మక్కా మృతుల్లో భారతీయులు కూడా ఉన్నారా?
తిరువనంతపురం: పెను విషాదాన్ని నింపిన మక్కా తొక్కిసలాటలో భారతీయులు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కేరళ, లక్షద్వీప్ నుంచి హజ్ యాత్రకు వెళ్ళిన యాత్రికులు గాయపడినట్లు సమాచారం. తమ రాష్ట్రానికి చెందిన వ్యక్తి గాయపడ్డాడా లేక ఆ తొక్కిసలాటలో చనిపోయాడా అనే దానిపై ఇంకా స్పష్టత లేదని కేరళ హోం మంత్రి రమేష్ చెన్నితాలా తెలిపారు.
అయితే లక్షద్వీప్‌కు చెందిన ఓ వ్యక్తి గాయపడినట్లు తమకు సమాచారం అందిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 310 మంది ఈ ఘోరకలిలో ప్రాణాలు కోల్పోగా, మరో 450మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆ ప్రదేశమంతా బాధితుల ఆర్తనాదాలతో మార్మోగుతున్నట్టుగా సీసీ టీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా కనబడుతోంది. ముఖ్యంగా మహిళలు, వృద్ధుల హాహాకారాలు రికార్డ్ అయినట్లు సమాచారం. దీంతో భారత్ నుంచి హజ్ యాత్రకు వెళ్లినవారి ఆచూకీ కోసం వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఘటనా స్థలం నుంచి బాధితులను తరలించేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సివిల్ డిఫెన్స్ అథారిటీ ప్రకటించింది. సుమారు నాలుగువేల మంది సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు తెలిపింది. కాగా ముస్లింలు పవిత్రంగా భావించే ఈ హజ్ యాత్రకు భారత నుంచి లక్షలాదిమంది ముస్లింలు మక్కాకు తరలి వెళ్లడం ఆనవాయితీ. అయితే ఈ సంవత్సరం సుమారు లక్షా 36 వేల మంది యాత్రికులు తరలి వెళ్లినట్టు తెలుస్తోంది.