ఉప్పల్ నుంచి యాదాద్రికి మెట్రో రైలు?
ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదన
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ నుంచి పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి వ రకు హైస్పీడ్ మెట్రో మార్గం ఏర్పాటు చేసే ప్రతిపాదనపై రాష్ట్రప్రభుత్వం దృష్టి సారించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏటా రూ. 100 కోట్ల బడ్జెట్ కేటాయించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో యాదాద్రికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం భవిష్యత్‌లో హైస్పీడ్ మెట్రో రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని సీఎం సంకల్పించినట్లు తెలిసింది. ఈ అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మున్సిపల్ పరిపాలన, మెట్రోరైలు అధికారులను సీఎం ఆదేశించినట్లు సమాచారం. ప్రస్తుతం నాగోలు నుంచి రహేజా ఐటీపార్క్ వరకు మెట్రో మార్గం ఏర్పాటు చేస్తున్న విషయం విదితమే.
ఇప్పటికే ఉప్పల్ రింగ్‌రోడ్డులో మెట్రో రైలు స్టేషన్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఉప్పల్ రింగ్‌రోడ్డు నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదాద్రి పుణ్యక్షేత్రానికి మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేయాలంటే ప్రతి కిలోమీటరుకు రూ. 200 కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఈ స్థాయిలో నిధులను వెచ్చించే పరిస్థితి లేకపోవడంతో పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఇటీవలే రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ రెండోదశ మెట్రో మార్గాన్ని 83 కి.మీ. మేర ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ ఈ మార్గంపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.
ప్రభుత్వ ఆదేశాలు అందలేదు
ఉప్పల్ మెట్రోరైలు స్టేషన్‌కు సమీపంలో ప్రయాణికులకు వివిధ రకాల మౌలిక వసతులు కల్పించేందుకు ఎకరం స్థలాన్ని హెచ్‌ఎంఆర్ సంస్థ లీజుకు తీసుకుంది. యాదాద్రి వరకు మెట్రో మార్గాన్ని పొడిగించే అంశంపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు మాకు ఆదేశాలేమీ అందలేదు.
- ఎన్వీఎస్‌రెడ్డి, హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ