సిబ్బంది 20 మంది.. హాజరైన పిల్లలు 10 మంది !
శ్రీకాకుళం న్యూకాలనీ:జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని కోడిరామ్మూర్తి స్టేడియంలో బుధవారం జరిగిన స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలకు స్పందన కరువైంది. వైఎస్సాఆర్ కడప జిల్లాలోని స్పోర్ట్స్ స్కూల్లో నాలుగో తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించిన జిల్లాస్థాయి బాలబాలికల ఎంపికల నిర్వహణకు సంబంధిత అధికారులు ఏకంగా 20 మంది వ్యాయామ ఉపాధ్యాయులను సిబ్బందిగా నియమించారు. ఈ ఎంపికలకు కేవలం పది మంది చిన్నారులే హాజరయ్యారు. వీరిలో కూడా బాలికలు లేరు. ఇవే ఎంపికలకు గత ఏడాది సుమారు 80 మంది హాజరయ్యారు.
29న రాష్ట్రస్థాయి ఎంపికలు
ఎంపికలకు హాజరైన చిన్నారులకు వయసు, బరువు, ఎత్తులతోపాటు స్టాండింగ్ బ్రాడ్జంప్, వెర్టికల్ జంప్, మెడిసినల్బాల్, 30 మీటర్లు, 800 మీటర్ల పరుగు విభాగాల్లో పరీక్షలను నిర్వహించారు. జిల్లాస్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబర్చి ఎంపికైన పిల్లలు జాబితాను త్వరలో వెల్లడిచేస్తామని సంబంధిత అధికారులు వెల్లడించారు. జిల్లాస్థాయిలో ఎంపికైన పిల్లలు ఈనెల 29వ తేదీన కడపలో జరగనున్న రాష్ట్రస్థాయి ఎంపికలకు అర్హత సాధిస్తారని డీఎస్డీవో బి.శ్రీనివాసకుమార్ వెల్లడించారు. ఎంపికల కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి పి.సుందరరావు, పీఈటీ సంఘ అధ్యక్ష,కార్యదర్శులు వై.పోలినాయుడు, ఎం.సాంబమూర్తి, వెంకటరమణ, ఎస్.సూరిబాబు, వాసుదేవాచారి, ఎమ్మెస్సీ శేఖర్ పాల్గొన్నారు.