లీజుల విషయం తేల్చండి
లీజుల విషయం తేల్చండి
Published Fri, Jul 22 2016 4:40 PM | Last Updated on Mon, Sep 4 2017 5:51 AM
స్టాండింగ్ కమిటీ అంటే లెక్కలేదా?
ఎస్టేట్ అధికారులపై మండిపడిన సభ్యులు
విజయవాడ సెంట్రల్ :
‘ఒకసారి వాయిదా వేసిన అంశాన్ని ఆ తర్వాత కమిటీ దృష్టికి ఎందుకు తీసుకురావడం లేదు. ఇదేం పద్ధతి. ఇలా అయితే నగరపాలక సంస్థకు ఆదాయం ఎలా వస్తుంది. స్టాండింగ్ కమిటీ అంటే లెక్కలేదా. లీజుల విషయం తేల్చండి..’ అంటూ ఎస్టేట్ అధికారులపై సభ్యులు మండిపడ్డారు. మేయర్ కోనేరు శ్రీధర్ అధ్యక్షతన గురువారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. సభ్యులు కాకు మల్లిఖార్జున యాదవ్, కొరకాని అనూరాధ మాట్లాడుతూ గత సమావేశంలో వాయిదా వేసిన 105 షాపుల రెన్యూవల్ అంశాన్ని ఏం చేశారని ప్రశ్నించారు. ఈ విషయంపై అధికారుల నుంచి సమాధానం కరువైంది. కాకు మల్లిఖార్జున్ మాట్లాడుతూ కమిటీ సభ్యులుగా తమ పదవీ కాలం పూర్తయ్యాక నిర్ణయం తీసుకుందామనుకుంటున్నారా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే సమావేశం నాటికి లీజుల విషయం ఏం చేశారో చెప్పాలన్నారు.
మరీ అంత తక్కువా..
సింగ్‌నగర్‌లోని గుజ్జల సరళాదేవి కల్యాణ మండపం గ్రౌండ్ ఫ్లోర్‌ను రూ.8,55,999కు లీజుకు ఇవ్వాలన్న ప్రతిపాదనను స్టాండింగ్ కమిటీ సభ్యులు వ్యతిరేకించారు. సత్యనారాయణపురంలోని కర్మల భవనాన్ని రూ.6.40 లక్షలకు లీజుకు ఇచ్చారు. దీంతో పోలిస్తే సరళాదేవి కల్యాణ మండపం విస్తీర్ణం చాలా ఎక్కువన్నారు. గ్రౌండ్, మొదటి అంతస్తును కలిపి లీజుకు ఇచ్చేందుకు మరోసారి టెండర్ పిలవాలని సూచించారు.
రాజీవ్‌గాంధీ పార్కులో బంగీ జంప్, క్రికెట్ నిర్వహించుకునేందుకు ఏడాదికి రూ.1,65,457కు పద్ధతిపై లీజుకు ఇవ్వాలన్న ప్రతిపాదనను వాయిదా వేశారు. టెండర్ పిలిస్తే ఇంతకంటే ఎక్కువ మొత్తం వస్తుందని సభ్యులు అభిప్రాయపడ్డారు.
పలు షాపుల లీజుకు స్టాండింగ్ కమిటీ ఆమోదముద్ర వేసింది. ఉద్యోగుల మెడికల్ రియింబర్స్‌మెంట్, బకాయిల చెల్లింపునకు అంగీకరించారు. కమిటీ సభ్యులు చెన్నుపాటి గాంధీ, సహేరాభాను, నాగోతు నాగమణి, అదనపు కమిషనర్ అరుణ్‌బాబు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎం.గోపీనాయక్, ఎస్టేట్ అధికారి కృష్ణమూర్తి, చీఫ్ ఇంజినీర్ ఎంఏ షుకూర్, అకౌంట్స్ ఎగ్జామినర్ ఎంవీ ప్రసాద్, ఆకౌంట్స్ ఆఫీసర్ కె.అంబేద్కర్ పాల్గొన్నారు.
Advertisement