ కో– ఆర్డినేటర్లకు రూ.5.78 లక్షలు, మెసెంజర్లకు రూ.4.95 లక్షలు, ఐఈఆర్‌టీలకు రూ.30.89 లక్షలు, సీఆర్‌పీలకు రూ.24.35 లక్షలు, పార్టుటైం ఇన్ స్ట్రక్టర్లకు –12.46 లక్షలు, డీఎల్‌ఎంటీలకు –4.09 లక్షలు, కేజీబీవీ ఉద్యోగులకు 1.60 కోట్ల ను విడుదల చేసినట్లు సర్వశిక్షాఅభియాన్ అధికారులు తెలిపారు. విడుదలైన మొత్తాన్ని ఉద్యోగుల ఖాతాలలో జమచేసేందుకు ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు కసరత్తు చేపట్టారు.