జూన్‌లో ‘మెట్రో’ డౌటే!
► ముంచుకొస్తున్న మెట్రో రైలు ముహూర్తం
► ఇంకా పూర్తికాని పనులు
► ప్రారంభంపై అనుమానాలు!
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రైలు ముహూర్తం మంచుకొస్తున్నా..ప్రయాణికులకు అవసరమైన వసతుల కల్పన, స్టేషన్ల నిర్మాణం పనులు ఇంకా పూర్తి కాలేదు. దీంతో జూన్ తొలివారంలో మెట్రో రైలు ప్రారంభోత్సవంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూన్‌లో ప్రారంభోత్సవం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం గతంలో సంకేతాలిచ్చినప్పటికీ బాలారిష్టాలు తప్పడంలేదు. ప్రధానంగా మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు ఫీడర్ బస్సులు(అనుసంధాన బస్సులు)నడిపే అంశంపై స్పష్టత కరువైంది. మరోవైపు మియాపూర్-ఎస్.ఆర్.నగర్(12కి.మీ) మార్గంలో స్టేషన్ల నిర్మాణం పనులు నత్తనడకన సాగుతుండడం ఈ అనుమానాలకు తావిస్తోంది. ఇక నాగోల్-మెట్టుగూడా(8 కి.మీ) మార్గంలో మెట్రో రైళ్ల వాణిజ్య కార్యకలాపాలకు కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ ధ్రువీకరణ మంజూరులో ఆలస్యమవుతుండడం శాపంగా పరిణమిస్తోంది.
కాగితాలపైనే ఫీడర్ బస్సులు...
నాగోల్-మెట్టుగూడా,మియాపూర్-ఎస్.ఆర్.నగర్ మార్గంలో జూన్ తొలివారంలో 20 కి.మీ మెట్రో మార్గం ప్రారంభోత్సవం ఉంటుందని గతంలో రాష్ట్ర సర్కారు పెద్దలు ఆర్భాటంగా ప్రకటించారు. కానీ మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీల నుంచి వచ్చిపోయే ప్రయాణీకుల సౌకర్యార్థం ఫీడర్‌బస్సులు(అనుసంధాన బస్సులు) నడపుతామనీ అప్పట్లో స్పష్టంచేశారు. కానీ ప్రారంభోత్సవానికి 40 రోజుల వ్యవధి మాత్రమే ఉన్నప్పటికీ ఇప్పటివరకూ ఒక్క బస్సునూ కొనుగోలు చేయకపోవడం గమనార్హం. కనీసం ఏ స్టేషన్‌కు ఎంత మంది ప్రయాణికులు సమీప కాలనీల నుంచి వస్తారో అన్న అంశంపైనా అధ్యయనం కరువైంది. ఫీడర్‌బస్సులు లేకపోతే సమీప కాలనీల నుంచి వచ్చిపోయే ప్రయాణికులు మళ్లీ వ్యక్తిగత వాహనాలను ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొంటుంది.ఒక సొంత వాహనాల్లో మెట్రో స్టేషన్‌కు వచ్చి తమ వాహనాలను మెట్రో పార్కింగ్ స్థలాల్లో పార్క్ చేస్తే పార్కింగ్ చార్జీల రూపేణా చేతిచమురు వదిలించుకోక తప్పదు. మరోవైపు అన్ని స్టేషన్ల వద్ద వాహనాలను నిలిపేందుకు పార్కింగ్ వసతులు లేకపోవడం గమనార్హం.
పాతనగరం అలైన్‌మెంట్‌పైనా అదే తీరు..
పాతనగరంలో ప్రార్థనా స్థలాలకు ఇబ్బందులు లేకుండా మెట్రో మార్గాన్ని దారి మళ్లించాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశం వివాదాస్పదం కావడంతో మెట్రో అలైన్‌మెంట్ మార్పుపై అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తామని గతంలో అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రకటించారు. కానీ ఇప్పటివరకు సమావేశం జరగలేదు. దీంతో పాతనగరానికి మెట్రో రైళ్లు మరో రెండేళ్లు ఆలస్యంగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలైన్‌మెంట్ ఖరారు కాకపోవడంతో జేబీఎస్-ఫలక్‌నుమా మార్గంలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.3 కి.మీ మార్గంలో మెట్రో పనులు నిలిచాయి.
నత్తనడకన స్టేషన్ నిర్మాణం పనులు..
ఎస్.ఆర్.నగర్ మియాపూర్ మార్గంలో ఆరు స్టేషన్ల నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ మార్గంలో జూన్ తొలివారంలో మెట్రో రైళ్ల వాణిజ్య రాకపోకలు ప్రారంభమైతే ప్రయాణికులకు అసంపూర్తి స్టేషన్లతో ఇబ్బం దులు తప్పవన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ మార్గానికి సంబంధించి కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ పరీక్షలు జూన్‌లోనే నిర్వహించే అవకాశాలుండడంతో ఈ మార్గం లో మెట్రో రైళ్ల వాణిజ్య రాకపోకలకు మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.