అమ్మాయిల భద్రతకు భరోసా
- ‘శాలసిద్ధి’ వివరాలు పక్కాగా నమోదు చేయాలి
- ఎంఈఓలకు ఎస్ఎస్ఏ పీఓ ఆదేశం
అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రభుత పాఠశాలలతోపాటు కేజీబీవీల్లో అమ్మాయిల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ అధికారి దశరథరామయ్య తెలిపారు. స్థానిక ఆర్‌ఎంహెచ్‌ఎస్ స్కూల్లో శనివారం ‘శాలసిద్ధి’ కార్యక్రమంపై ఎంఈఓలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అందులో పీఓ మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక వసతులు, బోధనాభ్యసన ప్రక్రియలు, విద్యాభివృద్ధి, ఉపాధ్యాయుల పనితీరు, హెచ్ఎంల పర్యవేక్షణ, సమాజ భాగస్వామ్యం తదితర అంశాలను మదింపు చేసి లోపాలను సరి చేయడం ద్వారా ఉన్నత విద్యా ప్రమాణాలను అందించేందుకు ప్రభుత్వం ‘శాలసిద్ధి’ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. హెచ్ఎంలు చొరవ తీసుకుని ఈ వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఆన్లైన్ సీఎం డ్యాష్‌బోర్డుకు అనుసంధానంగా ఉంటుందన్నారు.
వివరాలన్నీ పంపిన తర్వాత అన్ని పాఠశాలలకూ రేటింగ్స్ ఇచ్చి వెనుకబడిన పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన జిల్లాలో అమ్మాయిల కోసం 62 కేజీబీవీలు ఏర్పాటయ్యాయన్నారు. వాటిల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అమ్మాయిల భధ్రతకు భరోసా ఇస్తున్నామన్నారు. మహిళా కమిషన్ సభ్యురాలు పర్వీన్‌భాను మాట్లాడుతూ బాలికలపై అత్యాచారాలను అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. బాల్య వివాహాలను అడ్డుకునేందుకు గ్రామీణ ప్రాంతాల్లో విస్త్రత అవగాహన కల్పించాలన్నారు. అమ్మాయిలకు ఆకతాయిల నుంచి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బాలికల అక్రమ రవాణా, కిడ్నాప్‌లను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో ఎస్ఎస్ఏ సెక్టోరియల్ ఆఫీసర్లు ఏఎంఓ చెన్నకృష్ణారెడ్డి, అలెస్కో బాలమురళీ, జీసీడీఓ వాణీదేవి, ఐఈడీ కో-ఆర్డినేటర్ పాండురంగ, ప్లానింగ్ కో-ఆర్డినేటర్ గోపాల్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.