వెలుగుల పథకంలో అన్నీ ఒడిదొడుకులే
హుజూర్నగర్, న్యూస్‌లైన్: ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు 50 యూనిట్లలోపు విద్యుత్ భారాన్ని భరిస్తూ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ వెలుగుల పథకం ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. ఎస్సీ, ఎస్టీల లబ్ధిదారులను గుర్తించడం విద్యుత్‌శాఖ అధికారులకు తలకు మించిన భారంగా పరిణమించింది. దీంతో వారు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ ప్రతి లబ్ధిదారుడు తప్పని సరిగా కుల ధ్రువీకరణ పత్రాలను ఈనెల 31 నాటికి అందజేయాలని ఆదేశాలు జారీచేశారు.
వాస్తవంగా ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది మార్చినెలలోనే ప్రవేశపెట్టినప్పటికీ అధికారికంగా ప్రకటన వెలువడేందుకు కొంత సమయం పట్టింది. ఈ క్రమంలో మూడవ విడత రచ్చబండలో అధికారికంగా ప్రకటన చేస్తూ డిసెంబర్ నెలలో కరెంటు బిల్లుల మాఫీ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. జిల్లాలో ఈ పథకం ద్వారా సుమారు 50వేల మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు ఉన్నట్టు విద్యుత్‌శాఖ వారి వద్ద ఉన్న సమాచారం ఆధారంగా గుర్తించింది. అయితే సదరు లబ్ధిదారుల్లో సుమారు 10వేల మంది నకిలీలు ఉన్నట్లు గమనించిన అధికారులు బిత్తరపోయారు.
భారంగా మారిన అసలు లబ్ధిదారుల గుర్తింపు
ఈ పథకాన్ని విధి విధానాలను రూపొందించకుండా ప్రవేశపెట్టడం తో అసలు లబ్ధిదారులను గుర్తించడం తలకు మించిన భారంగా తయారైంది.
ఒక దశలో సాంఘిక సంక్షేమశాఖ ద్వారా వివరాలు తెప్పించుకోవాలని ప్రయత్నించినప్పటికీ ఆ జాబితా కూడా పారదర్శకంగా ఉంటుందనే నమ్మకం లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టారు.
ఇప్పటికే విద్యుత్‌శాఖ అనేక ఒడిదుడుకుల మధ్య నడుస్తున్న తరుణంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఉచిత వెలుగుల పథకం కాస్తా సంబంధిత శాఖ అధికారులకు ఇబ్బందిగా మారింది.
లబ్ధిదారులను గుర్తించేందుకు అర్హులైన వారి నుంచి కుల ధ్రువీకరణ పత్రాలను సేకరించాలని నిర్ణయించారు.
అసలైన లబ్ధిదారులు కుల ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు మండల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
50 యూనిట్ల విద్యుత్ సరిపోయేనా...
ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ప్రవేశపెట్టిన ఈ పథకం వల్ల ఎంత మందికి లబ్ధి చేకూరుతుందనే విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ప్రతి ఇంట్లో టీవీ, ఫ్యాను, ఒకటో రెండో కరెంటు బల్బులు ఉండడం సాధారణమైపోయింది. ఎంత పొదుపుగా విద్యుత్ వినియోగించుకున్నప్పటికీ 50 యూనిట్లు దాటుతుందని లబ్ధిదారులు అంటున్నారు.
ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ప్రచారం తప్ప ఎస్సీ, ఎస్టీల కుటుంబాలకు ఎటువంటి మేలూ జరగదంటూ పెదవి విరుస్తున్నారు. అయితే రానున్న కాలంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యాక ప్రతినెలా ఈ పథకం ద్వారా ఎంత మందికి ప్రయోజనం చేకూరుతుందో వేచి చూడాల్సిందే.