భూముల ధరల పెంపునకు కసరత్తు
నూటికి నూరుశాతం పెంపుదల
విజయవాడ సమావేశంలో ప్రతిపాదనలు
ఆగస్టు 1 కల్లా నిర్ణయం?
విజయవాడ : త్వరలో ప్రభుత్వం భూముల మార్కెట్ విలువ పెంచనుంది. సామాన్యుడు భరించలేనంతగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ అధికారులు ఆ మేరకు ప్రతిపాదనలు తయారు చేయడంలో తలమునకలవుతున్నారు. బుధవారం విజయవాడ డీఐజీ కార్యాలయంలో జిల్లాలోని సబ్-రిజిస్ట్రార్లు డీ.ఆర్.లు సమావేశమయ్యారు. పట్టణ ప్రాంతాలు, మున్సిపల్ ఏరియాలు, గ్రామాల్లో ప్రస్తుతం వున్న రేట్లపై చర్చించారు.
జిల్లాలో ప్రభుత్వ మార్కెట్ విలువలకు, బయట మార్కెట్ విలువలకు పోల్చుకుంటూ అధికారులు రేట్లు పెంచేందుకు ప్రతిపాదనలు తయారు చేసినట్లు సమాచారం. సాక్షి సేకరించిన సమాచారం మేరకు విజయవాడ పరిసర ప్రాంతాలో అధికారులు తయారు చేసిన ప్రతిపాదనల ప్రకారం భూముల విలువలు ఇలా ఉన్నాయి. విజయవాడ శివార్లలోని నున్న గ్రామంలో ప్రస్తుతం ప్రభుత్వ మార్కెట్ విలువ ఎకరం రూ. 25 నుంచి రూ.30లక్షలు ఉండగా, రూ. కోటి రూపాయలకు పెంచాలని ప్రతిపాదించారు.
అదే విధంగా పటమట సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో కానూరు గ్రామంలో ప్రస్తుతం గజం రూ. 6400 ప్రభుత్వ విలువ ఉండగా దాన్ని రూ. 12వేలకు పెంచేందుకు ప్రతిపాదించినట్లు తెలిసింది. జిల్లాలో కంకిపాడు, గన్నవరం, ఆగిరిపల్లి, నూజివీడు, మల్లవల్లి, ఉయ్యూరు, ఇబ్రహీంపట్నం, కేతనకొండ, జగ్గయ్యపేట, మచిలీపట్నం, గుడివాడ, నందిగామ ప్రాంతాల్లో మార్కెట్ విలువలు ప్రస్తుతం ఉన్న విలువలకంటే నూటికి నూరు శాతం పెంచాలని ప్రతిపాదించినట్లు తెలిసింది.
మిగిలిన ప్రాంతాలలో 30శాతం పెంచాలని ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయం రెవెన్యూ అదికారులు తీసుకోవాల్సి ఉంది. ప్రతిపాదనలు తయారు చేశాక ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదిక పంపి, ఆగస్టు 1 నుంచి పెంచేవిధంగా అధికారులు ప్రణాళిక ఖరారు చేశారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ విజయవాడ డి.ఐ.జి. లక్ష్మీనారాయణ రెడ్డి, డి.ఆర్.లు బాలకృష్ణ, శ్రీనివాస్ జిల్లాలోని సబ్-రిజిస్ట్రార్లు పాల్గొన్నారు.