విశాఖలో రైలింజన్లు, బోగీల కర్మాగారం!
స్టాడ్లర్ రైల్ మేనేజ్మెంట్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిపిన సీఎంవో
జ్యూరిచ్‌లో పలు సంస్థలతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
సాక్షి, అమరావతి: రైలింజన్లు, బోగీల తయారీ కర్మాగారాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు స్టాడ్లర్ రైల్ మేనేజ్మెంట్ ఏజీ కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) వెల్లడించింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు వెళుతూ మధ్యలో జ్యూరిచ్‌లో ఆగిన ముఖ్యమంత్రి.. సోమవారం అక్కడ స్టాడ్లర్ రైల్ మేనేజ్మెంట్ ఏజీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పీటర్ జెనెల్టర్ తదితరులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా స్టాడ్లర్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏపీలో ప్రారంభించాలని సీఎం కోరగా అందుకు సంస్థ ప్రతినిధులు అంగీకరించారు.
అల్యూమినియంతో బోగీలు తయారు చేయడం తమ ప్రత్యేకతని పీటర్ చెప్పారు. రైలింజన్లు, బోగీల తయారీ కర్మాగారంతో పాటు అన్ని విడిభాగాల తయారీకి విశాఖలో మరో ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పుతామన్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీలోని రెండు నగరాల్లో మెట్రో రైలు వ్యవస్థలను నెలకొల్పనున్నామని, హైస్పీడు రైళ్లను ప్రవేశపెడతామని చెప్పారు. రైల్వే మంత్రి కూడా ఏపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తుండడం వల్ల ఉత్పాదక కేంద్రాల ఏర్పాటుకు సానుకూలాంశాలు అధికంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు తగినంత భూ బ్యాంకు ఉందని తెలిపారు.
పోలవరం జల విద్యుత్ కేంద్రానికి బీకేడబ్ల్యూ సాంకేతికత
ఏపీలోని జల విద్యుత్ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే విషయాన్ని పరిశీలిస్తామని స్విట్జర్లాండ్‌కు చెందిన బీకేడబ్ల్యూ ఎనర్జీ సంస్థ హామీ ఇచ్చింది. జ్యూరిచ్‌లో ఆ సంస్థ ప్రతినిధి పాల్ కాజ్, ఎస్ఐసీసీ అధ్యక్షుడు ఫ్రాన్సిస్కో ఘోరితో సీఎం చంద్రబాబు పలు అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న 960 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని సీఎం కోరగా.. వారు తమ సమ్మతి తెలిపారు. దీనికి ముందు యూరోపియన్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చి కౌన్సిల్ ప్రతినిధులతో ఏర్పాటైన ద్వైపాక్షిక సమావేశంలోనూ సీఎం పాల్గొన్నారు.
ఎస్వీయూ, ఆంధ్ర, ఎఎన్‌యూల్లో సంస్థ నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవాలని, అమరావతిలో సంస్థ కార్యకలాపాలు విస్తరించాలని వారిని సీఎం కోరారు. అలాగే జర్మనీలో ముఖ్యమంత్రితో ఈఈఏఆర్సీ వ్యవస్థాపకుడు, ఏపీకి చెందిన రాజ్ వంగపండు, డ్యూర్ టెక్నాలజీస్ ప్రతినిధులు సమావేశమయ్యారు. సీఎం వెంట ఆర్థిక మంత్రి యనమల, ప్రభుత్వ సలçహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, సీఎం ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, ఇంధన వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, ఆర్థికాభివృద్ధి బోర్డు సీఈవో జాస్తి కృష్ణకిశోర్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి సాల్మన్ ఆరోగ్యరాజ్ తదితరులున్నారు.