హెచ్సీయూ పదవులకు ఎస్సీ, ఎస్టీ అధ్యాపకుల రాజీనామా
సాక్షి, హైదరాబాద్: హెచ్ సీయూ వైస్ చాన్స్లర్ అప్పారావు రాకను వ్యతిరేకిస్తూ సెంట్రల్ యూనివర్సిటీలో వివిధ పదవులు నిర్వహిస్తున్న ఎస్సీ, ఎస్టీ అధ్యాపకులు గురువారం రాజీనామా చేశారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన వీసీ అప్పారావు రాజీనామా చేయాలని, ప్రొఫెసర్ శ్రీవాస్తవ వీసీ పదవిని చేపట్టరాదని ఎస్సీ, ఎస్టీ అధ్యాపకులంతా తమ అధికార పదవులకు గతంలో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వీసీగా పెరియసామి నియామకం అనంతరం రాజీనామాలను ఉపసంహరించుకున్నారు. మళ్లీ ఈ నెల 22 నుంచి అప్పారావు వీసీగా కొనసాగడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పదిహేను మంది ఎస్సీ, ఎస్టీ అధ్యాపకులు తమ పదవులకు రాజీనామా చేస్తూ ఆ మేరకు లేఖను వీసీ అప్పారావుకు పంపారు.
ఈ రాజీనామా లేఖలో వీసీగా అప్పారావు రాకతో క్యాంపస్లో శాంతియుత వాతావరణం దెబ్బతిన్నదని, దీనికి వ్యతిరేకంగా అత్యంత శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులను ప్రధానంగా దళిత విద్యార్థులను టార్గెట్ చేసి మరీ లాఠీచార్జి చేయించడం, అరెస్టులకు పాల్పడటం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను శాంత పరిచేందుకు ప్రయత్నిస్తున్న అధ్యాపకులు రత్నం, తథాగత్లను పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తే దాన్ని ఖండించాల్సింది పోయి వారిపై తప్పుడు కేసులు బనాయించారని పేర్కొంటూ 15 మందితో కూడిన ఎస్సీ, ఎస్టీ అధ్యాపక బృందం రాజీనామా సమర్పించింది.