స్టాండింగ్ కమిటీకి ఎదురు దెబ్బ
సాక్షి, సిటీబ్యూరో: మెట్రోరైలు మార్గాల్లో రహదారుల అభివృద్ధి పనులకు హైదరాబాద్ మెట్రోరైలు(హెచ్‌ఎంఆర్ ) నిధులివ్వాలన్న జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ చేసిన తీర్మానాల్ని ప్రభుత్వం తిరస్కరించింది. మెట్రోరైలుకు ప్రకటనలు, వాణిజ్య కార్యకలాపాల ద్వారా భవిష్యత్తులో వచ్చే ఆదాయంలో సగం వాటా ఇవ్వాలన్న ప్రతిపాదననూ హెచ్‌ఎంఆర్ కొట్టిపడేసింది. ఈ నేపథ్యంలో.. ఎంపికచేసిన ఏడు ప్రాంతాల్లో రహదారి అభివృద్ధి పనులను జీహెచ్‌ఎంసీ నిధులతోనే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మెట్రో రైలు పనులు జరుగుతున్న ఏడు ప్రాంతాల్లో దీర్ఘకాలం మన్నికగా ఉండే సీసీ రోడ్లు వేయాలని అధికారులు భావించారు. అనుమతి కోసం సదరు ప్రతిపాదనను జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ముందుంచారు. మెట్రోరైలు కోసం అవసరమయ్యే రోడ్ల విస్తరణకు జీహెచ్‌ఎంసీ నిధులు వెచ్చించడమేంటంటూ 2011 నవంబర్ 24న జరిగిన సమావేశం తిరస్కరించింది. ఆ నిధుల్ని హెచ్‌ఎంఆర్ వర్గాల నుంచే ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరింది. నగరంలో రహదారుల్ని వేస్తున్నదీ, నిర్వహిస్తున్నదీ జీహెచ్‌ఎంసీయే అయినందున.. మెట్రోరైలుకు వచ్చే ప్రకటనల ఆదాయంలో సగం వాటా తమకిచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
ఇదిలా ఉండగా, మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా సదరు రహదారుల విస్తరణ చేయాల్సింది స్థానిక సంస్థ(జీహెచ్‌ఎంసీ)యేనని, రహదారుల నిర్వహణ తదితర బాధ్యతలు కూడా దానివే అయినందున ఆ వ్యయం జీహెచ్‌ఎంసీయే భరించాలని హెచ్‌ఎంఆర్ వర్గాలు పేర్కొన్నాయి. పైగా ఆస్తుల సేకరణకు నష్టపరిహారం తామే చెల్లిస్తున్నందున, ఆమేరకు జీహెచ్‌ఎంసీపై భారం తగ్గిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో స్టాండింగ్ కమిటీ తీర్మానాన్ని ప్రభుత్వం అంగీకరించకపోగా కమిటీకి షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనికి తలొగ్గని స్టాండింగ్ కమిటీ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోలేదు. పాత నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించింది. మెట్రో రైలుకు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో తమ వాటా ఇస్తేనే రహదారుల అభివృద్ధికి నిధులు వెచ్చిస్తామని స్పష్టం చేసింది. ఆమేరకు, గత సెప్టెంబర్ 12న జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో మరోమారు తీర్మానం చేశారు.
ఆ వ్యవహారంపై తిరిగి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మెట్రోరైలు కోసం జీహెచ్‌ఎంసీ అదనంగా ఎలాంటి రోడ్డు నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయలేదని, పీపీపీ ప్రాజెక్టుల్లోని వయబిలిటీ గ్యాప్ ఫండింగ్(వీజీఎఫ్) స్కీం మార్గదర్శకాల కనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని మెట్రోరైలు వర్గాలు పేర్కొన్నాయి. అన్నీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ చట్టం మేరకు తనకున్న అధికారాలను వినియోగించి స్టాండింగ్ కమిటీ తీర్మానాన్ని రద్దు చేసింది. తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు సూచించింది. ఈ మేరకు మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ సోమవారం జీవో జారీ చేసింది.