దీపావళికైనా జీతాలొచ్చేనా?
మూడు నెలలుగా వేతనాల్లేని ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు
కస్తూర్బా పాఠశాలల్లో భర్తీ కాని ఖాళీలు
కలెక్టర్ కరుణ కోసం ఎదురుచూపులు
చిత్తూరు ఎడ్యుకేషన్: జిల్లా సర్వశిక్ష అభియాన్ శాఖ ఆధ్వర్యంలో మండలాల్లో పనిచేస్తున్న కేజీబీవీ సిబ్బందికి, ఎంఐఎస్ కో–ఆర్డినేటర్లకు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బందికి మూడునెలలుగా జీతాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. చిన్న ఉద్యోగాల్లో స్థిరపడి, జీవనం కొనసాగిస్తున్న తమకు మూడునెలలుగా జీతాలు రాకపోతే కుటుంబాన్ని ఎలా ప్రశ్నించుకోవాలో తెలియడం లేదని ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. సర్వశిక్షా అభియాన్ అధికారులకు ఫోన్లు చేస్తే ‘ మీ జీతాల నివేదికలు కలెక్టర్‌కు పంపాం. సార్ ఇంకా చూడలేదు’ అని సమాధానం చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ఆ సిబ్బంది తమ గోడును ఎవరికీ చెప్పుకావాలో అర్థం కాక మిన్నకుంటున్నారు. గట్టిగా నిలదీస్తే ఎక్కడ తమ ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఊడగొడతారోనని భయపడి నోరుమెదపడం లేదు. ప్రభుత్వం ఇటీవల అన్ని కార్యాలయాల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు, సిబ్బందికి ప్రతినెలా ఒకటవ తేదీన జీతాలివ్వాలని ప్రత్యేక జీవోను విడుదల చేసింది. అయితే ఆ జీవో కలెక్టర్ వద్ద అమలవుతుందో... లేదోనన్న సందేహాలు సిబ్బందిలో వ్యక్తమవుతున్నాయి. ఈ దీపావళికి అయినా జీతాల బిల్లులను ఆమోదిస్తే సంతోషంగా ఉంటుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
నియమకాల్లో జాప్యం.. ఫలితాలెలా సాధ్యం?
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సామర్థ్య పరిజ్ఞానం అంతంతమాత్రంగానే ఉన్నట్లు రాష్ట్ర విద్యాశాఖ సర్వేలో తేలింది. జిల్లాలోని కస్తూర్బా పాఠశాలల్లో ఐదునెలల నుంచి పలు పోస్టులు భర్తీకాక ఖాళీగా ఉన్నాయి. ఇటీవలే ఈ పోస్టులకు ఎంపిక పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఖరారు చేశారు. అయితే అభ్యర్థుల వివరాలను కలెక్టర్‌కు నివేదించి దాదాపు నెలకావోస్తోంది. ఇప్పటివరకూ ఆ ఫైల్ ఆమోదం పొందకపోవడంతో నియామకాల్లో జాప్యం ఏర్పడుతోంది. కస్తూర్బా పాఠశాలల్లో టీచర్లు, స్పెషల్ ఆఫీసర్లు లేకపోవడం వల్ల వాటి నిర్వహణ అస్తవ్యస్తంగా తయారయింది. పలుచోట్ల ఇన్‌చార్జ్ ఎస్‌వోలు పనిచేస్తుండడంతో వారికి అదనపు భారం తప్పడం లేదు. దీంతో ఆ పాఠశాలలో చదివే బాలికల పర్యవేక్షణ కుంటుపడుతోంది. పదోతరగతి విద్యార్థులకు ఈ ఏడాది సీసీఈ (నిరంతర మూల్యాంకన పద్ధతి) లో పరీక్షలను జరపనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. అయితే ఆ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థినుల సామర్థ్య పరిజ్ఞానం సన్నగిల్లే అవకాశాలున్నాయి. టీచర్లు లేని కస్తూర్బా పాఠశాలలకు తమ పిల్లలను పంపమని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పదోతరగతి తుది పరీక్షలకు ఇక నాలుగు నెలల సమయం మాత్రమే ఉండడంతో అధికారులు స్పందించి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తే విద్యార్థులకు న్యాయం చేసినట్లు అవుతుంది. పాలన ఇలా అస్తవ్యస్తంగా ఉంటే విద్యార్థుల సామర్థ్య ఫలితాలు ఎలా అభివృద్ధి చెందుతాయని పలువురు విద్యానిపుణులు ప్రశ్నిస్తున్నారు.
నివేదికలు పంపాం
సర్వశిక్ష అభియాన్ శాఖ ఉద్యోగుల జీతాలు, కస్తూర్బా పాఠశాల్లో ఖాళీల భర్తీకి సంబంధించిన నివేదికలను జిల్లా కలెక్టర్‌కు ఈ–ఆఫీస్ ద్వారా పంపాం. రెండు మూడు రోజుల్లో ఆమోదం పొందే అవకాశముంది.
– లక్ష్మీ, సర్వశిక్షాఅభియాన్ పీవో