Standing Committe
-
అనంతపురం నగరపాలక సంస్థలో సత్తా చాటిన YSRCP
-
లీజుల విషయం తేల్చండి
స్టాండింగ్ కమిటీ అంటే లెక్కలేదా? ఎస్టేట్ అధికారులపై మండిపడిన సభ్యులు విజయవాడ సెంట్రల్ : ‘ఒకసారి వాయిదా వేసిన అంశాన్ని ఆ తర్వాత కమిటీ దృష్టికి ఎందుకు తీసుకురావడం లేదు. ఇదేం పద్ధతి. ఇలా అయితే నగరపాలక సంస్థకు ఆదాయం ఎలా వస్తుంది. స్టాండింగ్ కమిటీ అంటే లెక్కలేదా. లీజుల విషయం తేల్చండి..’ అంటూ ఎస్టేట్ అధికారులపై సభ్యులు మండిపడ్డారు. మేయర్ కోనేరు శ్రీధర్ అధ్యక్షతన గురువారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. సభ్యులు కాకు మల్లిఖార్జున యాదవ్, కొరకాని అనూరాధ మాట్లాడుతూ గత సమావేశంలో వాయిదా వేసిన 105 షాపుల రెన్యూవల్ అంశాన్ని ఏం చేశారని ప్రశ్నించారు. ఈ విషయంపై అధికారుల నుంచి సమాధానం కరువైంది. కాకు మల్లిఖార్జున్ మాట్లాడుతూ కమిటీ సభ్యులుగా తమ పదవీ కాలం పూర్తయ్యాక నిర్ణయం తీసుకుందామనుకుంటున్నారా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే సమావేశం నాటికి లీజుల విషయం ఏం చేశారో చెప్పాలన్నారు. మరీ అంత తక్కువా.. సింగ్‌నగర్‌లోని గుజ్జల సరళాదేవి కల్యాణ మండపం గ్రౌండ్ ఫ్లోర్‌ను రూ.8,55,999కు లీజుకు ఇవ్వాలన్న ప్రతిపాదనను స్టాండింగ్ కమిటీ సభ్యులు వ్యతిరేకించారు. సత్యనారాయణపురంలోని కర్మల భవనాన్ని రూ.6.40 లక్షలకు లీజుకు ఇచ్చారు. దీంతో పోలిస్తే సరళాదేవి కల్యాణ మండపం విస్తీర్ణం చాలా ఎక్కువన్నారు. గ్రౌండ్, మొదటి అంతస్తును కలిపి లీజుకు ఇచ్చేందుకు మరోసారి టెండర్ పిలవాలని సూచించారు. రాజీవ్‌గాంధీ పార్కులో బంగీ జంప్, క్రికెట్ నిర్వహించుకునేందుకు ఏడాదికి రూ.1,65,457కు పద్ధతిపై లీజుకు ఇవ్వాలన్న ప్రతిపాదనను వాయిదా వేశారు. టెండర్ పిలిస్తే ఇంతకంటే ఎక్కువ మొత్తం వస్తుందని సభ్యులు అభిప్రాయపడ్డారు. పలు షాపుల లీజుకు స్టాండింగ్ కమిటీ ఆమోదముద్ర వేసింది. ఉద్యోగుల మెడికల్ రియింబర్స్‌మెంట్, బకాయిల చెల్లింపునకు అంగీకరించారు. కమిటీ సభ్యులు చెన్నుపాటి గాంధీ, సహేరాభాను, నాగోతు నాగమణి, అదనపు కమిషనర్ అరుణ్‌బాబు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎం.గోపీనాయక్, ఎస్టేట్ అధికారి కృష్ణమూర్తి, చీఫ్ ఇంజినీర్ ఎంఏ షుకూర్, అకౌంట్స్ ఎగ్జామినర్ ఎంవీ ప్రసాద్, ఆకౌంట్స్ ఆఫీసర్ కె.అంబేద్కర్ పాల్గొన్నారు. -
స్టాండింగ్ కమిటీకి ఎదురు దెబ్బ
సాక్షి, సిటీబ్యూరో: మెట్రోరైలు మార్గాల్లో రహదారుల అభివృద్ధి పనులకు హైదరాబాద్ మెట్రోరైలు(హెచ్ఎంఆర్ ) నిధులివ్వాలన్న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ చేసిన తీర్మానాల్ని ప్రభుత్వం తిరస్కరించింది. మెట్రోరైలుకు ప్రకటనలు, వాణిజ్య కార్యకలాపాల ద్వారా భవిష్యత్తులో వచ్చే ఆదాయంలో సగం వాటా ఇవ్వాలన్న ప్రతిపాదననూ హెచ్ఎంఆర్ కొట్టిపడేసింది. ఈ నేపథ్యంలో.. ఎంపికచేసిన ఏడు ప్రాంతాల్లో రహదారి అభివృద్ధి పనులను జీహెచ్ఎంసీ నిధులతోనే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెట్రో రైలు పనులు జరుగుతున్న ఏడు ప్రాంతాల్లో దీర్ఘకాలం మన్నికగా ఉండే సీసీ రోడ్లు వేయాలని అధికారులు భావించారు. అనుమతి కోసం సదరు ప్రతిపాదనను జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ముందుంచారు. మెట్రోరైలు కోసం అవసరమయ్యే రోడ్ల విస్తరణకు జీహెచ్ఎంసీ నిధులు వెచ్చించడమేంటంటూ 2011 నవంబర్ 24న జరిగిన సమావేశం తిరస్కరించింది. ఆ నిధుల్ని హెచ్ఎంఆర్ వర్గాల నుంచే ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరింది. నగరంలో రహదారుల్ని వేస్తున్నదీ, నిర్వహిస్తున్నదీ జీహెచ్ఎంసీయే అయినందున.. మెట్రోరైలుకు వచ్చే ప్రకటనల ఆదాయంలో సగం వాటా తమకిచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉండగా, మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా సదరు రహదారుల విస్తరణ చేయాల్సింది స్థానిక సంస్థ(జీహెచ్ఎంసీ)యేనని, రహదారుల నిర్వహణ తదితర బాధ్యతలు కూడా దానివే అయినందున ఆ వ్యయం జీహెచ్ఎంసీయే భరించాలని హెచ్ఎంఆర్ వర్గాలు పేర్కొన్నాయి. పైగా ఆస్తుల సేకరణకు నష్టపరిహారం తామే చెల్లిస్తున్నందున, ఆమేరకు జీహెచ్ఎంసీపై భారం తగ్గిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో స్టాండింగ్ కమిటీ తీర్మానాన్ని ప్రభుత్వం అంగీకరించకపోగా కమిటీకి షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనికి తలొగ్గని స్టాండింగ్ కమిటీ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోలేదు. పాత నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించింది. మెట్రో రైలుకు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో తమ వాటా ఇస్తేనే రహదారుల అభివృద్ధికి నిధులు వెచ్చిస్తామని స్పష్టం చేసింది. ఆమేరకు, గత సెప్టెంబర్ 12న జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో మరోమారు తీర్మానం చేశారు. ఆ వ్యవహారంపై తిరిగి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మెట్రోరైలు కోసం జీహెచ్ఎంసీ అదనంగా ఎలాంటి రోడ్డు నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయలేదని, పీపీపీ ప్రాజెక్టుల్లోని వయబిలిటీ గ్యాప్ ఫండింగ్(వీజీఎఫ్) స్కీం మార్గదర్శకాల కనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని మెట్రోరైలు వర్గాలు పేర్కొన్నాయి. అన్నీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, జీహెచ్ఎంసీ చట్టం మేరకు తనకున్న అధికారాలను వినియోగించి స్టాండింగ్ కమిటీ తీర్మానాన్ని రద్దు చేసింది. తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్‌కు సూచించింది. ఈ మేరకు మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ సోమవారం జీవో జారీ చేసింది.