సాయి ప్రసాద్ పరిస్థితి విషమం
కోలారు(కర్ణాటక), న్యూస్‌లైన్: దుండగులు పెట్రోలు పోసి నిప్పుపెట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడి బెంగళూరులోని సెయింట్‌జాన్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థి కామేశ్వర సాయి ప్రసాద్ (22) పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు గురువారం తెలిపారు. అతని శరీరంలో కొన్ని అవయవాలు స్తంభించిపోయాయని, మరో రెండు, మూడు రోజులు గడిస్తే కానీ ఏ విషయమూ చెప్పలేమని వారు చెప్పారు. అతన్ని బతికించడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నామన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సాయి ప్రసాద్ కోలారు సమీపంలోని దేవరాజ్ అర్స్ వైద్య కళాశాలలో మెడిసిన్ ఫైనలియర్ చదువుతున్న సంగతి తెలిసిందే. గత మంగళవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా దేవరాజ్ అర్స్ వైద్య కళాశాల సమీపంలో.. మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అతని మెడలోని గొలుసును లాక్కుపోయే ప్రయత్నంలో ఈ దురాగతానికి పాల్పడడం విదితమే. ఈ సంఘటనను దారిదోపిడీ సందర్భంగా జరిగినదిగా సాయి ప్రసాద్ సహచరులు పేర్కొన్నారు.
ఆరు నెలలుగా ఏదో మార్పు: దేవరాజ్ అర్స్ వైద్య కళాశాలలో మెడిసిన్ ఫైనలియర్ చదువుతున్న సాయి ప్రసాద్ గత ఆరేడు నెలలుగా తరగతులకు సక్రమంగా హాజరు కావట్లేదని తెలిసింది. అతను మంచివాడని, ఎవరితోనూ గొడవ పడేవాడు కాదని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సాణికొప్ప తెలిపారు. మూడేళ్లుగా ఫస్ట్‌క్లాస్‌లోనే పాసవుతూ వస్తున్నాడని చెప్పారు. అయితే ఎందుకనో... ఫైనలియర్ తరగతులకు సక్రమంగా హాజరు కావట్లేదన్నారు. నెల రోజుల నుంచి క్యాంపస్‌లో కూడా కనిపించడం లేదని వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రఘునాథ్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ రామ్నివాస్ చెప్పారు.